ఉమ్మారెడ్డికి ఆ పదవి రిజ‌ర్వ్ అయిందా ?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఆ పార్టీ ప్రధాన కార్యద‌ర్శి ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లుకు కీల‌క ప‌ద‌వి ఇచ్చేందు కు సీఎం జ‌గ‌న్ నిర్ణయించుకున్నార‌ని… ఆయ‌న‌ను త్వర‌లోనే పెద్దల స‌భ‌కు [more]

Update: 2021-06-20 03:30 GMT

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఆ పార్టీ ప్రధాన కార్యద‌ర్శి ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లుకు కీల‌క ప‌ద‌వి ఇచ్చేందు కు సీఎం జ‌గ‌న్ నిర్ణయించుకున్నార‌ని… ఆయ‌న‌ను త్వర‌లోనే పెద్దల స‌భ‌కు పంప‌నున్నట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. సుమారు మూడు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో ఉన్న ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లు తొలుత టీడీపీ , త‌ర్వాత కాంగ్రెస్ పార్టీల్లో త‌న స‌త్తా చాటుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయ‌న ప‌లు ప‌ద‌వులు అలంక‌రించారు. జిల్లాలో కాపు సామాజిక వ‌ర్గంలో ఆయ‌న కీల‌క నేత‌గా ఉంటున్నారు.

వైసీపీలో చేరిన తర్వాత…?

వైసీపీలో చేరిన త‌ర్వాత‌.. వైసీపీ పార్టీ ప‌ద‌వులు ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లును వరించాయి. అదే స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌కు, ఆయ‌న కుటుంబానికి కూడా అత్యంత స‌న్నిహిత నేత‌గా ఉమ్మారెడ్డి ఎదిగారు. అంతేకాకుండా.. 2014, 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టో క‌మిటీలో ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లు కీల‌క పాత్ర పోషించారు. అదే స‌మ‌యంలో పాద‌యాత్రలో అనుస‌రించాల్సి విధి విధానాల క‌మిటీలోనూ ఉమ్మారెడ్డి ముఖ్య నేత‌గా వ్యవ‌హ‌రించారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు ఎప్పుడో ఎమ్మెల్సీగా ప‌ద‌వి ఇచ్చి గౌర‌వించారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. అయితే.. ఈ అవ‌కాశం ద‌క్కలేదు. కానీ, మండ‌లిలో వైసీపీ ప‌క్ష నేత‌గా ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లు స‌మ‌ర్ధంగా వ్యవ‌హ‌రించారు.

తెర వెనక ప్రయారిటీ…..

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లు అల్లుడు.. రోశ‌య్యకు పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇప్పించుకున్నారు. పొన్నూరులో ఉన్న సామాజిక స‌మీక‌ర‌ణ‌లు, సీనియార్టీని ప‌క్కన పెట్టి కూడా జ‌గ‌న్ ఉమ్మారెడ్డిని సంతృప్తి ప‌రిచేందుకే రోశ‌య్యకు 15 రోజుల ముందు టిక్కెట్ ఇవ్వడం.. ఆయ‌న గెల‌వ‌డం జ‌రిగాయి. ప్రభుత్వం వ‌చ్చాక కూడా జ‌గ‌న్ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లుకి తెర‌ముందు క‌న్నా తెర‌వెన‌క ప్రయార్టీ ఇస్తూ వ‌చ్చారు. ఇలా వైసీపీలో కీల‌క పాత్ర పోషిస్తున్న ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లు ఎమ్మెల్సీ ప‌ద‌వి నుంచి రిటైర్ అయ్యారు.

రెన్యువల్ చేస్తారనుకున్నా…..

వాస్తవానికి ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లుకు మ‌ళ్లీ ఎమ్మెల్సీని పున‌రుద్ధరిస్తార‌ని అనుకున్నారు. కానీ, ఆయ‌న‌కు మ‌ళ్లీ రెన్యువ‌ల్ జ‌ర‌గ‌లేదు. అయితే, త్వర‌లోనే ఆయ‌న‌ను రాజ్యస‌భ‌కు పంపుతార‌ని.. ఈ క్రమంలో ఆయ‌న పేరును ఇప్పటికే జ‌గ‌న్ రిజ‌ర్వ్ చేసుకున్నార‌ని.. వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. త‌ద్వారా.. రాజ్యస‌భ‌లో వైసీపీ వాణిని మ‌రింత‌గట్టిగా వినిపించేందుకు అవ‌కాశం ఉంటుందని జ‌గ‌న్ భావిస్తున్నట్టు స‌మాచారం. వివాద ర‌హితుడు, మేధావిగా పేరున్న ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లుకి రాజ్యస‌భ సీటు ఇవ్వడం స‌మంజ‌స‌మేన‌నేది రాజ‌కీయ వ‌ర్గాల మాట‌.

సామాజిక వర్గం కోటాలో…?

ఇక వైసీపీ నుంచి రెడ్డి వ‌ర్గం నేత‌లే ఎక్కువ మంది రాజ్యస‌భ‌కు వెళ్లారు. ఇక కొద్ది రోజుల క్రితం ఇద్దరు బీసీల‌ను కూడా రాజ్యస‌భ‌కు పంపారు. కాపు కోటాలో ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లుని రాజ్యస‌భ‌కు పంపితే రాజ‌ధాని ప్రాంతంలో కాపుల‌తో పాటు కోస్తాలో ఉన్న ఈ బ‌ల‌మైన వ‌ర్గాన్ని ఆక‌ట్టుకోవ‌డం సులువు అవుతుంద‌ని జ‌గ‌న్ ఈక్వేష‌న్ అట‌. . కాపులను ఆక‌ట్టుకునే క్రమంలోనే జ‌గ‌న్ తోట‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లుని ఏకంగా రాజ్యస‌భ‌కు పంపితే ఆ వ‌ర్గంలో పార్టీకి మంచి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News