అదృష్ట జాతకుడు ఉమెన్ చాందీ

ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలి, వీలైతే ఒక్కసారైనా మంత్రి కావాలి, కాలం కలిసొస్తే ఒక్కసారైనా ముఖ్యమంత్రి కావాలి… ఇదీ సగటు రాజకీయ నాయకుడి కోరిక … మనసులోని మాట. [more]

;

Update: 2020-10-09 16:30 GMT

ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలి, వీలైతే ఒక్కసారైనా మంత్రి కావాలి, కాలం కలిసొస్తే ఒక్కసారైనా ముఖ్యమంత్రి కావాలి… ఇదీ సగటు రాజకీయ నాయకుడి కోరిక … మనసులోని మాట. అయితే ఇది అంత కష్టమైన పనా, అసాధ్యమా? అని ప్రశ్నించుకుంటే కాదనే సమాధానం లభిస్తుంది. మంత్రి, ముఖ్యమంత్రి పదవులను పక్కనపెడితే ప్రజాప్రతినిధి కావడం, సుదీర్ఘ కాలం కొనసాగడం అంత కష్టమేమీ కాదు. అయితే అందుకు భగీరథ ప్రయత్నం కావాలి. ప్రజలతో మమేకం కావాలి, వారే ప్రాణంగా బతకాలి, వారికి అన్నివేళలా అండగా నిలబడాలి, భరోసా ఇవ్వాలి,వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకోవాలి, అవినీతికి దూరంగా ఉండాలి… ఈ లక్షణాలు కలిగిన నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఎప్పుడూ అతని వెంటనే ఉంటారు. ఎన్నికల్లో ప్రతిసారీ గెలిపిస్తుంటారు. దశాబ్దాల పాటు తమ ప్రతినిధిగా చట్టసభకు పంపిస్తుంటారు. అందుకు నిలువెత్తు నిదర్శనం ఉమెన్ చాందీ. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం నేటితరం నాయకులకు ఒక పాఠ్యాంశంగా ఉండాలని చెప్పడం అతిశయోక్తి కాదు.

ఇరవై ఏళ్ల వయసులో…..

ఉమెన్ చాందీ జీవితాన్ని దగ్గరగా పరిశీలిస్తే ఒక నాయకుడు ఎంతకాలమైనా ప్రజల జీవితాల్లో ఉండగలరని అర్థమవుతుంది. ఇరవై ఆరేళ్ల చిన్న వయసులో 1970 సెప్టెంబరులో తొలిసారి ఉమెన్ చాందీ శాసనసభకు ఎన్నికైనారు. అప్పటి నుంచి ఇంతవరకు వెనుతిరిగి చూసేపరిస్థితి ఆయనకు ఏనాడూ ఎదురుకాలేదు. నియోజకవర్గం మారకపోవడం, పార్టీ మారకపోవడం ఆయన ప్రత్యేకతలు. ఇంతకాలం ప్రజా జీవి తంలో ఉండటం, పార్టీలు, నియోజకవర్గాలు మారకపోవడం ఉమెన్ చాందీ విశిష్టత. ఈ తరంలో ఇలాంటి నాయకుడు ఉండటం అరుదని చెప్పవచ్చు. 1970, 1977, 80, 82, 87, 91, 96, 2001, 2006, 2011, 2016ల్లో వరుసగా కొట్టాయం జిల్లాలోని పూతుపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా 11సార్లు అసెంబ్లీకి ఎన్నికవడం చాందీ ప్రత్యేకత. ఎన్నోసార్లు ఆయనను ఓడించేందుకు ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలు ప్రజాభిమానం ముందు నీరుగారిపోయాయి.

నియోజకవర్గాన్ని విస్మరించకుండా….

మంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా నియోజకవర్గాన్ని విస్మరించకపోవడమే ఉమెన్ చాందీ గెలుపునకు కారణం. ఏ హోదాలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండటమే ఆయన విజయ రహస్యం. ఎన్ని పనులున్నా శనివారం సాయంత్రానికి నియోజక వర్గ కేంద్రమైన పూతుపల్లికి చేరుకోవడం ఆదివారమంతా అక్కడే గడపటం, మళ్లీ అదే రోజు సాయంత్రం బయలుదేరి రాజధాని తిరువనంతపురం రావడం ఆయన అయిదు దశాబ్దాల ప్రజా జీవితంలో భాగమైంది. అందువల్లే ప్రజలకు చేరువయ్యానని చాందీ చెబుతుంటారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా వెంటనే వెళ్లడం ఆయనకు అలవాటు. అప్పటికప్పుడు వీలు కాకపోతే తరవాత వెళ్లడం, అదీ సాధ్యం కాకపోతేకనీసం వారికి లేఖ రాయడం ఆయన ప్రత్యేకత. ఇప్పటికీ ఇది ఆయన జీవితంలో ఒక భాగంగా ఉంది.

మూడోసారి కూడా…..

కాంగ్రెస్ దిగ్గజ నేతలు కరుణాకరన్, ఏకే ఆంటోని మంత్రివర్గాల్లో కార్మిక, ఆర్ధిక, హోం శాఖల మంత్రిగా పనిచేసిన ఉమెన్ చాందీ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షనేతగా, కీలకమైన ప్రజా పద్దుల సంఘం (పీఏసీ- పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఛైర్మన్ గా సేవలందించారు. 2004 నుంచి 2006 వరకు మొదటిసారి, 2011 నుంచి 2016 వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పరిశీలకుడిగా పని చేస్తున్నారు. అదే సమయంలో వచ్చే ఏడాదిలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు ఉమెన్ చాందీ. సీల్పీ నాయకుడు రమేష్ చెన్నితల, పీసీసీ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్ వంటి నాయకులు రంగంలో ఉన్నప్పటికీ మళ్లీ మూడోసారి ఉమెన్ చాందీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని తోసిపుచ్చలేం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News