ధర్మం… న్యాయం కూడాగా?

బంగారు బాతు గుడ్డు కధను కూడా వక్రీకరించడంలో చంద్రబాబు పండిపోయారు. మనకు తెలిసి పైసా కూడా ఖర్చు చేయకుండా ప్రతీ రోజూ ఒక బంగారు గుడ్డు పెట్టే [more]

Update: 2020-02-07 12:30 GMT

బంగారు బాతు గుడ్డు కధను కూడా వక్రీకరించడంలో చంద్రబాబు పండిపోయారు. మనకు తెలిసి పైసా కూడా ఖర్చు చేయకుండా ప్రతీ రోజూ ఒక బంగారు గుడ్డు పెట్టే బాతు ఓ ఆసామి వద్ద ఉండేదని పాతకాలం కధ. కానీ చంద్రబాబు గారి బంగారు బాతు కధ చాలా డిఫరెంట్. అమరావతిని ఆయన బంగారు బాతు అంటున్నారు. అక్కడ ఇప్పటికిపుడు బాతు లేదూ, గుడ్డూ లేదు, కానీ ప్రతీ రోజూ ఆదాయం వచ్చేస్తోంది, తెచ్చేస్తోంది అంటూ చంద్రబాబు మభ్యపెడుతున్నారు. అమరావతి బాతుగా మారడానికి పాతికేళ్ళు పైగానే పడుతుందని నిపుణులు లెక్కలు వేస్తున్నారు, అది బంగారు గుడ్లు పెడుతుందో, మామూలు గుడ్లు పెడుతుందో ఆ కధ తేలడానికి మరో పదేళ్ళు, లేక పాతికేళ్ళు అవుతుందని చెబుతున్నారు.

లక్షల కోట్లతో….

మరి ఇపుడు గుడ్డు దశలో కూడా లేని అమరావతిని మేపడానికి పదమూడు జిల్లాల జనం ఆదాయమంతా పన్నుల రూపంలో లక్షల కోట్లు పెట్టాలి. ఈ పాతికేళ్ళ కాలమంతా బాతు ఆ మేత తింటూ ఉంటే పనీ పాటా మానేసి మిగిలిన జిల్లాలు చూస్తూ కూర్చోవాలి. ఆ మీదట ఎదిగిన బాతు పెట్టే గుడ్లు మాత్రం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన లక్షల కోట్ల రూపాయల ఆసాములకే అందుతాయి. ఎందుకంటే చంద్రబాబుగానే చెప్పినట్లుగా అమరావతిలో ఈ రోజుకు గజం స్థలం 36 వేల రూపాయలు. ఈ లెక్కన అభివృధ్ది చేస్తే గజం ధర లక్షలు దాటేస్తుంది కనుక. ఇక పేదలు, మధ్యతరగతీ లేని అమరావతి రాజధాని కోసం మిగిలిన జిల్లా వారు త్యాగం చేయాలి. ఆ బాతు గుడ్లు మాత్రం అప్పనంగా అక్కడ భూములు తీసుకున్న వారు అనుభవిస్తారన్న మాట. ఎంత దుర్మార్గం. ఇదేనా సమ సమాజం. ఇదేనా సమతావాదం. ఇదేనా నలభయ్యేళ్ళ అనుభవంతో చెబుతున్న మాట చంద్రబాబూ అని మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతీ ఒక్కరూ అడిగే పరిస్థితి.

విశాఖ రెడేమేడ్….

ఇక విశాఖపట్నం బాతు గురించి ఆలోచిస్తే ఇక్కడ అన్ని రకాల సదుపాయాలూ ఉన్నాయి. ఇది రెడీమేడ్ సిటీ. ఇక్కడా డబ్బు ఖర్చు చేయాలి. కానీ కొంత పెడితే సరిపోతుంది. దేశమంతానే కాదు, ప్రపంచమంతా ఇప్పటికిపుడు కనెక్ట్ అయ్యే సిటీగా ఉంది. కొద్దికాలంలోనే ఈ సిటీ బంగారు బాతు గుడ్లు అని చంద్రబాబు గారు చెప్పినట్లుగా పెట్టకపోవచ్చు కానీ గుడ్లు అయితే పెడుతుంది ఇక్కడ ఇప్పటికే అన్ని రకాలైన ప్రజలూ ఉన్నారు. ఇదొక కాస్మోపాలిటన్ సిటీ. ఓ విధంగా మినీ ఇండియా. అందువల్ల వైసీపీ సర్కార్ తక్కువ ఖర్చుతో ఇక్కడ రాజధానిని డిజైన్ చేసి ఎక్కువ ఫలితాలు ఆంధ్రాకు అందేలా ప్రయోగం చేస్తోంది. ప్రయోగం అని ఎందుకు చెప్పాలంటే ఇల చేస్తే ఇలా జరుగుతుందనే లెక్కలేవీ అభివృధ్ధి విషయంలో వర్తించవు కాబట్టి.

ప్రయోగమే…?

ఓ విధంగా జగన్ రిస్క్ చేస్తున్నాడనే అనుకోవాలి. అందరూ అమరావతిని అంటున్నారు, మూడు రాజధానుల ప్రతిపాదనను తిప్పికొడుతున్నారు, కానీ జగన్ ఈ విధానం ఎంచుకున్నారు. సక్సెస్ అయితే మిగిలిన వారంతా తుళ్ళిపోతారు. ఫెయిల్ అయితే జగన్ రాజకీయమే ప్రమాదంలో పడుతుంది. ఏది ఏమైనా జగనే కాదు, ఇపుడున్న పరిస్థితుల్లో ఏ కుటుంబ ఆసామి అయినా తక్కువ ఖర్చుతో ఫలితాలు ఆశిస్తాడు. అందువల్ల ఇప్పటికైతే బంగారు బాతు గుడ్డు విశాఖే అని చెప్పడం ధర్మం, న్యాయం కూడా.

Tags:    

Similar News