ఆ నిర్ణయం.. తృటిలో తప్పిపోయిన పదవులు..?

రాజకీయాల్లో ఇలాంటివే పలు చిత్రాలు జరుగుతాయి. జగన్ నామినేటెడ్ పోస్టులలో యాభై శాతం మహిళా రిజర్వేషన్ పెట్టారు. దీని వల్ల పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులకు [more]

Update: 2021-08-03 14:30 GMT

రాజకీయాల్లో ఇలాంటివే పలు చిత్రాలు జరుగుతాయి. జగన్ నామినేటెడ్ పోస్టులలో యాభై శాతం మహిళా రిజర్వేషన్ పెట్టారు. దీని వల్ల పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులకు తృటిలో కుర్చీ తప్పిపోయింది. అయితే జగన్ ఉదారంగా ఒక ఛాన్స్ ఇచ్చారు. మీ ఇంటికే పదవి అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. మహిళా కోటా అన్నారు కానీ అది ఎవరికో కాదు, మీ ఫ్యామిలీకే అంటూ చెప్పేశారు. అంటే ఆ నాయకుడి భార్య కానీ కుమార్తె కానీ, తల్లి కానీ ఎవరున్నా పదవి గ్యారంటీ అన్న సడలింపును వైసీపీ అధినాయకత్వం ఇచ్చేసింది.

చిక్కులు తెచ్చిన లెక్కలు…?

ఒక వైపు సామాజిక సమీకరణలు, మరో వైపు మహిళా రిజర్వేషన్లు, ఇలా నామినేటెడ్ పదవుల భర్తీలో వైసీపీ తీసుకొచ్చిన కండిషన్లు కొంతమంది నేతలకు శాపంగా మారాయి. అలాంటి వారిలో విశాఖ జిల్లాలోని ఇద్దరు నాయకులు కనిపిస్తారు. విశాఖ ఉత్తర నియోజకవరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత తైనాల విజయకుమార్ కి కీలకమైన పదవి ఇవ్వాలని అధినాయకత్వం భావించింది. విశాఖ కాకినాడ పెట్రో కారిడార్ చైర్మన్ పదవి అది. అయితే మహిళా కోటా కారణంగా ఆయన సతీమణికి ఇస్తామని చెప్పారు. అయితే విజయకుమార్ భార్యకు అనారోగ్యం కారణంగా బంగారం లాంటి పదవి చేజారిపోయింది. అంతే అది మరో సీనియర్ నేత చొక్కాకుల వెంకటరావు సతీమణి లక్ష్మికి చివరి క్షణంలో లభించింది. దాంతో చొక్కాకుల అనుచరులలో ఆనందం వెల్లివిరిస్తే తైనాల వర్గం పూర్తి నిరాశ చెందుతోంది.

వదిలేసుకున్నారుగా..?

ఇక విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవి అంటే ప్రతిష్టాత్మకమైనది. ఈ పదవిని సుదీర్ఘకాలం పాటు నిర్వహించిన ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కుమారుడు సుకుమార వర్మకు మూడవ సారి కూడా దక్కాల్సిందే. అయితే జగన్ నిర్ణయించిన మహిళా కోటాతో ఆయన అలా టాటా చెప్పాల్సి వచ్చింది. ఇక అధినాయకత్వం ఆయన సతీమణికి ఈ పదవిని ఇస్తామని ప్రతిపాదించింది. అయితే ఆమెకు రాజకీయాల పట్ల పెద్దగా ఇంటెరెస్ట్ లేకపోవడం వల్ల ఆ పదవి అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరదలు అనితను అనూహ్యంగా వరించింది. దాంతో కన్నబాబు రాజు వర్గం నిండా నిరాశలో మునిగిపోయింది.

ఇదే రూల్…

దీన్ని బట్టి తెలిసేది ఏంటి అంటే వైసీపీ నాయకుల ఫ్యామిలీలో అందరూ రాజకీయాలో చురుకుగా ఆరోగ్యంగా ఉండాలి. లేకపోతే పదవులు దక్కవంతే. ఇప్పటిదాకా రాజకీయాల్లో ఎవరు దూకుడుగా ఉంటారో వారికే పదవులు అన్నది విధానంగా ఉండేది. కానీ జగన్ నాయకత్వంలోని వైసీపీ మాత్రం కొత్త రూల్స్ పెట్టేసింది. మహిళా కోటా పేరిట కుటుంబంలో ఉన్న ఆడవారికి కూడా కుర్చీ వేసి కిరీటం పెడుతోంది. ఇది చాలా మందికి నచ్చకపోయినా కూడా పదవి తన ఇంటి గుమ్మంలోనే ఉండాలని తీసేసుకుంటున్నారు. మరి కొందరు మాత్రం ఇస్తే తమకే ఇవ్వాలని పేచీ పెడుతున్నారు. చివరికీ ఏదీ లేక చెడుతున్నారు. మరి జగన్ మార్క్ సామాజికన్యాయంలో అన్యాయం అవుతోంది నిజమైన నాయకులేనా అంటే సమాధానం ఆ పార్టీ పెద్దలే చెప్పాలేమో.

Tags:    

Similar News