ఆ వైసీపీ ఎంపీ రూటు మార్చారా… ?

విజయనగరం జిల్లా అంటే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఇలాకా అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి అడుగుపెట్టాక ముందు విశాఖ మీద [more]

Update: 2021-08-09 05:00 GMT

విజయనగరం జిల్లా అంటే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఇలాకా అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి అడుగుపెట్టాక ముందు విశాఖ మీద పట్టు సాధించారు. ఆ తరువాత శ్రీకాకుళం జిల్లాను కూడా పొలిటికల్ గా తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. ఇపుడు మిగిలింది విజయనగరం జిల్లా. ఇది బొత్స సత్యనారాయణ రాజకీయ కోట. కానీ జగన్ కుడిభుజం లాంటి సాయిరెడ్డి సై అంటే ఇక్కడ కూడా సమీకరణలు ఒక్కసారిగా తారుమారు అవాల్సిందే. ఇపుడు అదే జరుగుతోంది మరి. విజయనగరం జిల్లాలో అంతా తనవాళ్ళకే టికెట్లు తెచ్చుకుని హల్ చల్ చేస్తున్న బొత్స సత్యనారాయణ కు మెల్లగా చెక్ పెట్టేస్తోంది అధినాయకత్వం.

బంధువే దూరం …

విజయనగరం జిల్లా ఎంపీ బెల్లాల చంద్రశేఖర్ అంటే బొత్స సత్యనారాయణ కు దగ్గర బంధువు. అన్నింటికీ మించి బొత్సకు నీడ. అయితే కొంతకాలంగా ఎంపీకి మంత్రికి బాగా దూరం పెరిగింది అంటున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎంపీని కేవలం తన రాజకీయ అవసరలకే వాడుకుంటున్నారు అన్నది తెలిసిన విషయమే. వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు బొత్స సత్యనారాయణ తన సతీమణి ఝాన్సీని బొబ్బిలి ఎంపీ ఉప ఎన్నికల్లో పోటీకి దింపారు. అప్పటికి ఆమె జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఆమె ఎంపీ కావడంతో ఆ సీటుని నమ్మిన బంటు అయిన బెల్లానకు ఇచ్చారు. ఇక 2014 నాటికి బెల్లానను ముందుగా వైసీపీలోకి పంపించింది బొత్సే అంటారు. తీరా బొత్స వచ్చాక చీపురుపల్లి సీటు తాను ఎగరేసుకుపోయారు.

అలా సీటు దక్కింది ….

ఇక 2019 ఎన్నికల్లో విజయనగరం నుంచి ఎంపీ సీటుకు కూడా బొత్స సత్యనారాయణ తన సతీమణినే ప్రతిపాదించారు. కానీ అప్పటికే ఎక్కువ సీట్లు జగన్ ఆయన ఫ్యామిలీకి ఇవ్వడంతో నో చెప్పారట. దాంతో మళ్ళీ నీడలాంటి బెల్లానను వాడుకున్నారు. అలా చివరి నిముషంలో ఆయన ఎంపీ అయ్యారు. ఇపుడు చూస్తే ఎంపీని పక్కన పెట్టి అంతా అన్నట్లుగా కధ నడుపుతున్నారు. మరో వైపు చూస్తే 2024 నాటికి బొత్స ఝాన్సీయే విజయనగరం ఎంపీ అని బొత్స క్యాంప్ అపుడే ప్రచారం చేస్తోంది. దాంతో ఆయన వెంట ఉంటే తన రాజకీయ జీవితం ముగిసిపోయినట్లే అని భావించిన బెల్లాన ఏకంగా విజయసాయిరెడ్డికే చేరువ అయ్యారు అన్నది టాక్.

దూకుడు పెంచేశారు …..

ఇక బెల్లాన జిల్లా రాజకీయాల్లో దూకుడు పెంచేశారు. తనదైన శైలిలో ఆయన కేంద్ర మాజీ మంత్రి అశోక్ మీద విమర్శలు చేస్తున్నారు. అశోక్ మీద ప్రత్యక్షంగా విమర్శలు చేయడానికి బొత్స సత్యనారాయణ ఎపుడూ ముందుకురారు అన్నది తెలిసిందే. జిల్లాలో ఉన్న తెర వెనక బంధాలు అటువంటివి అంటారు. దాంతో విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతో బెల్లాన అశోక్ మీదనే బాణాలు వేస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో మరికొంతకాలం కొనసాగాలని అనుకుంటున్న ఆయన బొత్స సత్యనారాయణ మాదిరిగా చక్రం తిప్పాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయసాయిరెడ్డి ఆశీస్సులతో ఏకంగా చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగాలనుకుంటున్నారు. అంటే బొత్స సత్యనారాయణ కే ఎసరు అన్న మాట. చూడాలి మరి ఈయన పాలిటిక్స్ కి బొత్స మార్క్ రియాక్షన్ ఎలా ఉంటుందో.

Tags:    

Similar News