బెజవాడ కిమ్మనడం లేదే?

బెజవాడ వాణిజ్య రాజధాని. రాజకీయ రాజధాని. అని నాడు పేరుండేది. బెజవాడ కేంద్రంగా అనేక మంది నేతలు రాష్ట్ర, జాతీయ రాజీకీయాల్లో చక్రం తిప్పగలిగారు. అభివృద్ధి పనులు [more]

Update: 2019-12-23 11:00 GMT

బెజవాడ వాణిజ్య రాజధాని. రాజకీయ రాజధాని. అని నాడు పేరుండేది. బెజవాడ కేంద్రంగా అనేక మంది నేతలు రాష్ట్ర, జాతీయ రాజీకీయాల్లో చక్రం తిప్పగలిగారు. అభివృద్ధి పనులు చేయించుకోవడంలోగాని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తెచ్చుకోవడంలోనూ బెజవాడ నేతలు సిద్ధహస్తులంటారు. తమ నియోజకవర్గాల కోసం పైరవీలు చేయడంలోనూ బెజవాడ నేతలది అందె వేసిన చేయి. ఎందరో నాయకులు బెజవాడ కేంద్రంగా రాజకీయాలు నెరిపారు. తమతో పాటు ఈ ప్రాంతానికి కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టారు.

తరలింపు ప్రకటనపై…..

అటువంటి కృష్ణా జిల్లా నేతలు ఇప్పుడు కిమ్మనడం లేదు. ఢిల్లీ స్థాయిలోనే అగ్రనాయకులను లోబర్చుకున్న బెజవాడ నేతలు రాజధానిని అమరావతిని తరలిస్తున్నా తమ అధినేతను ఏమాత్రం ప్రభావం చేయలేకపోతున్నారు. ఇదే చర్చ ఇప్పడు కృష్ణా జిల్లలో జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ రెండే స్థానాల్లో విజయం సాధించింది. అందులో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీని వీడి వెళ్లిపాయారు. అంటే ఒక్కరు తప్ప అందరూ కృష్ణా జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలే. అయితే మూడు రాజధానుల ప్రతిపాదన వీరికి పట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.

బలమైన నేతలే ఉన్నా…..

నిజానికి కృష్ణా జిల్లా వైసీపీలో బలమైన నేతలే ఉన్నారు. కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, పార్థసారధి, సామినేని ఉదయభాను వంటి సీనియర్ నేతలు ఉన్నారు. అయితే రాజధానిని నిజంగా అమరావతి నుంచి తరలిస్తే ఆ ప్రభావం ఎక్కువగా కృష్ణా జిల్లాపైనే పడుతుందన్నది వారికి తెలియంది కాదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కృష్ణా జిల్లాలో వైసీీపీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. రాజధానిని తరలిస్తే బెజవాడ మళ్లీ మామూలు దశకు చేరుకుంటుంది. ఇప్పుడిప్పుడే అన్ని హంగులు సమకూర్చుకుంటున్న బెజవాడ జీఎన్ రావు కమిటీ సిఫార్సులు అమలయితే పెద్ద పల్లెటూరుగానే మిగిలిపోతుంది.

సెంటిమెంట్ అని తెలిసినా….

రాజధాని అమరావతి వల్ల కొందరు ప్రయోజనం పొందినా అది కృష్ణా జిల్లా వాసులకు సెంటిమెంట్ గా మారిందనడంలో సందేహం లేదు. సెంటిమెంట్ బలంగా పడిపోతే వైసీపీ ఈ జిల్లాలో తీవ్ర నష్టాన్ని చవిచూడక తప్పదు. అన్నీ తెలిసినా బెజవాడ నేతలు మాత్రం నోరు మెదపడం లేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అలాగే బెజవాడలో కమ్యునిస్టుల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు కూడా ఎలాంటి కార్యాచరణ దిగకకపోవడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. మొత్తం మీద బెజవాడ నేతలు రాజధాని అమరావతి తరలింపు పై ఎటువంటి స్పందన తెలియక చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Tags:    

Similar News