నెల్లూరు రెడ్డి గారిదే హవా

విజయసాయిరెడ్డి ఇపుడు అనేక కీలకమైన పదవులు, బాధ్యతలతో యమ బిజీగా ఉన్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా, అన్నింటికీ [more]

Update: 2019-08-11 06:30 GMT

విజయసాయిరెడ్డి ఇపుడు అనేక కీలకమైన పదవులు, బాధ్యతలతో యమ బిజీగా ఉన్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా, అన్నింటికీ మించి జగన్ ఆంతరంగికునిగా విజయసాయిరెడ్డి పాత్ర చాలా గొప్పది. జగన్ పార్టీలో నంబర్ టూ ఎవరూ అంటే తడుముకోకుండా చెప్పే పేరు విజయసాయిరెడ్ది. ఇక విజయసాయిరెడ్డికి విశాఖకు ఒక అనుబంధం ఉంది. ఆయన 2016లో రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఎంపీగా ఆయన విశాఖ జిల్లాను నోడల్ జిల్లాగా ఎంపిక చేసుకున్నారు. విశాఖలో ఆ విధంగా ఆయన వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏకైక ప్రజాప్రతినిధిగా సేవలు అందించారు. పార్టీని పటిష్టం చేయడంతో పాటు, ప్రతీ రెండు నెలలకు ఓ మారు వచ్చి సమీక్షలు నిర్వహించేవారు. ఆయన చేసిన కృషి ఫలితమే ఈ రోజు వైసీపీ విశాఖ జిల్లాలో నాలుగు తప్ప మొత్తానికి మొత్తం సీట్లు గెలుచుకుంది.

మంత్రులు ఉన్నా కూడా…

సరే ఇవన్నీ విజయసాయిరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు, జిల్లాలో సరైన నాయకత్వం పెద్దగా సీట్లు రానప్పటి మాట. ఇపుడు అలా కాదు మంత్రిగా అవంతి శ్రీనివాసరావు ఉన్నారు. ఇంచార్జి మంత్రి హోదాలో సీనియర్ అయిన మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. విశాఖ జిల్లాలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా విజయసాయిరెడ్డి ప్రభ విశాఖలో దివ్యంగా వెలిగిపోతోంది. పార్టీ ఎన్నికల్లో గెలిచిన తరువాత మూడు నెలల తరువాత తొలిసారిగా విజయసాయిరెడ్డి విశాఖ వస్తే వైసీపీ పార్టీ మొత్తం బ్రహ్మరధం పట్టింది. విజయసాయిరెడ్డి చుట్టూనే పార్టీ అన్నట్లుగా అంతా కలియతిరిగారు. రెండు రోజుల పాటు విజయసాయిరెడ్డి విశాఖలో ఉంటే ఆ హడావుడే సీఎం జగన్ లెవెల్లో సాగిపోయింది. విజయసాయిరెడ్డి పార్టీ మీటింగులో మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో గెలవడంపైన దిశానిర్దేశం చేశారు. పార్టీ అంతా ఒక్కటిగా ముందుకు సాగాలని కోరారు.

ఉత్సవ విగ్రహాలేనా :

ఇవన్నీ చూసినపుడు విశాఖ వైసీపీ రాజకీయాల్లో చక్రం తిప్పేది మంత్రులు కాదు, ఎంపీ, ఎమ్మెల్యేలు కాదన్నది తేలిపోతోంది. విజయసాయిరెడ్డి మాత్రమే విశాఖకు పెద్ద దిక్కు అన్నది కూడా క్లారిటీగా అర్ధమవుతోంది. విజయసాయిరెడ్డి కూడా ఇకపై తాను తరచూ విశాఖ వస్తానని చెప్పడాన్ని బట్టి చూస్తూంటే పార్టీలో ఆయనే అంతా అన్న వైఖరి కనిపిస్తోంది. మంత్రిగా అవంతి వంటి వారిని సైతం ఇపుడు నాయకులు పక్కన పెట్టి ప్రతీ దానికి విజయసాయిరెడ్డి అనే కలవరిస్తున్నారు. వార్డు స్థాయి నేత పార్టీలో చేరాలన్నా విజయసాయి చేతుల మీదుగానే కండువా కప్పుకుంటానని అనడం బట్టి చూస్తే విశాఖలో విజయసాయి హవా ఏంటన్నది అర్ధమవుతుంది. ఇక పదవుల కోసం పైరవీలు చేసుకునే వారు కూడా విజయసాయిరెడ్డి కంట్లో పడేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఇతర పార్టీల నుంచి బడా నాయకులు వైసీపీ వైపు రావాలన్నా విజయసాయిరెడ్డినే సంప్రదిస్తున్నారు. మొత్తానికి ఈ నెల్లూరు రెడ్డి గారు విశాఖలో రాజకీయాన్ని ఓ స్థాయిలో పండించేస్తున్నారు.

Tags:    

Similar News