అప్పుడు ఆయన.. ఇప్పుడు ఈయన

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఉద్యమం రోజురోజుకూ ఊపందుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రయివేటీకరణకు మొండిగా ముందుకు వెళుతుంది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు [more]

;

Update: 2021-03-23 02:00 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఉద్యమం రోజురోజుకూ ఊపందుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రయివేటీకరణకు మొండిగా ముందుకు వెళుతుంది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఒకరిపై ఒకరు దుమ్మెత్తు కోవడానికే సమయాన్ని వెచ్చిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. ప్రధానంగా విశాఖపట్నం ప్రాంతానికి చెందిన వారిపై ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంది.

రాజీనామాలు చేయాలంటూ….

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. కానీ గంటా శ్రీనివాసరావు తమ పార్టీ అని చెప్పుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. వైసీపీ ఎంపీలందరూ రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. అయితే వైసీపీ మాత్రం రాజీనామాలతో ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నిస్తుంది. పదవుల్లో ఉండి పోరాడితేనే ఫలితం దక్కుతుందని విజయసాయిరెెడ్డి వంటి నేతలు బాహాటంగానే చెబుతున్నారు.

అప్పట్లో హోదా కోసం….

అయితే మూడు సంవత్సరాలు వెనక్కు వెళితే ప్రత్యేక హోదా కోసం జగన్ తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించారు. అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. అధికారంలో ఉన్న అప్పటి టీడీపీ ఎంపీలను కూడా రాజీనామా చేయాలని విపక్ష నేతగా జగన్ అప్పుడు డిమాండ్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం రాజీనామాలకు సిద్ధపడలేదు. వైసీపీ ఎంపీలు ఎన్నికలకు ముందు రాజీనామాలు చేయడంతో హోదా విషయంలో పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

అధికారంలో ఉంటే….

ఇప్పుడు అదే పరిస్థితిలో టీడీపీ ఉంది. టీడీపీ రాజీనామాలకు డిమాండ్ చేస్తుంటే వైసీపీ మాత్రం ససేమిరా అంటుంది. ప్రధానంగా విశాఖ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఈ ఒత్తిడి అధికంగా ఉంది. రాజీనామాళ్ల సవాళ్లు తప్పించి ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా పరిరక్షించుకుందామన్న స్పృహ ఏ రాజకీయ పార్టీలోనూ కన్పించడం లేదు. మొత్తం మీద అప్పుడు ప్రత్యేక హోదా, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజీ డ్రామాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Tags:    

Similar News