జగన్ రివర్స్ డెసిషన్ కు దిగుతారా? అదే జరిగితే?

విశాఖను అయిదోతనం లేని నగరంగా అందుకే అంటారేమో. అన్నీ ఉన్నా కూడా ఏమీ కాకుండా ఒక మూలన పడిఉంది. బ్రిటిష్ పాలకులు గుర్తించి పెంచి పెద్ద చేసిన [more]

;

Update: 2020-05-14 02:00 GMT

విశాఖను అయిదోతనం లేని నగరంగా అందుకే అంటారేమో. అన్నీ ఉన్నా కూడా ఏమీ కాకుండా ఒక మూలన పడిఉంది. బ్రిటిష్ పాలకులు గుర్తించి పెంచి పెద్ద చేసిన నగరం స్వదేశీ పాలకుల చేతిలో మాత్రం విసిరేసినట్లుగా ఎక్కడో ఉండిపోయింది. రాజసం మెరుపులు తప్ప అసలైన వైభోగం మాత్రం ఈ నగరానికి ఇప్పటికీ దక్కలేదు. దానికి కారణం విశాఖ సిటీ భౌగోళిక పరిస్థితులేనని అంటారు. ఇక వాస్తు కూడా విశాఖకు అచ్చిరాలేదని, లేకపోతే ఏనాడో విశాఖ హైదరాబాద్ కి ధీటుగా మారేదని కూడా చెబుతారు. ఏది ఏమైనా కూడా చేతిలో ముద్ద నోట్లోకి చేరకుండానే పెను ఉపద్రవాలు వచ్చి విశాఖను అతలాకుతలం చేస్తున్నాయి.

సేఫ్ కాదా…?

విశాఖ భద్రత ఇపుడు మరో మారు చర్చకు వస్తోంది. నిజానికి విశాఖ భద్రత అన్నది 2014లో బాహాటంగా అతి ముఖ్యమైన చర్చగా వచ్చింది. ఆనాడు హుదూద్ తుఫాన్ విశాఖను వణికించేసింది. దాంతో ఈ ప్రాంతంలో ప్రజలు అల్లడిపోయారు. ప్రతీ వందేళ్ళకు వచ్చే అతి భయంకరమైన ప్రకృతి విపత్తు విశాఖను అలా కుదేల్ చేసింది. దాంతో అంతవరకూ విశాఖ మీద కొద్దో గొప్పో ఆశలు ఉన్న వారు సైతం ఈ నగరం ప్రకృతి ప్రకోపానికి బలి అయ్యే స్థితిలో ఉందని తేల్చేశారు. ఎపుడు ఏమి ముంచుకువస్తుందో తెలియదు అని కూడా అనేశారు. సముద్రాన్ని తాకుతూ విస్తరించిన ఈ నగరంలో భద్రతకు అవకాశాలు తక్కువేనని కూడా విశ్లేషించారు.

విస్పోటం కుంపటిపై…..

ఇక విశాఖ చుట్టుపక్కలంతా పలు రసాయన పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా జనవాసాలను ఆనుకుని ఉన్నాయి. ఒక చిన్న తప్పిదం జరిగితే నగరం మొత్తం భస్మీపటలం అవడానికి ఎంతో సేపు పట్టదని నిపుణులు అంచనాలు ఉన్నాయి. విశాఖకు తూర్పు వైపు సాగరం ఉంది. కొండలు పడమర వైపు ఉన్నాయి. ఇక పరిశ్రమలు కూడా అటువైపు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే కాలుష్యం కానీ విషపు వాయువులు కానీ సిటీని దాటి పోనీయని భౌగోళిక పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. దీని వల్ల విశాఖలో ఏదైనా పెను ముప్పు వస్తే గాలిలోనే విష వాయువులు సుదీర్ఘమైన కాలం నిలిచి ఉంటాయని, అవే భారీ ప్రమాదానికి, ప్రాణనష్టానికి కారణం అవుతాయని చెబుతున్నారు. తాజాగా జరిగిన ఎల్జీ పాలిమార్స్ గ్యాస్ లీక్ ఓ మాదిరి ప్రమాదంగా చెబుతున్నారు. ఇంతకు మించి జరిగితే మొత్తం 14 నుంచి 20 కిలోమీటర్ల లోపునే విస్తరించి ఉన్న సిటీ మొత్తం ఆహుతి కావడానికి అట్టే సమయం పట్టదని కూడా ఆయా రంగాల్లోని నిష్ణాతులు విశ్లేషిస్తున్నారు.

రాజధాని డౌటా…?

ఈ క్రమంలో చూసుకుంటే విశాఖకు రాజధాని వస్తుందా అన్న ప్రశ్న మళ్ళీ ఏర్పడింది. విశాఖను రాజధాని చేస్తామని జగన్ గట్టి పట్టుదలగా ఉన్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్న వారు హుదూద్ తుఫాన్లను ఇప్పటిదాకా గుర్తు చేసేవారు, ఇపుడు గ్యాస్ లీక్ ఘటనలతో అసలు భద్రతే లేదని అంటున్నారు. మరి దీని మీద వైసీపీ సర్కార్ ఏం చేస్తుందన్నది ఆలోచించాలి. విశాఖ రాజధాని వద్దు అంటున్న టీడీపీకి ఇతర పక్షాలకు ఈ పరిణామాలు కలసివచ్చేలా ఉన్నాయి. మరి ఈ వత్తిడి పెరిగితే వైసీపీ సర్కార్ ఏం చేస్తుంది అన్నది చూడాలి.

అలా చేస్తేనే….

తాజా పరిణామాలు చూసుకున్నపుడు విశాఖ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిందని అంటున్నారు. దీనికి ప్రకృతిపరమైన అవరోధాలను పక్కన పెడితే పాలకులు చేసిన తప్పుల కారణంగానే విశాఖ ఇమేజ్ డ్యామేజ్ అయిందని అంటున్నారు. ప్రమాదకరమైన పరిశ్రమలను నగరానికి దూరంగా ఒక ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకుంటే విశాఖకు ఉపాధికి కొదవ ఉండదు, అభివృధ్ధికి ఆటంకం ఉండదు అని అంటున్నారు. అదే సమయంలో విశాఖలో ప్రమాదాలు కూడా జరగవు అంటున్నారు. ఇక హుదూద్ తుఫాన్లు వంటివి ఎపుడో వస్తాయని, వాటికి తగిన యాక్షన్ ప్లాన్ తో సిధ్ధం గా ఉంటే విశాఖ ప్రగతిని ఎవరూ ఆపలేరని మరో వైపు వినిపిస్తున్న సూచనలు. ఏది ఏమైనా విశాఖ విధి వంచితగా మిగులుతుందో, విధిని ధిక్కరించి వికసించి ముందుకు సాగుతుందో చూడాలి.

Tags:    

Similar News