నో రిలాక్స్ అంటున్న జగన్…బిగ్ రిస్క్ వైపే?

ముఖ్యమంత్రి జగన్ రాజకీయం ఇలాగే ఉంటుంది. ఆయన అనుకున్నది చేయడానికి ఏనాడూ వెనుకంజ వేయలేదు. చాలా మంది అనుకుంటున్నట్లుగా జగన్ ముందూ వెనకా ఆలోచించరు అన్నది తప్పు [more]

Update: 2021-04-11 14:30 GMT

ముఖ్యమంత్రి జగన్ రాజకీయం ఇలాగే ఉంటుంది. ఆయన అనుకున్నది చేయడానికి ఏనాడూ వెనుకంజ వేయలేదు. చాలా మంది అనుకుంటున్నట్లుగా జగన్ ముందూ వెనకా ఆలోచించరు అన్నది తప్పు మాట. ఆయనకు పర్యవశానాలు, ఫలితాలూ కూడా బాగానే తెలుస్తాయి. కానీ ఆయన కోరి మరీ బిగ్ రిస్క్ చేస్తారు. అందుకే ఆయన రాజకీయ వేగం ఎక్కడా ఆగదు అని చెబుతారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ ఇపుడు బక్కచిక్కి ఉంది. తన చిరకాల ప్రత్యర్ధి చంద్రబాబు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మరి ఈ సమయంలో అవతల వైపు ఎవరు ఉన్నా కాస్తా రిలాక్స్ అవుతారు. కానీ అక్కడ ఉన్నది జగన్. ఆయన అసలు రిలాక్స్ అవను అంటున్నారు.

అంతు చూడాల్సిందే …?

తెలుగుదేశం పార్టీ బలం బలహీనతలు జగన్ కి బాగా తెలుసు. ఒక్క చిన్న అవకాశం మళ్ళీ వచ్చినా పూర్తి స్థాయిలో వీర విహారం చేస్తుంది. అందుకే జగన్ మళ్ళీ ఆ పార్టీ లేవకుండా గట్టి దెబ్బలే వరసగా కొట్టాలనుకుంటున్నారుట. ఆ పార్టీ అస్థిత్వానికే గురి పెట్టి అంతు చూడాలనుకుంటున్నారు. జగన్ స్ట్రాటజీయే వేరు. తన వయసుతో పాటు ఏపీలో రాజకీయ పరిస్థితులను కూడా ఆయన బాగానే బేరీజు వేసుకుంటున్నారు. తాను అనుకున్నట్లుగా మరిన్ని టెర్ములు అధికారంలోకి రావాలంటే టీడీపీ నామమాత్రం అయిపోవాలంతే. ఇదే జగన్ పట్టుదల.

ఎన్నికలు అన్న మాటతోనే ….

ఇక ఏపీలో తెలుగుదేశానికి మొదటి సారి మైండ్ బ్లాంక్ అయింది 2019 ఎన్నికల్లోనే. అయితే దానికి చంద్రబాబు తెలివిడితో కూడిన రాజకీయాన్ని మేళవించి ఓటమిని కూడా ఏమీ కాకుండా చూపించారు. ఆ విధంగా పార్టీ శ్రేణులను బాగా మభ్యపెట్టారు. ఈవీఎంల కారణంగానే టీడీపీ ఓటమిపాలు అయిందని కూడా ఆయన పదే పదే చెప్పుకొచ్చారు. దీన్ని మెజారిటీ పార్టీ జనాలు నమ్మారు కూడా. అయితే ఈ ఏడాదిలో జరిగిన పంచాయతీ, మునిసిపాలిటీ ఎన్నికల్లో మాత్రం బ్యాలెట్ పేపర్ మీదనే ఏపీ జనాలు తీర్పు చెప్పారు. మరి టీడీపీ దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది. అదే సమయంలో వైసీపీది ఏకపక్షం అయింది. ఇక వరసపెట్టి తిరుపతి ఉప ఎన్నిక కూడా ఉంది. దీని ఫలితమూ తెలిసిపోతున్నదే. దీంతో ఇప్పుడు ఎన్నికలు అంటేనే టీడీపీ తమ్ముళు భయపడే పరిస్థితి వచ్చేసింది.

ఇది చాలదా …?

ఏపీలో ఎన్నికలు ఎందుకు అని మొదట్లో జగన్ భావించిన సంగతి విదితమే. కానీ లోకల్ బాడీ ఎన్నికల ఫలితాల‌ను చూశాక టీడీపీ ఘోర ఓటములను తిలకించాకా ఎన్నికల సమరాన్ని ఎదుర్కోవడంలోని మజాయే వేరు అన్నట్లుగా వైసీపీ పెద్దలకు అనిపిస్తోంది. అందుకే ఎడతెరిపి లేకుండా ఎన్నికలు పెట్టాలని కూడా డిసైడ్ అయిపోయారు. తిరుపతి తరువాత పరిషత్ ఎన్నికలు ఉంటాయి. ఆ తరువాత మిగిలిపోయిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు జరుగుతాయి. వీటిలో వైసీపీదే విజయం అని వేరేగా చెప్పాల్సిన అవసరంలేదు. దాంతో ఇలా దెబ్బలు తగులుతూ టీడీపీ మరింతంగా నైతికంగా కృంగిపోతుందని వైసీపీ వ్యూహకర్తల ఆలోచన.

తొడకొట్టి మరీ …

ఇక వైసీపీకి చెందిన బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అకాలమరణంతో మరో ఉప ఎన్నిక‌ ఆరు నెలల వ్యవధిలో వచ్చి పడనుంది. దాంతో పాటుగా వైసీపీకి మద్దతు ఇస్తున్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల నుంచి రాజీనామాలు కోరి ఎన్నికలు పెట్టించడానికి జగన్ ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. అలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను కూడా ఆమోదించి విశాఖ ఉత్తరంలో ఎన్నికలు పెట్టాలని అనుకుంటున్నారుట. వీటిలో కూడా అధికార పార్టీ విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారు. దాంతో అసెంబ్లీలో టీడీపీ బలం తగ్గిపోయి చంద్రబాబుకు విపక్ష హోదా కూడా పోవాలన్నది జగన్ సరికొత్త ఎత్తుగడ అంటున్నారు. మొత్తానికి టీడీపీకి ఏపీలో నిలువ నీడ లేకుండా చేయడంతో పాటు బాబుని శాసనసభలో ఒట్టి ఎమ్మెల్యేగా చూడాలన్నది జగన్ మార్క్ పాలిట్రిక్స్ లా ఉందిపుడు.

Tags:    

Similar News