విశాఖలో పెట్టుబడుల వరద పారేనా ?

విశాఖను గురి పెట్టి మరీ వైసీపీ అన్ని కార్యక్రమాలనూ చేస్తోంది. విశాఖను పాలనారాజధాని అని చెప్పి చట్టం చేసిన వైసీపీ ఇపుడు పారిశ్రామిక రాజధానిని చేస్తామని అంటోంది. [more]

;

Update: 2020-11-29 00:30 GMT

విశాఖను గురి పెట్టి మరీ వైసీపీ అన్ని కార్యక్రమాలనూ చేస్తోంది. విశాఖను పాలనారాజధాని అని చెప్పి చట్టం చేసిన వైసీపీ ఇపుడు పారిశ్రామిక రాజధానిని చేస్తామని అంటోంది. అందుకోసం ఎలాంటి ఆర్భాటం లేకుండా పారిశ్రామిక సదస్సుని తాజాగా నిర్వహించింది. విశాఖను ఉన్న సామర్ధ్యాన్ని స్థానిక పారిశ్రామిక వేత్తలకు తెలియచేసింది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున చేయాల్సింది తాము చేస్తామని చెబుతోంది.

గతానికి భిన్నం….

అయిదారేళ్ళ క్రితం నాటి సీఎం చంద్రబాబు విశాఖలో పారిశ్రామిక సదస్సుల పేరిట చాలానే హడావుడి చేసేవారు. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అనుకూల మీడియాలో రాయించుకునేవారు. అయితే చివరికి ఏవీ రాలేదు కానీ ఖజానా నుంచి ఖర్చులు మాత్రం తీసి పెట్టాల్సివచ్చేది. ఇక వైసీపీ మాత్రం తాము ఇలాంటి వాటిని భిన్నమని చెప్పుకుంది. పైగా విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు, విజయసాయిరెడ్డి, అధికారుల సమక్షంలోనే సదస్సుని నిర్వహించి మరీ సత్తా చాటింది. సందేహాలను తీర్చడమే కాకుండా మీ పెట్టుబడులకు మా భరోసా అంటూ వైసీపీ పెద్దలు నినాదాన్ని ఇచ్చి నమ్మకం పెంచారు.

లొకల్ కే చాన్స్ …

ఇక ఎక్కడో దేశ విదేశాల నుంచి విశాఖకు పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు చెప్పేవారు. అంతే కాదు వారంతా రావడం అంటే తనను చూసేనని జబ్బలు చరచేవారు. కానీ విదేశీ పెట్టుబడులు, దేశీయ పరిశ్రమలు ఏవీ రాక ఏపీ డీలా పడింది. లెక్కలు తీసి చూస్తే సదస్సుల పేరిట నిర్వహణకు వందల కోట్లు తగలేశారని వైసీపీ నేతలు నాడు విమర్శించారు కూడా. ఇపుడు ఎక్కడ నుంచో పెట్టుబడులను ఆకర్షించడం ఎందుకు. లోకల్ గా ఉన్న వారికే ప్రోత్సాహకాలు ఇస్తే వారే ముందుకు వస్తారని, వారిని స్థానికంగా అన్నీ తెలుసు కాబట్టి వెంటనే గ్రౌండ్ అయ్యేందుకు కూడా వీలు ఉంటుందని వైసీపీ సర్కార్ లోకల్ నినాదం అందుకుంది.

బ్రాండ్ విశాఖ….

విశాఖ ఖ్యాతిని పెంచడమే కాకుండా టైర్ వన్ సిటీగా ఏపీలో అభివృద్ధి చేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రాజధానిగా విశాఖ అవడం ఖాయమని అందువల్ల పరిశ్రమలు వస్తే తగిన విధంగా సర్కార్ నుంచి సహాయం ఉంటుందని అంటున్నారు. అనుమతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారిశ్రామిక పాలసీని రూపకల్పన చేశామని, రాయితీలు కూడా ఆకర్షణీయంగా రూపొందించామని చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే చాప కింద నీరు మాదిరిగా విశాఖలో పెట్టుబడుల వరద పారించాలని వైసీపీ ప్లాన్ వేస్తోంది. తమది చేతల ప్రభుత్వం అంటోంది. మరి వర్కౌట్ అయితే జగన్ కి అతి పెద్ద మెగా సిటీలో తిరుగు ఉండదని అంటున్నారు.

Tags:    

Similar News