జ‌గ‌న్ స‌ర్కార్ ను వారు నమ్మడం లేదా.. భారీ దెబ్బేనా..?

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారుకు తీవ్ర‌మైన ఎదురు దెబ్బ‌తగిలింది. రాష్ట్రంపై బహిరంగ మార్కెట్లో నమ్మకం సన్నగిల్లింది. ఇచ్చిన అప్పు సులభంగా చెల్లించగలదన్న భరోసా లేకుండా పోయింది. మధ్యవర్తిగా రిజర్వ్‌ [more]

;

Update: 2021-07-19 13:30 GMT

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారుకు తీవ్ర‌మైన ఎదురు దెబ్బ‌తగిలింది. రాష్ట్రంపై బహిరంగ మార్కెట్లో నమ్మకం సన్నగిల్లింది. ఇచ్చిన అప్పు సులభంగా చెల్లించగలదన్న భరోసా లేకుండా పోయింది. మధ్యవర్తిగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉన్నప్పటికీ ఏపీకి చెందిన సెక్యూరిటీ బాండ్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించలేదు. చివరికి… దేశంలో ఏ రాష్ట్రమూ చెల్లించనంత అధిక వడ్డీ ‘ఆఫర్‌’ చేసి, సెక్యూరిటీలు వేలం వేసి రూ.2,000 కోట్ల అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇందులో రూ.1000 కోట్లు 7.15 శాతానికి, మరో రూ.1000 కోట్లు 7.19 శాతం వడ్డీకి తెచ్చారు.

మిగిలిన రాష్ట్రాలకు…..

నిజానికి వేలంలో పాల్గొన్న ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఏపీకంటే తక్కువ వడ్డీరేటుకే అప్పు పుట్టింది. బిహార్‌, మిజోరం, అసోం లాంటి రాష్ట్రాలకు కూడా ఏపీ కంటే తక్కువ వడ్డీరేటుకే అప్పు దొరికింది. అసోం 6.33 శాతం, బిహార్‌కి 6.75 శాతం, మిజోరం 7.12 శాతం వడ్డీ ఆఫర్‌ చేసి అప్పు తెచ్చుకోగలిగాయి. ఏపీ రూ.2,000 కోట్లు అప్పు తెచ్చుకోగా… ఇందులో వెయ్యి కోట్ల రుణం చెల్లింపు కాలపరిమితి 17 ఏళ్లు. మరో రూ.1000 కోట్ల రుణం కాలపరిమితి 16 ఏళ్లుగా ఒప్పందం చేసుకున్నారు.

కాలపరిమితి కూడా….

వేలంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాలేవీ ఇంత భారీ స్థాయి కాల పరిమితి పెట్టుకోలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 13 వారాలు పూర్తయింది. ఈ 13 వారాల్లో రాష్ట్రం చేసిన అప్పు రూ.18,100కోట్లు. అంటే… సగటున వారానికి రూ.1392కోట్లు, నెలకు రూ.5,570 కోట్లు అప్పు చేశారు. ఆర్థిక శాఖ చేస్తున్న అప్పులు, ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌కు కలిపి సగటున నెలకు రూ.2916 కోట్లు అసలు, వడ్డీ రూపంలో తిరిగి చెల్లిస్తున్నారు. అంటే… సంవత్సరానికి రూ.35,000 కోట్లు!

వ్యవధి పెరిగే కొద్దీ…..

వచ్చే రెండేళ్లలో ఈ మొత్తం రూ.54 వేల కోట్లకు చేరుతుందని ఆర్థికశాఖ గతంలో అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుల చెల్లింపు కాలాన్ని కూడా పెంచుకోవాల్సి వస్తోంది. వ్యవధి పెరిగే కొద్దీ వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. అప్పుల భారం ఎక్కువ‌గా ఉండడంతో ఏపీ సెక్యూరిటీలు కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు పెద్దగా ముందుకు రావడం లేదు. దీంతో వడ్డీరేటు ఎక్కువ ఆఫర్‌ చేయక తప్పడంలేదు.

తాకట్టు పెట్టి…

మ‌రోవైపు, విశాఖలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 213 ఎకరాలు రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు బదలాయించి… అక్కడ నుంచి వాటిని బ్యాంకులకు తాకట్టు పెట్టి జూన్‌లో రూ.3,000కోట్లు అప్పు తెచ్చారు. అలాగే, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్రంలోని రోడ్లు భవనాల శాఖ ఆస్తులు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.1100కోట్లు అప్పు తీసుకొచ్చారు. మొత్తం రూ.4100కోట్లను జూన్‌లో ‘జగనన్న చేయూత’ పథకం కోసం వాడారు. దీంతో ప్రభుత్వోద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం డబ్బులు లేకుండా పోయాయి

Tags:    

Similar News