విషవలయంలోకి నెట్టేస్తున్నారా?

అదుపు తప్పిన ఖర్చు అస్తవ్యస్త పరిస్థితికి దారి తీస్తుంది. కుటుంబాలైతే అప్పుల పాలై కునారిల్లిపోతాయి. దేశాలైతే దివాళా తీసి పరపతి పుట్టక ప్రజలపై అదుపాజ్ణలు కోల్పోతాయి. ద్రవ్యోల్బణం, [more]

;

Update: 2020-12-24 15:30 GMT

అదుపు తప్పిన ఖర్చు అస్తవ్యస్త పరిస్థితికి దారి తీస్తుంది. కుటుంబాలైతే అప్పుల పాలై కునారిల్లిపోతాయి. దేశాలైతే దివాళా తీసి పరపతి పుట్టక ప్రజలపై అదుపాజ్ణలు కోల్పోతాయి. ద్రవ్యోల్బణం, విదేశాల ఆర్థిక ఆంక్షల వంటివి కొనసాగుతాయి. సంక్షోభాలు తలెత్తుతాయి. మరి దేశంలోనే రాష్ట్రాలు అవసరాలకు మించి వ్యయం చేస్తే ఆ భారం ఎవరిపై పడుతుంది. దాని నుంచి గట్టెక్కే పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. వివిధ రాజకీయ పార్టీలు అధికారమే పరమావధిగా హామీలు గుప్పించి రుణ సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ఈరకమైన పరిస్థితిని నివారించేందుకే కేంద్రం అప్పులపై పరిమితిని విధిస్తూ ఎఫ్ ఆర్ బీఎం చట్టాన్ని తెచ్చింది. దాని నుంచి కూడా తెలివిగా తప్పించుకుంటూ రాష్ట్రాలు వక్రమార్గాల్లో రుణసేకరణ చేస్తున్నాయి. ఇది భవిష్యత్ తరాలపై భారంగా పరిణమించే ప్రమాదం ఎంతైనా ఉంది. శృతి మించిన సంక్షేమ పథకాలే ఈ దుస్థితికి కారణం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఈ బాటలో పయనిస్తోందని కేంద్ర సంస్థలు అంచనా వేస్తున్నాయి. వనరులు పెరగకుండా, పెట్టుబడి వ్యయం చేయకుండా కేవలం సంక్షేమంపైనే ఫోకస్ పెట్టడంతో రానున్న కాలంలో అప్పులు చెల్లించలేక చేతులు ఎత్తేయాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఆర్థిక అత్యయిక స్థితి వంటి వాతావరణం ఏర్పడితే పెట్టుబడులు రావు. అప్పులు పుట్టవు. ప్రజలకు ఆదాయమార్గాలు మూసుకుపోతాయి. ఇదంతా ఒక విషవలయంగా మారుతుంది.

ప్రజలే పెట్టుబడి…

దేశంలోనే ఆర్థికంగా సంపన్నంగా ఉన్న రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండేది. విభజన తర్వాత అవసరానికి మించి సంక్షేమ పథకాల వెల్లువ మొదలైంది. తెలంగాణకు ఆర్థికంగా వనరులు సమకూర్చి పెట్టే హైదరాబాద్ ఉండటంతో రెవిన్యూ మిగులు తో రాష్ట్రం ఏర్పాటైంది. మౌలిక వసతుల కారణంగా ఎప్పటికప్పుడు పెట్టుబడులు రావడం,ఉపాది కల్పన, ఆదాయ వనరుల పెరుగుదల సాగుతూ వస్తోంది. ఖర్చులు, సంక్షేమ పద్దు పెరిగినప్పటికీ తట్టుకోగలుగుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడి వ్యయం పెరగడం లేదు. మౌలిక వసతులు అంతంతమాత్రంగా ఉన్నాయి. కొత్తగా పరిశ్రమల సంఖ్య కూడా పెద్దగా లేదు. అయినప్పటికీ సంక్షేమ పద్దు పెరిగిపోతోంది. ఏపీలో ఎనభై శాతం కుటుంబాలకు ఏదో రూపంలో ప్రభుత్వ పథకాల లబ్ధి సమకూరుతోంది. ఏటా 80వేల కోట్ల రూపాయల మేరకు సంక్షేమంపై వెచ్చించాల్సి వస్తోంది. తాజా గణాంకాల ప్రకారం ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయంలో 50శాతం పైచిలుకు అప్పులు తెస్తూ ఖర్చు పెడుతోంది. ప్రభుత్వం చేస్తున్న అప్పులకు ప్రజలే పెట్టుబడిగా భావించాలి. ప్రభుత్వ బడ్జెట్ , రాష్ట్ర జాతీయోత్పత్తి, జన సంఖ్య, వారి ఆదాయాలను అంచనా వేస్తూ ఆర్థిక సంస్థలు ప్రభుత్వాలకు అప్పులిస్తుంటాయి. సర్కారులు తమ అవసరాలకు అనుగుణంగా ఏదో రూపంలో ప్రజలపై కొత్త పన్నులు వేసి ఖజానాను నింపుకుంటాయి. తాము చేసిన అప్పులను చెల్లిస్తాయి. అంటే ప్రభుత్వాలు చేస్తున్న రుణాలకు ప్రజలే పూచీకత్తుగా ఉంటారు. రుణాలు పెరిగితే భవిష్యత్తులో ప్రజలపై ఏదో రూపంలో పన్నుల భారం పెరగడం ఖాయం.

కేంద్ర సంస్థల గుప్పెట్టోకి..

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు, రోజువారీ నిర్వహణకు నిధులు లేక సతమతమవుతోంది. అప్పులు తెచ్చుకోవడానికి అడ్డగోలు షరతులకు సైతం తల ఒగ్గుతోంది. విద్యుత్ సంస్కరణలు, పురపాలక సంస్థల్లో పన్నుల పెంపుదలకు దారి తీసే కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు ఏపీ అంగీకరించింది. దాదాపు అయిదువేల కోట్ల రూపాయల అదనపు రుణం తెచ్చుకునేందుకు కేంద్రం విధించే షరతులకు తల ఊపాల్సి వచ్చింది. పొరుగున ఉన్న తెలంగాణ మాత్రం విద్యుత్ సంస్కరణలు, పురపాలక సంస్కరణలను తిరస్కరించింది. ప్రత్యక్షంగా ప్రజలపై పన్నుల భారం పెరుగుతుంది. రాష్ట్రప్రభుత్వాలు విద్యుత్ సంస్థలపై నియంత్రణ కోల్పోతాయని తెలంగాణ కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అటువంటి ఆర్థిక స్థితి లేకపోవడంతో దయనీయంగా మారింది. రుణాలు పెరిగి పోతే రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. కేంద్ర ఆర్థిక శాఖ సైతం జోక్యం చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అప్రతిష్టే. కేంద్ర ప్రభుత్వం చేతిలో నిస్సహాయంగా మారే పరిస్థితిని చేజేతులారా కొని తెచ్చుకోవడం రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనపరుస్తుంది. సమాఖ్య సంప్రదాయాలకూ చేటు తెస్తుంది.

నియంత్రణకు నీళ్లు..

సంక్షేమం పేరుతో ప్రభుత్వాలు ఆర్థిక నియంత్రణలకు నీళ్లు వదిలేస్తున్నాయి. ఉచితానుచితాలతో సంబందం లేకుండా ప్రజలందరికీ ఏదో రూపంలో నిధులు పంపిణీ చేయాలని సర్కారులు కంకణం కట్టుకుంటున్నాయి. నిజానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంపై ఆధారపడి బతకాల్పిన దుస్థితిలో ప్రజలు లేరు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న 20శాతం ప్రజలకు మాత్రమే ప్రభుత్వ అండదండలు అవసరమనేది అంచనా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనభై శాతం ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ భారం తడిసిమోపెడవుతోంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓట్లను కురిపిస్తారనేది రాజకీయ నేతల ఆశ. కానీ అటువంటి ఉదాహరణలు రాజకీయాల్లో తక్కువ. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ సంక్షేమం బాగానే అమలవుతున్నప్పటికీ టీఆర్ఎస్ ను తాజా ఉప ఎన్నికలు, హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. అంతెందుకు పసుపు- కుంకుమ పేరిట చంద్రబాబు సర్కారు 50 లక్షల కుటుంబాలకు పదివేల రూపాయల పైచిలుకు ఎన్నికల సమయంలో అందచేసింది. అయినా సర్కారు ను తిప్పికొట్టి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి పట్టం గట్టారు. అవసరానికి మించిన సంక్షేమాన్ని అదనపు లాభంగానే ప్రజలు చూస్తారు. తమకు ప్రభుత్వం మేలు చేస్తోందని ఓట్లు వేయరు. మొత్తమ్మీద ప్రభుత్వ పనితీరు, మౌలిక వసతుల వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అర్హులైన లబ్ధిదారులు మాత్రమే ప్రభుత్వం తమకు చేస్తున్న మేలు పట్ల కృతజ్ణతగా ఉంటారు. అపాత్ర దానంగా లబ్ధి పొందిన వారు సర్కారీ వితరణను పెద్దగా పట్టించుకోరు. ఈ విజ్ణత ప్రభుత్వాలకు ఉండాలి. లేకపోతే రుణాంధ్రగా మారితే కొత్త అప్పులు పుట్టవు. కేంద్రం పెత్తనం పెరిగిపోతుంది. నిజమైన పేదలకు సైతం సంక్షేమ పలాలు అందించేందుకు నిధుల కొరత ఏర్పడుతుంది. ఎన్నికల సమయంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైతే మొదటికే మోసం వస్తుంది. అధికార పార్టీ అప్రమత్తం కావాల్సిన తరుణం ఆసన్నమైంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News