కాంగ్రెస్ లో ఉత్తమమైన రికార్డ్ మరి

కాంగ్రెస్ పార్టీయే ఈ దేశంలో ఒక రికార్డు. రాజకీయ పార్టీగా శతాధిక వయోవృద్ధురాలు. గాంధీ వంశం తప్ప ముఖ్యమంత్రులు, ప్రధానులు, పార్టీ అధినేతల పదవీ కాలం ఎపుడూ [more]

Update: 2020-05-08 00:30 GMT

కాంగ్రెస్ పార్టీయే ఈ దేశంలో ఒక రికార్డు. రాజకీయ పార్టీగా శతాధిక వయోవృద్ధురాలు. గాంధీ వంశం తప్ప ముఖ్యమంత్రులు, ప్రధానులు, పార్టీ అధినేతల పదవీ కాలం ఎపుడూ అల్పాయుష్షే. వివిధ రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ పదవి అయినా ముఖ్యమంత్రి పదవి అయినా ఎపుడూ ఊడుతుందో ఎవరికీ తెలియదు, తుమ్మితే ఊడే ముక్కు లాంటి పదవులు అవి, గట్టిగా ఏడాది అదే పదవిలో కొనసాగితే కాంగ్రెస్ లో పండుగ చేసుకుంటారు. అలాంటిది ఏకంగా అయిదేళ్ళ పాటు తెలంగాణా రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేశారంటేనే అది పెద్ద రికార్డు. ఉమ్మడి ఏపీలోనే అది గొప్ప రికార్డు.

మాజీ ఆర్మీగా…

ఉత్తంకుమార్ రెడ్డి పేరుకు ముందు కెప్టెన్ అని ఉంటుంది. ఆయన ఆర్మీలో యుధ్ధ విమానాలు నడిపే కెప్టెన్. అంటే వస్తుతహా రాజకీయ నేత కాదు, కానీ రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుకోవడమే కాదు, ఇన్నాళ్ళూ తెలంగాణా కాంగ్రెస్ కి కెప్టెన్ గా ఉన్నారంటే మెచ్చుకోవాల్సిదే. ఏపీలో కాంగ్రెస్ కుదేల్ అయినా కూడా తెలంగాణాలో కాంగ్రెస్ మాత్రం ఇంకా కొంత బలంగానే ఉంది. టీఆర్ఎస్ తరువాత జనం చూడాలంటే కాంగ్రెస్ వైపే చూస్తారు. పైగా అక్కడ నాయ‌కులు కూడా ఎక్కువే. ఈ నేపధ్యంలో ఎందరో శత్రువులు సొంత పార్టీలో ఉంచుకుని ఉత్తమ్ నాటౌట్ అంటునారంటే నిజంగా కితాబు ఇవ్వాల్సిందే. ఆయన 2015 ఏప్రిల్ 28న తెలంగాణా పీసీసీ చీఫ్ అయ్యారు.

అలా దాటేసారుగా…

ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తరువాత రెండు సాధారణ ఎన్నికలను చవి చూశారు.అందులో 2018న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బ్యాడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అక్టోపస్ లను, జాతకాలను, పొత్తులను నమ్ముకుని అసలు పని వదిలసింది. దాంతో ఇదిగో అధికారం మాదే అని ధీమా పడినంత సేపు లేదు. ఫలితాలు వెల్లడి కావడంతో బొక్క బోర్లా పడింది. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలతో 23 ఎమ్మెల్యే సీట్లను కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయింది. అప్పట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్ నుంచి తొలగించాలని డిమాండ్ లు వచ్చాయి, కానీ ఆ తరువాత వెంటనే లోక్ సభ ఎన్నికలు ఉండడంతో ఢిల్లీ పెద్దలు కొంత ఆగారు.

అదే కాపాడిందా…?

ఇదిలా ఉండగా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎంపీ అయ్యారు. దాంతో ఆయన మీద కొంత వత్తిడి తగ్గింది. ఆ తరువాత వచ్చిన హుజూరా బాద్ ఉప ఎన్నికల్లో ఆయన సొంత సీటే కోల్పోవడంతో మళ్ళీ నెత్తిన కత్తి వేలాడింది. అయితే ఉత్తమ్ ని తప్పించాలంటే రేసులో వృధ్ధ నేత వీ హనుమంతరావు సహా ఎంతో మంది పోటీలో ఉన్నారు. దాంతో అది పెద్ద గొడవగా ఉండడంతో ఎప్పటికపుడు వాయిదా పడుతూ వస్తోంది. ఈ లోగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వీర విహారం చేయడంతో ఉత్తంకుమార్ రెడ్డి పదవి నిలబడింది. మొత్తం మీద చూసుకుంటే ఉత్తమ్ ఎప్పటికపుడు గండాలను దాటుకుంటూ నిండుగా అయిదేళ్ళ పాటు పీసీసీ చీఫ్ గా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. బహుశా జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ లో ఎప్పటికీ ఇదే రికార్డుగా ఉంటుందేమో.

Tags:    

Similar News