ఈసారి అయినా ఈ వైసీపీ నేతకు యోగముందా.. ?

విశాఖలో ఓ రాజకీయ నాయకుడు ఉన్నారు. ఆయనది పుష్కర కాలం నుంచి సుదీర్ఘ పోరాటం. ఎంత కుస్తీ పట్టినా దక్కింది నాస్తి అన్నట్లుగానే కధ సాగుతోంది. ఆయనతో [more]

;

Update: 2021-02-27 15:30 GMT

విశాఖలో ఓ రాజకీయ నాయకుడు ఉన్నారు. ఆయనది పుష్కర కాలం నుంచి సుదీర్ఘ పోరాటం. ఎంత కుస్తీ పట్టినా దక్కింది నాస్తి అన్నట్లుగానే కధ సాగుతోంది. ఆయనతో వచ్చినవారు, తరువాత వారు కూడా పీఠమెక్కుతున్నా ఆయన మాత్రం ఇంకా ఉన్న చోట అలాగే ఉండిపోయారు. ఆయనే విశాఖ వైసీపీ సిటీ ప్రెసిడెంట్ వంశీ కృష్ణ శ్రీనివాస్. 2009 నుంచి ఆయన రాజకీయ పరుగుపందెం సాగుతూనే ఉంది. కానీ లక్ష్యాన్ని చేరకుండానే అవుట్ అవుతున్నారు. ఇపుడు మునిసిపాలిటీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడంతో మళ్లీ ఆశలపల్లకిలో వంశీ ఊరేగుతున్నారు.

అలా మొదలెట్టి…

వంశీ వ్యాపారం చేసుకుంటూ 2009 ఎన్నికల వేళ ప్రజారాజ్యం తరఫున విశాఖ తూర్పు నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సహకారంతో సంపాదించి తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే నాడు తెలుగుదేశం వ్యూహాలతో బేజారై తృటిలో ఎమ్మెల్యే సీటుని కోల్పోయారు. ఇక 2014 నాటికి వైసీపీలో చేరి పోటీ చేసినా ఓటమి మళ్ళీ ఎదురైంది. 2019 ఎన్నికల నాటికి వైసీపీకి గ్యారంటీ అధికారం అనుకున్న వేళ ఏకంగా ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా పోయింది.

మేయరేనా ….

ఇక నాడు జగన్ ఆయన్ని పిలిచి ఇచ్చిన హామీ మేరకు విశాఖ మేయర్ పీఠం దక్కాలి. జగన్ అయితే హామీ ఇచ్చారు కానీ లక్ మళ్ళీ రివర్స్ గేర్ వేసింది. అందుకే గత ఏడాది జరగాల్సిన మునిసిపల్ ఎన్నికలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దాంతో ఎవరెంత బాధపడినా పడకపోయినా వంశీ మాత్రం నిద్ర లేని రాత్రులే గడిపారు అని సన్నిహితులు అంటారు. నాడు ఎన్నికలు జరిగితే వైసీపీ దూకుడే వేరుగా ఉండేది. దాంతో మేయర్ పీఠం ఒడిలో వచ్చి వాలేది. కానీ వంశీకి యోగం లెదని సన్నిహితులే బాధపడ్డారు. ఇపుడు మళ్ళీ ఎన్నికలు అనూహ్యంగా వచ్చిపడ్డాయి. దాంతో ఈసారి విశాఖ మేయర్ వంశీయేనా అన్న చర్చ అయితే వస్తోంది.

టెన్షన్ గానే ….?

చేతిలోని అన్నం ముద్ద నోటి దాకా వచ్చినా జారిపోతుంది అంటారు. అందువల్ల నోట్లో పడేంతవరకూ టెన్షన్ తప్పదు. ఇది పన్నెండేళ్ల రాజకీయ జీవితం వంశీకి నేర్పిన పాఠం. దాంతో తనకు రాసిపెట్టి ఉంటే కచ్చితంగా మేయర్ సీటు దక్కుతుందని వంశీ భావిస్తున్నారుట. మేయర్ కావాలంటే ముందు కార్పోరేటర్ గా పోటీ చేయాలి. దాంతో స్థాయి దిగి మరీ కార్పోరేటర్ గా పోటీ చేస్తున్న ఈ వైసీపీ నేత ముందు అక్కడ గెలవడానికే కష్టపడుతున్నారు. ఆ మీదట వైసీపీకి మెజారిటీ డివిజన్లు రావాలి. అన్నీ జరిగినా వైసీపీ పెద్దల నిర్ణయంలో ఏ మార్పు లేకుండా ఉంటనే మేయర్ వంశీ అయ్యేది అని ఆయన అనుచరులు చాలా పెద్ద లెక్కనే చెబుతున్నారు మరి. చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News