ఆల్ ఈజ్ వెల్ అనుకోవాల్సిందేనా?

ప్రజాస్వామ్య దేశంలో న్యాయస్థానాల నిర్ణయమే ఫైనల్. తుది తీర్పునకు అందరూ లోబడి ఉండాల్సిందే. రాజధాని అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. [more]

Update: 2021-07-21 06:30 GMT

ప్రజాస్వామ్య దేశంలో న్యాయస్థానాల నిర్ణయమే ఫైనల్. తుది తీర్పునకు అందరూ లోబడి ఉండాల్సిందే. రాజధాని అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇప్పుడు రాజధాని అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదన్నది సుప్రీం తీర్పు. సుప్రీం కు లభించిన ఆధారాలు, సాక్ష్యాలు, డాక్యుమెంట్లను బట్టి ఆ తీర్పు ఇచ్చి ఉండవచ్చు. ఇందులో ఎవరినీ తప్పు పట్టాల్సిన పనిలేదు.

ఇన్ సైడర్ ట్రేడింగ్…?

కానీ రాజధాని భూముల్లో అవినీతి జరగలేదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని అనుకోవడం భ్రమే అవుతుంది. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ఏ ఒక్కరినీ కదిపినా రాజధాని అమరావతి భూములు కొందరికే పరిమితమయ్యాయన్న విషయం అందరికీ తెలిసిందే. గుంటూరు – విజయవాడ మధ్య అనేక ప్రాంతాలు న్నప్పటికీ మారు మూల ప్రాంతానికి తీసుకెళ్లి రాజధానిని నిర్ణయించారంటే అక్కడే పాలకుల ఆలోచన అర్థం అవుతుంది.

తాత్కాలిక విజయమేనా?

సుప్రీంకోర్టు తీర్పు వైసీపీకి బహిరంగంగా చెంపపెట్టు కావచ్చు. తెలుగుదేశం పార్టీది విజయం కావచ్చు. కానీ ఇది తాత్కాలికమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ఉంటాయి. ఫైనల్ గా ఎవరిది తప్పు అని నిర్ణయించాల్సింది ప్రజలే. ఇప్పటికే అనేక కేసుల్లో జగన్ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. కానీ వాటిలో సింహ భాగం కేసుల్లో ప్రజలు జగన్ వైపే ఉన్నారన్నది మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూసిన వారెవరికైనా అర్థమవుతుంది.

ప్రజలకు తెలియదా?

ఇప్పుడు రాజధాని అమరావతి విషయంలోనూ లొసుగులు లేవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పగానే వినడానికి ప్రజల చెవుల్లో పూవులు లేవు. అంత పిచ్చోళ్లు కారు. అక్కడ భూములు కొనుక్కోవడం చట్టబద్దమే అయినా ఎవరెవరు నేతలు, పాలకుల అనుయాయులు లబ్ది పొందారన్నది అందరికీ ఎరుకే. అమరావతి లో తమకు భూములు లేవని ఏ ఒక్క నేత చెప్పలేరు. న్యాయస్థానాలు ఎప్పుడు సాక్ష్యాధారాలకే ప్రాధాన్యత ఇచ్చి తీర్పులు చెబుతాయి. కాని కళ్లముందు జరిగిన దానిని ప్రజలు మర్చిపోరు. దీంతో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు రాజధాని విషయంలో తీర్పు చెప్పినా విపక్షాలకు తాత్కాలిక ఆనందమే. జగన్ మాత్రం ఏది జరిగినా మన మంచికేనని భావిస్తున్నారు. మరి జగన్ అంచనాయే కరెక్టయితే… ఈ తీర్పులు కూడా చంద్రబాబుకు చెడే చేస్తాయని చెప్పక తప్పదు. కేసుల నుంచి తప్పించుకోవచ్చేమో కాని, ప్రజాతీర్పు నుంచి తప్పించుకునేందుకు ఛాన్సేలేదు.

Tags:    

Similar News