గద్దలకొండ గణేష్ మూవీ రివ్యూ

బ్యానర్: 14 రీల్స్ ప్లస్ నటీనటులు: వరుణ్ తేజ్, పూజ హెగ్డే, అధర్వ మురళి, మృణాళిని, డింపుల్ హయతి(ఐటెం గర్ల్), బ్రహ్మాజీ, సత్య, బ్రహ్మానందం, రచ్చ రవి [more]

;

Update: 2019-09-20 08:46 GMT

బ్యానర్: 14 రీల్స్ ప్లస్
నటీనటులు: వరుణ్ తేజ్, పూజ హెగ్డే, అధర్వ మురళి, మృణాళిని, డింపుల్ హయతి(ఐటెం గర్ల్), బ్రహ్మాజీ, సత్య, బ్రహ్మానందం, రచ్చ రవి తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ. జె. మేయర్
సినిమాటోగ్రఫీ: ఆయనంక బోస్
ఎడిటింగ్: చోట. కె. ప్రసాద్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
దర్శకత్వం: హరీష్ శంకర్

ఇప్పటి వరకు క్లాస్ టచ్ ఇచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్.. మొదటిసారిగా మాస్ కి ప్రాధాన్యత ఉన్న గద్దలకొండ గణేష్ పాత్రలో మెరిశాడు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఉన్న హరీష్ శంకర్ కి మళ్ళీ ఎలాంటి హిట్ అందుకొవడానికి ఏళ్ళకి ఏళ్ళు పడుతుంది కానీ.. గబ్బర్ సింగ్ లాంటి హిట్ కొట్టలేకపోయాడు. అందుకే మరోసారి రీమేక్ ని నమ్ముకోవడమే కాదు.. మళ్ళీ మెగా హీరో తోనే హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యి.. వరుణ్ తేజ్ తో వాల్మీకి అంటూ మొదలెట్టాడు. తమిళంలో సూపర్ హిట్ అయినా జిగర్తాండ సినిమాని వాల్మీకి టైటిల్ తో రీమేక్ మొదలెట్టాడు. ఆది నుండి వాల్మీకి టైటిల్ మీద బోయ సంఘం వారు ఫైట్ చేస్తూ చేస్తూ.. చివరికి విజయం సాధించారు. హారిష్ శంకర్ మొదట్లో కాదు కాదు.. వాల్మీకి సినిమా విడుదలకు కొన్ని గంటల వరకు టైటిల్ ని మార్చానని అన్నాడు. కానీ బోయ సంఘం వారు కోర్టు కెక్కి సినిమా విడుదల ఆపించేలా ఉండడంతో.. చివరికి హరీష్ శంకర్ మెట్టు దిగి వాల్మీకి టైటిల్ ని గద్దలకొండ గణేష్ గా మార్చాడు. ఇందులో వరుణ్ తేజ్‌ను నెగిటివ్ షేడ్స్ ఉన్న డిఫరెంట్‌ లుక్‌లో చూపించడం ఆసక్తి కలిగించే అంశం. ఇక మొదటి నుండి మంచి అంచనాలున్న గద్దలకొండ గణేష్ సినిమా తో వరుణ్ మాస్ పాత్ర తో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించాడో అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్) ఒక ఏరియాలో పెద్ద గ్యాంగ్ స్టర్ గా చలామణి అవుతుంటాడు. మరోపక్క అభిలాష్ (అధర్వ) సినిమాపై పిచ్చి తో డైరెక్టర్ అవ్వాలని కలలు కనడమేకాదు..ఆ అందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటాడు. అభిలాష్ సినిమా పిచ్చి తో ఇంట్లో వాళ్లతో గొడవపడి.. ఒక ఏడాది తిరిగేలోపు గొప్ప డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. అయితే అభిలాష్ ఓ గ్యాంగ్ స్టార్ కథతో సినిమా చెయ్యాలని ఉంటుంది దాని కోసం ఆ ఏరియాలో పెద్ద గ్యాంగ్ స్టర్ గా చలామణి అవుతున్న గద్దలకొండ గణేష్ జీవితాన్ని కథగా అమర్చాలని… గణేష్ కి తెలియకుండా గణేష్ ని ఫాలో చేస్తుంటాడు. అయితే అభిలాష్ గురించి గద్దలకొండ గణేష్ కి తెలిసిపోతుంది. అసలు గద్దలకొండ గణేష్ గ్యాంగ్ స్టార్ గా ఎందుకు మారాడు? అభిలాష్ కి గణేష్ కథ సినిమా తియ్యాలని కోరిక ఎందుకు పుట్టింది. చివరికి అభిలాష్, గణేష్ కథతో సినిమా చేశాడా? గద్దలకొండ గణేష్ కి అభిలాష్ గురించి తెలిసి అతన్ని ఏం చేసాడు? అనేది మిగిలిన కథ.

నటీనటుల నటన:

ఇప్పటివరకు క్లాస్ పాత్రల్లో క్లాస్ లుక్ లో నీట్ షేవ్, నీట్ డ్రెస్ వేసుకుని కనబడిన వరుణ్ తేజ్ మొదటిసారిగా మాస్ టచ్ ఉన్న పాత్ర చేసాడు. గద్దలకొండ గణేష్ గా రఫ్ లుక్ లో గెడ్డం పెంచి అచ్చం విలన్ గా సినిమాని భుజాలపై మోశాడు. గద్దలకొండ గణేష్ గా గ్యాంగ్ స్టర్ లుక్ లో ఎవరుం పర్సనాలిటీ సూపర్బ్. తెలంగాణ భాషలో వరుణ్ చెప్పిన మాస్ డైలాగ్స్ చాలా బావున్నాయి. డీగ్లామర్ రోల్ లో మాస్ మేనరిజంతో వరుణ్ తేజ్ వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. గణేష్ పాత్రలో వరుణ్ మాస్ లుక్ కటౌట్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన తమిళ నటుడు అధర్వ మురళి పర్వాలేదనిపించాడు. కమెడియన్ సత్య మాత్రం తన హావభావలు, మేనరిజంతో అలరించాడు. ఇక శ్రీదేవి గా పూజ హెగ్డే లంగావోణీ లుక్ లో ఆకట్టుకుంది. వరుణ్ – పూజ మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. కొత్తమ్మాయి మృణాళిని అభినయంతో నటనతో ఆకట్టుకుంది. పెళ్లిచూపులు సీన్‌లో మృణాళిని నటన చాలా బాగుంది. మిగతా నటులు తమ పాత్రల పరిధి మేర నటించారు.

విశ్లేషణ:

హరీష్ శంకర్ అంటే రీమేక్ సినిమాని అద్భుతంగా తియ్యగలడని పేరు. హిందీ దబాంగ్ ని తెలుగులో గబ్బర్ సింగ్ గా తనదైన స్టయిల్ ల్లో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అలాంటి హరీష్ తమిళ సూపర్ హిట్ సినిమాని రీమేక్ చేస్తున్నాడు అంటే ఆ సినిమా మీద అంచనాలు తార స్థాయిలో ఉంటాయి. తమిళనాట సూపర్ హిట్ అయినా జిగర్తాండ ని తెలుగులో గద్దలకొండ గణేష్ గా హరీష్ శంకర్ రీమేక్ చేసాడు. మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పటివరకు సాలిడ్ గా లవర్ బాయ్ ఇమేజ్ తో సినిమాలను హిట్ ట్రాక్ లెక్కిస్తున్నాడు. మరి మొదటిసారి మాస్ ఇమేజ్ తో సినిమా చెయ్యడమంటే ఆ సినిమా మీద అంచనాలు వచ్చేస్తాయి. మరి హరీష్ – వరుణ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రారంభమైన వెంటనే వరుణ్ తేజ్ కనిపించే తొలి సన్నివేశమే అద్భుతంగా ఉంది. ఈ సన్నివేశంతో క్యూరియాసిటీ క్రియేట్ చేసి కథను ఆరు నెలల వెనక్కి తీసుకెళ్లారు. ఇక అక్కడి నుంచి గద్దలకొండ గణేష్ అరాచకం మొదలవుతుంది. అయితే అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మినహా ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వరుణ్ తేజ్ మేనరిజం, డైలాగులు, సత్య కామెడీ ప్లస్ అయ్యాయి. ఇంటర్వెల్‌ బ్లాక్‌లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సెకండాఫ్‌లో చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ… సెకండాఫ్ కాస్త నీరసించింది. సెకండ్ హాఫ్ లో ఎంటర్‌టైన్మెంట్ లోపించింది. దీనికి తోడు నిడివి కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. అసలు రౌడీ షీటర్ ఒక హీరోగా పరిచయమైన తీరు లాజిక్‌కు అందని విధంగా ఉంది. కాకపోతే పూజా మరియు వరుణ్ ల మధ్య సన్నివేశాలు తక్కువే ఉన్నా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం చక్కగా కుదిరింది. క్లైమాక్స్ కాస్త వీక్‌గానే ఉన్నా ఎమోషన్స్ బాగానే పండాయి. గద్దలకొండ గణేష్, అతడి తల్లి మధ్య క్లైమాక్స్‌లో వచ్చే సీన్ కంటతడి పెట్టిస్తుంది. అయితే హీరోయిజం ఎలివేషన్ కోసం హరీష్ చేసిన మార్పులు మూవీ సోల్ ని దెబ్బతీశాయి. ఇక వరుణ్ తేజ్ గెటప్ చూసి సినిమాలో బీభత్సమైన యాక్షన్ సీక్వెన్సెస్ ఆశించినవారికి కనీసం ఒక్క పూర్తి స్థాయి యాక్షన్ ఎపిసోడ్ కూడా లేకపోవడం నిరాశకు గురిచేస్తుంది.

సాంకేతికంగా…

సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. నాలుగు చక్కని పాటలతో మంచి మ్యూజిక్ ఇవ్వడమే అక్కడు.. మొదటిసారి విభిన్నమైన బ్యాగ్రౌండ్ స్కోరు ఇచ్చాడు. మిక్కీ నేపధ్య సంగీతం సినిమాలో హైలెట్ అవుతుంది. ఆయాంక్ బోస్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. అయన గ్రామీణ వాతావరణాన్ని బాగా చూపించారు. ముఖ్యంగా వరుణ్ తేజ్‌ను అద్భుతంగా కెమెరాలో బంధించాడు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. కాని తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్: వరుణ్ లుక్, డైలాగ్ డెలివరీ, సినిమాటోగ్రఫి, మ్యూజిక్, నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్స్: అధర్వ పాత్ర, ఎడిటింగ్, క్లైమాక్స్, సెకండ్ హాఫ్

రేటింగ్: 2.5/5

Tags:    

Similar News