విశాఖ దాహాన్ని సముద్రం తీరుస్తుందా..?

విశాఖ చిన్న పల్లెకారు ప్రాంతంగా ఉంటూ వందేళ్ల కాలంలో మహా నగరంగా ఎదిగింది. తాజా గణాంకాల ప్రకారం విశాఖ జనాభా పాతిక లక్షలు ఉంటుందని అంచనా. ఇక [more]

Update: 2020-08-27 05:00 GMT

విశాఖ చిన్న పల్లెకారు ప్రాంతంగా ఉంటూ వందేళ్ల కాలంలో మహా నగరంగా ఎదిగింది. తాజా గణాంకాల ప్రకారం విశాఖ జనాభా పాతిక లక్షలు ఉంటుందని అంచనా. ఇక విశాఖ పెరుగుతున్న నగరం, ప్రతి పదేళ్లకు పది లక్షల మంది కొత్తగా వచ్చి చేరుతున్నారు. అటువంటి నగరాన్ని రాజధానిగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నా అతి పెద్ద సమస్య మాత్రం పట్టి పీడిస్తోంది. అదే నీటి కొరత. విశాఖకు మొదటి నుంచి అదే ప్రధాన సమస్యగా ఉంది. ఓవైపు చూస్తే నగరం విస్తరిస్తోంది. తాగేందుకు నీటికి మాత్రం ఇక్కట్లు తప్పడంలేదు.

ట్రాఫిక్ జామ్….

విశాఖలో సచివాలయం పెట్టి ముఖ్యమంత్రి, మంత్రులు సహా మొత్తం పాలన వస్తే జనాభా పేరిట ట్రాఫిక్ యమ జోరుగా పెరిగిపోతుంది. దాంతో పాటే విశాఖలో నీటి కొరత కూడా ఇంతకు పదింతలు అవుతుందని మేధావులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ చుట్టూ నదులు లేవు, విశాఖలోని భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వేసవి వస్తే చాలు ఏ ఏటికి ఆ ఏడు కష్టాలు పెరిగిపోతాయి. అటువంటి చోట నీటి కోసం కటకట తప్పదని నగరం ప్రణాళికా విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉప్పు నీరే గతి …..

విశాఖకు ఎదురుగా గంభీర సాగరం ఉంది. ఉప్పు నీరు తప్ప అక్కడేమీ లేదు. మరి నగర నీటి కష్టాలు తీరాలంటే ఆ ఉప్పు నీటిని మంచినీరుగా చేయాలి. అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిధ్ధం చేస్తోందని రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ఇజ్రాయిల్ తరహాలో సముద్రం నీటిని మంచినీటిగా మార్చే పధకానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని కూడా అంటున్నారు. దానికి ఇజ్రాయిల్ ప్రభుత్వం నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటామని చెబుతున్నారు. డీశాలిటేషన్ ప్లాంట్ ని విశాఖలో ఏర్పాటు చేయడం ద్వారా ఉప్పు జలాలను మంచి నీటిగా మార్చే ప్రక్రియకు సర్కార్ శ్రీకారం చుడుతుందన్న మాట.

అయ్యే పనేనా…?

ప్రభుత్వం ఇలా చెబుతున్నా కూడా ఆచరణలో ఎంతవరకూ సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాగర జలాలను మంచి నీరుగా మార్చే ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది అని కూడా తెలుసు. పైగా ఇది ఎంతవరకూ ఫలితాలు ఇస్తుందో కూడా తెలియదు అంటున్నారు. మరో వైపు నదీ జలాలు సమృధ్ధిగా ఉన్న చోట రాజధాని పెట్టుకుంటే బాగుంటుందని, ఆ విధంగా అనుకుంటే అమరావతి క్రిష్ణా నది ఒడ్డున ఉందని, అదే బెస్ట్ ప్లేస్ అని అమరావతి ప్రేమికులు నినదిస్తున్నారు. విశాఖలో రాజధాని పెట్టడం వల్ల భూమి, నీరు కొరత మరింతగా పెరుగుతుందని అంటున్నారు. అయితే ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంది కాబట్టి సముద్రాన్నే నమ్ముకుందని విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. చూడాలి మరి జగన్ సర్కార్ నీటి సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తుందో.

Tags:    

Similar News