జగన్ నుంచి వస్తున్న సిగ్నల్స్ అవేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని జగన్ భావిస్తున్నారు. ఇందుకు పక్కగా లెక్కలు [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని జగన్ భావిస్తున్నారు. ఇందుకు పక్కగా లెక్కలు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని జగన్ భావిస్తున్నారు. ఇందుకు పక్కగా లెక్కలు వేసుకుని మరీ జగన్ ముందస్తు వ్యూహానికి తెరతీస్తారంటున్నారు. అందుకోసమే జగన్ హడావిడి చేస్తున్నారన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్. ఆంధప్రదేశ్ లో ఇప్పుడు జగన్ పార్టీ బలంగా ఉంది. ప్రతిపక్షాలు గత ఓటమి నుంచి కోలుకునే పరిస్థితి కన్పించడం లేదు. పొత్తుల ఖరారు ఇంకా కాలేదు. విపక్షాలు కూడా జనంలోకి రాక చాలాకాలమయింది. ఈ పరిస్థితుల్లో 2023లో ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందన్న దానిపై జగన్ ఇటీవల సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలిసింది.
అన్ని రకాలుగా లాభం….
ముందస్తు ఎన్నికలకు వెళితే జగన్ అనేక రకాలుగా లాభాలున్నాయి. ఒకటి ప్రభుత్వంపై ఇప్పుడు పెద్దగా వ్యతిరేకత లేకపోవడం. సంక్షేమ కార్యక్రమాలను వరసగా రెండేళ్ల పాటు అమలు చేయడం, తర్వాత అభివృద్ధి పనులపై దృష్టి పెట్టడం వంటి కారణాలు జగన్ పార్టీకి ప్లస్ అనే చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ గెలిచి మంచి ఊపు మీద ఉంది. దీనికి తోడు పేదలకు పక్కా ఇళ్ల పథకం కూడా పార్టీని విజయపథాన నడిపిస్తుందన్న అంచనాలో ఉన్నారు. మరో రెండేళ్ల పాటు సంక్షేమ పథకాలను ఆగకుండా చూసుకోగలిగితే ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాతో జగన్ ఉన్నారు.
మోదీపై వ్యతిరేకత…..
మరోవైపు పార్లమెంటు ఎన్నికలతో పాటు జరిగితే తనకు నష్టం జరిగే అవకాశముందని జగన్ భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న వ్యతిరేకత జగన్ పై కూడా పడే అవకాశముంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ బీజేపీతో సఖ్యతగానే ఉన్నారు. కానీ రాష్ట్రానికి సాధించుకుని వచ్చింది మాత్రం ఏమీ లేదు. దీంతో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒక్కసారి జరిగితే మోదీ ప్రభావం తనపై ఉంటుందని జగన్ భయపడుతున్నారు. అందుకే మోదీ వ్యతిరేకత తనపై పడకుండా 2023 లోనే ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. గతంలో కేసీఆర్ కూడా ఇదే వ్యూహంతో వెళ్లారు.
అందుకే ముందస్తు హడావిడి…..
అందుకే జగన్ జిల్లాల పర్యటనలను ప్రారంభించనున్నారు. విపక్షాలు కుదురుకోక ముందే ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్ ప్లాన్ గా ఉంది. తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చంద్రబాబు వస్తే నిలిపేస్తారన్న ప్రచారం చేస్తే తమదే గెలుపు ఖాయమని భావిస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలు ఎన్ని ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నది జగన్ భావన. అందుకే ముందుగానే ఎన్నికలకు వెళ్లి మరోసారి విజయం సాధించాలన్నది జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలకు కూడా సంకేతాలు వెళ్లినట్లు చెబుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లాయి. మొత్తం మీద సంకేతాలు చూస్తుంటే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకే సుముఖంగా ఉన్నట్లు కనపడుతుంది.