వైసిపికి గట్టి షాక్ తగిలిందే …?
తానొకటి తలుచుకుంటే దైవం మరొకటి చేసిందని ఇప్పుడు వైసిపి కేంద్ర వైఖరి చూసి మదన పడిపోతుందా…? బిజెపి, తెలుగుదేశం పార్టీల అంతర్గత బంధం పోలవరం టెండర్ల రద్దుతో [more]
;
తానొకటి తలుచుకుంటే దైవం మరొకటి చేసిందని ఇప్పుడు వైసిపి కేంద్ర వైఖరి చూసి మదన పడిపోతుందా…? బిజెపి, తెలుగుదేశం పార్టీల అంతర్గత బంధం పోలవరం టెండర్ల రద్దుతో [more]
తానొకటి తలుచుకుంటే దైవం మరొకటి చేసిందని ఇప్పుడు వైసిపి కేంద్ర వైఖరి చూసి మదన పడిపోతుందా…? బిజెపి, తెలుగుదేశం పార్టీల అంతర్గత బంధం పోలవరం టెండర్ల రద్దుతో బయటపడిందా ? లోక్ సభలో కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ చేసిన ప్రకటనలు పరిశీలిస్తే ఇది నిజమేనన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో దుమారం నడుస్తుంది. సాక్షాత్తు ప్రధాని హోదాలో పోలవరం ప్రాజెక్ట్ ను తెలుగుదేశం ఎటిఎం లా ఉపయోగించుకుని డబ్బంతా తినేస్తుందని ఆరోపించారు నరేంద్ర మోడీ. ఎన్నికల ప్రచారం వరకే ఈ ఆరోపణలు పరిమితం కాలేదు. ఆ తరువాత కూడా ఎపి బిజెపి నేతలు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి జివిఎల్ నరసింహారావు, ఎమ్యెల్సీ సోము వీర్రాజు వంటివారంతా పోలవరం లో టిడిపి బాగోతాలు అన్ని ఇన్నీకావంటు వైసిపి కన్నా ఎక్కువ ఆరోపణలే చేశారు. ఇప్పుడు వీరి ఆరోపణలన్నీ దూదిపింజల్లా తేలిపోయినట్లే.
పోలవరంలో అవినీతి ఎక్కడ …?
పోలవరంలో అవకతవకలపై బిజెపి దుమ్మురేపిన తరువాత వైసిపి వ్యూహాత్మకంగా లోక్ సభలో మిధున్ రెడ్డి ద్వారా ప్రశ్నను లేవనెత్తింది. అవినీతి అక్రమాలు ఏమి ఏమి జరిగాయో ప్రకటించాలని కోరడంతో బిజెపి సర్కార్ ఇరుకున పడింది. ఉన్నాయని చెబితే చర్యలు తీసుకోక తప్పదు. అలా చేస్తే ఇందులో కొందరి బిజెపి అగ్రనేతల పాత్రపైనా టిడిపి ఆరోపణలు చేసే ప్రమాదం వుంది. ఇవన్నీ గమనించి అవకతవకలు లేవని సర్కార్ ప్రకటించి చేతులు దులుపుకుంది. అక్కడితో ఆగకుండా తాజాగా పోలవరం టెండర్లు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కి వెళ్ళాలన్న వైసిపి దూకుడు పైనా కేంద్రం నీళ్ళు చల్లింది. పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుందని అంతా తమను అడుగుతున్నారని కానీ దీని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చారు. అయితే ప్రస్తుత టెండర్లు రద్దు కావడంతో ఎప్పటిలోగా ప్రాజెక్ట్ పూర్తి అవుతుందో చెప్పలేమని కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల ప్రాజెక్ట్ వ్యయం మరింత పెరుగుతుందని పేర్కొనడం గమనార్హం.
రెండు పార్టీలతో సమదూరం ….
ఎపి లో ప్రధాన పక్షాలు వైసిపి, టిడిపి ఈ రెండు పార్టీలతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తమ పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమానికి బిజెపి పావులు కదుపుతుంది. గత సర్కార్ ఉన్నప్పుడు కూడా రాష్ట్ర రాజకీయల వరకు ఉప్పు నిప్పుగా వున్న టిడిపి, వైసిపి లు మాత్రం కేంద్రానికి పూర్తి సహకారం అందించాయి. పోనీ దీనిఫలితంగా ఎపి కి మేలు జరిగిందా అంటే ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు సరికదా ఇచ్చే నిధులు సైతం రాలేదు. తాజా బడ్జెట్ లో సైతం ఎపి కి మొండి చెయ్యి చూపించింది కేంద్రం. అయినా కాని మోడీ సర్కార్ కి జీ హుజూర్ అనక తప్పడంలేదు.
ఇద్దరికి అవసరమే ….
అధికార, విపక్ష పార్టీలకు. రాష్ట్రానికి కేంద్ర సహకారం అన్ని విధాలా అవసరం కావడంతో వైసిపి కమలానికి జై కొడుతుంటే, కేసులు దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న టిడిపి శ్రేణులు మోడీతో సఖ్యతని కోరుకుంటున్నాయి. దాంతో కేంద్ర సర్కార్ కూడా అటు టిడిపి పై ఈగవాలకుండా చూసుకునే పనిలో వుంది. ఈ పరిస్థితి వైసిపి ని ఇబ్బంది పెడుతుంది. టిడిపి బండారం బయటపెట్టాలని దూకుడు గా వెళుతుంటే కేంద్రం మోకాలు అడ్డుపెడుతుండటాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీ సతమతం అవుతుంది. మొత్తానికి పోలవరం లో గత టిడిపి సర్కార్ ను వెనకేసుకు రావడం ద్వారా తమ అంతర్గత బంధాన్ని చెప్పక చెప్పేసింది బిజెపి. మరి ఇంకెలాంటి ట్విస్ట్ లు ఈ రెండు పార్టీలనుంచి రానున్నాయో చూడాలి.