విజ‌య‌సాయి దూకుడు.. కీల‌క నేత‌ల‌పై ఎఫెక్ట్

ఏపీ అధికార పార్టీ వైసీపీలో చిత్రమైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి, పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు మ‌ధ్య మంచి సంబంధాలు.. పార్టీని [more]

Update: 2020-05-10 03:30 GMT

ఏపీ అధికార పార్టీ వైసీపీలో చిత్రమైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి, పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు మ‌ధ్య మంచి సంబంధాలు.. పార్టీని అభివృద్ధి దిశ‌గా న‌డిపించాయి. అందుకే పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌నేది వాస్తవం. అయితే, ఈ సంబంధాలు ఇప్పుడు కూడా కొన‌సాగుతున్నాయి. కానీ, ఇప్పుడు పార్టీలో అసంతృప్తుల‌కు కార‌ణ‌మ‌వు తోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. విజ‌య‌సాయిరెడ్డి వ్యవ‌హారం చూస్తే.. త‌న‌కు పార్టీలో తిరుగులేద‌నే భావ‌న‌తో ఉంది. నిజ‌మే ఆయ‌న‌కు జ‌గ‌న్ ద‌గ్గర కానీ, ప్రభుత్వంలో కానీ ఎదురు లేదు. పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డంతో వ్యూహాలు ర‌చించిన నేత‌ల్లో విజ‌య‌సాయిరెడ్డి కూడా ఒక‌రు. ఈ విష‌యంలో ఎవ‌రికీ రెండో ఆలోచ‌న లేదు. కానీ, ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత కూడా కొన్ని కొన్ని విష‌యాల్లో ఆయ‌న ప్రద‌ర్శిస్తున్న దూకుడు కార‌ణంగా ప్రజాప్రతినిధులు చిన్నబుచ్చుకుంటున్నారు.

డైరెక్ట్ ఎన్నికల నుంచి…..

ఈ సంద‌ర్భంగా రెండు విష‌యాలు ప్రస్తావించాలి. విజ‌య‌సాయిరెడ్డికి ఎన్ని వ్యూహాలు ఉన్నప్పటికీ.. ప్రజ‌ల మ‌ధ్య ఆయ‌న‌కు ఉన్న బ‌లం ఎంత ఉంద‌నేది తెలియ‌దు. దీనికి ప్రధాన కార‌ణం.. ఆయ‌న ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటీచేసింది లేదు. కానీ, ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసి, ప్రజ‌ల మ‌ధ్య పోరాడి గెలిచిన నాయ‌కుల‌ను చుల‌క‌న‌గా చూస్తున్నార‌నేది విజ‌య‌సాయిరెడ్డిపై వ‌స్తున్న ప్రధాన ఆరోప‌ణ‌. విశాఖ‌కు చెందిన ఓ మంత్రి విష‌యంలోనూ, ఇదే జిల్లాకు చెందిన ఓ గిరిజ‌న ఎమ్మెల్యే విష‌యంలోను సాయిరెడ్డి వ్యవ‌హ‌రించిన తీరు.. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. మంత్రిగా ఉన్న నాయ‌కుడు పార్టీలు మారిన‌ప్పటికీ.. విజ‌యం ద‌క్కించుకున్నారు. మంచి వాక్చాతుర్యం కూడా ఉంది. ఆయ‌న ఎలాంటి విమ‌ర్శల‌పైనైనా కౌంట‌ర్ ఇచ్చే స్థాయిలో ఉన్నారు. పైగా వివాద ర‌హితుడిగా ఆయ‌న‌కు పేరు ఉంది.

డమ్మీ చేయాలనేనా?

కానీ, స‌ద‌రు మంత్రిని డ‌మ్మీ చేయాల‌నే ఉద్దేశంతోనో.. మ‌రే కార‌ణంతో విజ‌య‌సాయిరెడ్డి ఆయ‌న‌ను ప‌క్కన కూర్చోబెట్టుకుని మ‌రీ.. తానే అంతా అయిన‌ట్టు వ్యవ‌హ‌రిస్తున్నారు. ఎంత ఉత్తరాంధ్ర జిల్లాల‌కు ఇంచార్జ్ అయిన‌ప్పటికీ.. ఇలా ప్రోటోకాల్ కూడా ప‌ట్టించుకోకుండా వ్యవ‌హ‌రించ‌డం స‌మంజసం కాద‌ని విమ‌ర్శలు వస్తున్నాయి. ఇక‌, మ‌రో గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు అసలు అవ‌స‌రం లేకున్నా కూడా మ‌రో పార్టీ నుంచి నేత‌ను తీసుకువ‌చ్చి పార్టీలో చేర్చుకున్నారు. నిజానికి ఆయ‌న అవ‌స‌రం ఇప్పుడు పార్టీకి పెద్దగా లేదు. పైగా ఇక్కడ ఎంతో క‌ష్టప‌డి ఓ మ‌హిళా నాయ‌కురాలు గెలుపు గుర్రం ఎక్కారు. అయితే, క‌నీసం ఈమెను సంప్రదించ‌కుండానే స‌ద‌రు నాయ‌కుడిని పార్టీలో చేర్చుకోవ‌డం ద్వారా త‌న ఆధిప‌త్యమే కొన‌సాగాల‌న్న భావ‌న‌తో విజ‌య‌సాయిరెడ్డి వ్యవ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న ఉంది.

కుమ్మలాటకు కారణమై…..

ఇక విజ‌య‌సాయిరెడ్డి రాజ్యస‌భ ఎంపీగా ఉన్నారు. అలాంటిది విశాఖ జిల్లాల్లో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎమ్మెల్యేల కార్యక్రమాల్లో సైతం ఆయ‌న ద‌ర్శన‌మిస్తున్నారు. ఇది ప్రత్యక్షంగా కాక‌పోయినా.. ప‌రోక్షంగా మాత్రం స‌ద‌రు ప్రజాప్రతినిధుల నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, వైసీపీలో కుమ్ములాట‌లు చోటు చేసుకుంటున్నప్పటికీ.. ఇంచార్జ్‌గా వాటిని ప‌రిష్కరించడం మానేశార‌నే వాద‌న విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచి వినిపిస్తోంది. శ్రీకాకుళంలో టీడీపీ దూకుడు భారీ ఎత్తున ఉండి, ప్రభుత్వానికి స‌వాళ్లు వ‌స్తున్నా.. ఇంచార్జ్‌గా వాటిని విజ‌య‌సాయిరెడ్డి ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మూ స‌రికాద‌ని అంటున్నారు. అస‌లు శ్రీకాకుళం జిల్లాలో మంత్రి పూర్తిగా డ‌మ్మీ అయిపోయారు. ఇక విజ‌య‌న‌గ‌రంలో బొత్స దూకుడుపై ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం నుంచి ఎన్ని ఫిర్యాదులు వ‌స్తున్నా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శలు ఉన్నాయి. మొత్తంగా వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కుడు వ్యవ‌హ‌రిస్తున్న తీరు ఇలా ఉంటే ఎలా ? అనే ప్రశ్న మాత్రం ఉత్పన్నమైంది.

Tags:    

Similar News