ఇక్కడ కరోనాను మించిన భయం ?

విశాఖ అందమైన నగరం. సిటీ ఆఫ్ డెస్టినీ. పర్యాటకులకు స్వర్గధామం. అటువంటి విశాఖ విభజన తరువాత కబ్జా కోరుల కళ్ళలో పడింది. అయిదేళ్ళ తెలుగుదేశం పాలనలో విశాఖలో [more]

Update: 2020-05-03 08:00 GMT

విశాఖ అందమైన నగరం. సిటీ ఆఫ్ డెస్టినీ. పర్యాటకులకు స్వర్గధామం. అటువంటి విశాఖ విభజన తరువాత కబ్జా కోరుల కళ్ళలో పడింది. అయిదేళ్ళ తెలుగుదేశం పాలనలో విశాఖలో భూముల ఆక్రమణ ఒక లెక్కన సాగాయి. దాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది. ఇపుడు మళ్ళీ అలాంటి పరిస్థితులే వస్తున్నాయ అంటే అవునని తమ్ముళ్ళు అంటున్నారు. ఓ విధంగా విశాఖలో భూ దందాలు కరోనా భయాన్ని మించేలా ఉన్నాయని అంటున్నారు.

పులివెందులతో లింక్…

విశాఖకు పులివెందుల బ్యాచులు పెద్ద ఎత్తున వచ్చి తిష్టవేశాయని ఇద్దరు మాజీ మంత్రులు ఒకే స్వరంతో తాజాగా ఆరోపించడం జిల్లాలో సంచలనం రేపుతోంది. నిజానికి భూ కబ్జాల గురించి తెలుగుదేశం నేతలు మాట్లాడితే అసలు బాగోదు. వారే అప్పట్లో ఈ కబ్జాల ఆరోపణలు ఎదుర్కొన్నారు కాబట్టి. కానీ అన్నీ తెలిసిన వారు కాబట్టి వారు చెబితే నమ్మాల్సి ఉంటుందని అన్న వారూ ఉన్నారు. తెలుగుదేశం పాలనలో భూ కబ్జాలపైన మంత్రుల స్థాయి వరకూ ఆరోపణలు వెళ్లాయి. సిట్ విచారణను జరిపించిన అసలు దోషులను ఈశ్వరుడు కూడా కనిపెట్టలేకపోయాడు.

రాజధాని పేరిట …

నిజానికి రాజధాని కళ విశాఖకు ఎపుడో వచ్చింది. సహజంగానే విశాఖ భూములకు డిమాండ్ ఉంది. ఇపుడు చూస్తే వైసీపీ సర్కార్ విశాఖను రాజధానిగా ప్రకటించడంతో రెక్కలు వచ్చాయి. దానికి తోడు రాజకీయ పలుకుబడి కలిగిన ఆసాములు విశాఖ చేరి దందాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు అయితే పులివెందుల బ్యాచ్ విశాఖను నంజుకు తింటోందని ఆరోపిస్తున్నారు. మరో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అయితే ఇదంతా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో జరుగుతోందని ఘాటు కామెంట్స్ చేస్తున్నారు.

మచ్చగానే…..?

అయితే విశాఖలో భూముల కబ్జా అన్నది అయిదేళ్ళుగా సాగుతోంది. వైసీపీ సర్కార్ వచ్చి సరిదిద్దుతుంది అనుకుంటే పెనం నుంచి పొయ్యిలోకి వచ్చినట్లుగా ఉంది మా పరిస్థితి అని మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు అనుకుంటున్నాయి. ఇది నిజంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వ్యవహారమే. తరచూ టీడీపీ నేతలు ఈ ఆరోపణలు చేతున్నారని పక్కన పెట్టకుండా వైసీపీ సర్కార్ సీరియస్ గా దీని మీద విచారణ జరిపించాలి. తమ వారు, పరవారు అని చూడకుండా భూ దందాలు చేసిన వారు ఎవరు ఉన్నా కూడా కఠినంగా శిక్షిస్తేనే భూ దందాలకు అడ్డుకట్ట పడుతుంది, ప్రభుత్వానికి కూడా పరువు నిలబడుతుంది.

Tags:    

Similar News