రవి రాజకీయం ముగిసినట్లేనా ?
విజయవాడ రాజకీయాల్లో మచ్చలేని నాయకులుగా గుర్తింపు ఉన్న కుటుంబంగా పేరున్న యలమంచిలి రవి.. ప్రస్తుతం ఫుల్ సైలెంట్ అయిపోయారు. తండ్రి యలమంచిలి నాగేశ్వరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన [more]
;
విజయవాడ రాజకీయాల్లో మచ్చలేని నాయకులుగా గుర్తింపు ఉన్న కుటుంబంగా పేరున్న యలమంచిలి రవి.. ప్రస్తుతం ఫుల్ సైలెంట్ అయిపోయారు. తండ్రి యలమంచిలి నాగేశ్వరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన [more]
విజయవాడ రాజకీయాల్లో మచ్చలేని నాయకులుగా గుర్తింపు ఉన్న కుటుంబంగా పేరున్న యలమంచిలి రవి.. ప్రస్తుతం ఫుల్ సైలెంట్ అయిపోయారు. తండ్రి యలమంచిలి నాగేశ్వరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన యలమంచిలి రవి అనతి కాలంలోనే పుంజుకున్నా.. ఆ వెంటనే వేసిన అడుగుల కారణంగా.. రాజకీయంగా చరిష్మాను కోల్పోయారనేవాదన వినిపిస్తోంది. యలమంచిలి నాగేశ్వ రరావు.. టీడీపీలో మంచి గుర్తింపు పొందారు. 1999 ఎన్నికల్లో అప్పటి కంకిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అంతేకాదు.. ప్రజలకు అండగా ఉండే నేతగా కూడా గుర్తింపు పొందారు. నాగేశ్వరరావు దేవినేని నెహ్రూను ఓడించి సంచలనం క్రియేట్ చేశారు.
తండ్రికి తగ్గ తనయుడిగా…
నాగేశ్వరరావు వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన యలమంచిలి రవి కూడా ప్రజల నేతగా.. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన యలమంచిలి రవి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. విచిత్రం ఏంటంటే ఆ ఎన్నికల్లో రవి దేవినేని నెహ్రూ, గద్దె రామ్మోహన్ లాంటి ఇద్దరు ఉద్దండులు అయిన నేతలను ఓడించారు. అయితే .. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత.. ఆయన దూరంగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత.. టీడీపీలో చేరినా ఆయన్ను పట్టించుకునే వాళ్లు లేరు.వివాద రహితుడిగా గుర్తింపు, కమ్మ సామాజిక వర్గంలో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ… రాజకీయంగా యలమంచిలి రవికి కాలం కలిసి రాలేదు.
టీడీపీలోనూ…..
గత ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్‌ను ఆశించారు. అయితే.. చంద్రబాబు అప్పటికే.. గద్దె రామ్మోహన్‌కే మళ్లీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. పార్టీ అధికారంలోకి వస్తే.. నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ యలమంచిలి రవి మాత్రం.. ప్రజాసంకల్ప యాత్రలో విజయవాడకు వచ్చిన జగన్‌ను కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలకు ముందు వరకు ఆయనే తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అయితే..ఇక్కడా ఆయనకు నిరాశే ఎదురైంది. తూర్పు నియోజకవర్గం టికెట్‌ను బొప్పన భవ కుమార్‌కు కేటాయించారు. ఇక, అప్పటి నుంచి యలమంచిలి అడ్రస్ లేకుండా పోయింది.
వచ్చే ఎన్నికల్లోనూ….
పోనీ.. వచ్చే 2024 ఎన్నికల్లో అయినా.. తూర్పు టికెట్ దక్కుతుందా ? అంటే.. మాజీ మంత్రి, దివంగత దేవినేని నెహ్రూ కుమారుడు, యువ నేత,, అవినాష్.. ఇప్పుడు వైసీపీతరఫున తూర్పు నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారు. అవినాష్ జగన్‌కు సన్నిహితంగా కూడా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు ఎలాగూ అవినాష్‌దే డౌట్ లేదు..! అయితే ఎమ్మెల్సీనో లేదా నామినేటెడ్ పదవి అయినా ఇస్తారని యలమంచిలి రవి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జగన్ కనీసం జిల్లా స్థాయి నామినేటెడ్ పదవికి కూడా రవి పేరును పరిశీలించలేదు. నాడు అధికార పార్టీ టీడీపీలో ఉండి.. ఇప్పుడు మళ్లీ అధికార వైసీపీలో ఉన్నా కూడా యలమంచిలి రవిని పట్టించుకునే నేతలే లేకుండా పోయారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రవి రాజకీయం ముగిసినట్లే అనుకోవాలి.