తోకజాడించకండి.. జగన్ గట్టి వార్నింగ్

అంతే బయటకు చూసేందంతా నిజం కాదు, అలాగని లోపల ఉన్నదంతా మెరుగూ కాదు, కానీ కొన్ని సార్లు అంతా ఉల్టా సీదాగా కనిపిస్తుంది. అసలు వారికి మాత్రం [more]

;

Update: 2020-07-02 06:30 GMT

అంతే బయటకు చూసేందంతా నిజం కాదు, అలాగని లోపల ఉన్నదంతా మెరుగూ కాదు, కానీ కొన్ని సార్లు అంతా ఉల్టా సీదాగా కనిపిస్తుంది. అసలు వారికి మాత్రం అంతా సజావుగానే ఉంటుంది. విజయసాయిరెడ్డి, జగన్ ల మధ్య ఉన్న బంధం అలాంటిదే. దాని మీద ఏవేవో చిలవలు పలవలూ ఊహించేసుకుని ఇద్దరికీ చెడిందని మీడియాలో వచ్చే రాతలు చూసి జబ్బలు చరచుకున్న వారున్నారు. ఇక జగన్ పని అయిపోయింది అన్న వారూ ఉన్నారు. కానీ తమ మధ్య ఉన్న బంధం ధృఢమైనది, గట్టిది అని మరో మారు జగన్ నిరూపించారు. విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్రా పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా జగన్ అది మళ్ళీ రుజువు చేశారు. గత అయిదేళ్ళుగా విజయసాయిరెడ్డి ఈ జిల్లాలలో పార్టీని పటిష్టం చేస్తూ వైసీపీ రెపరెపలకు కారణమైన సంగతిని అంతా ఒప్పుకుంటారు.

గట్టి జవాబే ….

విశాఖలో వేల కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయి. వాటి మీద రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల కన్ను ఉంది. అలాగే భూ కబ్జాదారులు కూడా ఉన్నారు. వారంతా వైసీపీ హయాంలో ఆ భూములను దోచేద్దామంటే అసలు కుదరడంలేదు. విజయసాయిరెడ్డి అడ్డుపడుతున్నాడని, ప్రబల శక్తిగా మారారని గుస్సా అయినవారంతా ఆయన మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలెట్టారు. ఆరు పదుల వయసు ఉన్న ఆయన మీద రాసలీలల‌ పేరిట కూడా బురద జల్లుడు కార్యక్రమం మొదలెట్టారు. ఇలా చేసి జగన్ తో చెడ్డ చేయాలని, విశాఖ నుంచి కదిలించాలనుకున్నారు. కానీ విజయసాయిరెడ్డికే మళ్ళీ పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా జగన్ గట్టి జవాబే చెప్పారని అంటున్నారు. విజయసాయిరెడ్డిని తాను ఎంతగా నమ్ముతున్నదీ కూడా అలా చెప్పేశారు.

చెక్కుచెదరలేదుగా….?

ఇక పార్టీలో విజయసాయిరెడ్డి స్థానం ఏంటో అని అంతా ఎకసెక్కం ఆడారు. జగన్ ఆయన్ని దూరం పెట్టారని కూడా ప్రచారం సాగింది. కానీ జరిగింది వేరు, విజయసాయిరెడ్డి ఎప్పటికీ నంబర్ టూగానే ఉంటారని జగన్ మళ్ళీ మళ్లీ చెబుతున్నారు. పార్టీలో నర్సాపురం ఎంపీ రఘురామక్రిష్ణంరాజుకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలంటే కూడా విజయసాయిరెడ్డే ఇవ్వాలి. జాతీయ ప్రధాన‌ కార్యదర్శి ఆయన ఏంటి అని ఎకసెక్కం ఆడినా ఢిల్లీ వ్యవహారాలూ ఆయనే చక్కబెట్టాలి. ఇక విశాఖ సహా ఉత్తరాంధ్రాలో టీడీపీ కంచు కోటలను కూల్చాలంటే కూడా విజయసాయిరెడ్డే కావాలి. అందుకే జగన్ ఆయన్ని ఏ విధంగానూ దూరం చేసుకోలేనని చాటి చెప్పారు.

మళ్ళీ భజనే ……..

చిత్రంగా విజయసాయిరెడ్డి పుట్టిన రోజు వేళ జగన్ ఈ బరువు బాధ్యతలు ఆయన‌కు కానుకగా ఇచ్చారు. దాంతో మూడు జిల్లాల్లో సాయిరెడ్డి జన్మదిన వేడకుల పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆయనంత గొప్పవారు లేరని పార్టీ సీనియర్ల నుంచి అంతా కొనియాడారు. మళ్లీ సాయిరెడ్డి భజన మొదలుపెట్టారు. జగన్ తో చెడింది కాబట్టి సాయిరెడ్డి ఢిల్లీకి పరిమితం అవుతారని అన్న వారంతా ఇపుడు ఆశ్చర్యకరంగా ఆయనే మన నాయకుడు అనడం విశేషం. పార్టీలో విజయసాయిరెడ్డి అంటే జగన్ తరువాత అని ఈ నాయకులే చెబుతూండడం విశేషం. మొత్తానికి జగన్ కి విజయసాయిరెడ్డికి మధ్య ఉన్న బంధం ఎంత గట్టిదో చెప్పడం ద్వారా పార్టీ అటు ప్రత్యర్ధులకు, ఇటు స్వపక్షం వారికీ కూడా వైసీపీ పెద్ద షాక్ ఇచ్చింది. తాము సీనియర్ లీడర్లమని, మంత్రులుగా పనిచేసిన మాజీలమని ఎవరైనా తోక జాడించాలని చూస్తే వారు విజయసాయిరెడ్డి కిందనే పనిచేయాల్సిఉంటుందని స్పష్టంగా చెప్పినట్లైంది. సో విజయసాయిరెడ్డి హవా ఎక్కడా తగ్గలేదన్నమాటేగా.

Tags:    

Similar News