విడిపోతే ఇద్దరికీ భారీ నష్టమే… ?

రాజకీయాలు గణిత శాస్త్రం లెక్కలు కాదు అంటారు. కానీ ఒక్కోసారి రెండు రెండూ కలిస్తే నాలుగు అని కూడా చెప్పాలి. అంటే అపుడు గణితపు లెక్కలు కరెక్ట్ [more]

Update: 2021-08-10 08:00 GMT

రాజకీయాలు గణిత శాస్త్రం లెక్కలు కాదు అంటారు. కానీ ఒక్కోసారి రెండు రెండూ కలిస్తే నాలుగు అని కూడా చెప్పాలి. అంటే అపుడు గణితపు లెక్కలు కరెక్ట్ గానే సరిపోతాయి అన్న మాట. ఏపీలో జగన్, ఢిల్లీలో బీజేపీల మధ్య సంబంధాలు కూడా అలాంటివే. ఈ ఇద్దరూ కలసి ఉంటే ఎవరి స్థాయిలలో వారికి లాభమే. విడిపోతే మాత్రం భారీ నష్టం. మరి రాజకీయ తెలివిడితో అటూ ఇటూ ఆలోచన చేసేవారు ఉన్నారు. దాంతోనే విభేదాలు కొన్ని వున్నా సరే ఈ బంధం కొనసాగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు.

జగన్ ఉండాల్సిందే….

బీజేపీకి ఇపుడు బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయింది. అది ఇంకా పెరిగేదే తప్ప ఎక్కడా తగ్గే సూచనలు లేవు. అసలు బండారం 2022 ఎన్నికల తరువాత, ఆ మీదట జరిగే రాష్ట్రపతి ఎన్నికల తరువాత బయటపడుతుంది. బీజేపీ అంచనాలు తల్లకిందులు అయితే 2022 రెండవ అర్ధభాగం నుంచి పెను సవాళ్ళు ఎదురవడం ఖాయం. అపుడు చేతిలో రెండేళ్ల అధికారం ఉన్నా కూడా బీజేపీ చేతులూ కాళ్ళూ పూర్తిగా కట్టేసినట్లుగానే ఉంటుంది. ఇవన్నీ చాణక్య రాజకీయం తెలిసిన బీజేపీ పెద్దలకు అవగాహనలో లేవని ఎవరూ అనుకోరు. అందువల్ల ఇంతటి విపత్కర పరిస్థితుల్లో జగన్ వంటి నమ్మకమైన మిత్రుడు బీజేపీకి ఉండాల్సిందే అని కమలనాధులు గట్టిగా భావిస్తున్నారుట.

ఇక్కడా సేమ్ సీన్…

ఇక జగన్ బీజేపీకి తలాఖ్ అంటే వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే చాలానే అన్న జవాబు వస్తుంది. జగన్ మీద ఉన్న సీబీఐ కేసుల విచారణ ఇపుడు చాలా జోరు మీద సాగుతోంది. ఇవన్నీ ఒక కొలిక్కి రావడానికి వచ్చే ఏడాది పడుతుంది. అంటే జగన్ కి కూడా 2022 ఒక విధంగా పెను సవాళ్ళను విసిరే ఏడాదిగానే చెప్పుకోవాలి. అక్రమాస్తుల కేసులో తీర్పు ఎలా ఉంటుందో తెలియదు. అప్పటికి ఇంకా రెండేళ్ల పాలన ఆయన చేతిలో ఉంటుంది. అందువల్ల జగన్ ఇపుడు కీలకమైన దశలో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆయనకు బీజేపీ అండదండలు పూర్తిగా అవసరం అని భావిస్తున్నారు. జగన్ కి బీజేపీకి కోపం ఉంది కానీ అది బంధం తెంచుకునేంత వరకూ దారితీయకపోవచ్చు అని అందుకే అంటున్నారు.

తెల్ల జెండావేనా …?

ఇపుడున్న పరిస్థితులు విశ్లేషించుకుంటే ఎవరి పరిధిలో వారు ఉండాల్సిందే. పరిస్థితులు బలీయమైనవి కాబట్టే జగన్ తో బీజేపీ బంధాన్ని గట్టిపరుస్తాయని అంటున్నారు. పార్లమెంట్ లో జగన్ ఎంపీల చేత నిరసన కార్యక్రమాలు జరిపించడం వరకూ బాగానే ఉంది. అంతకు మించి ఆయన కఠిన నిర్ణయం వైపుగా అడుగులు వేయరు అంటున్నారు. అంటే బీజేపీకి రాజ్యసభలో బిల్లులకు మద్దతు ఇవ్వకుండా ఉండరు అంటున్నారు. ఇక బీజేపీ కూడా మిగిలిన ఎంపీల మాదిరిగా వైసీపీ వారి మీద తీవ్ర చర్యలకు ఉపక్రమించదు అని కూడా చెబుతున్నారు. మరో వైపు చూస్తే వయా మీడియాగా రెండు పార్టీల మధ్య అవసరమైన విషయాల్లో రాజీ కుదుర్చుకుని ముందుకు సాఫీగా సాగుతారు అంటున్నారు. మొత్తానికి జగన్ అవసరం బీజేపీకి, బీజేపీ అవసరం జగన్ కి ఉన్నాయన్నది కచ్చితమైన రాజకీయ విస్లేషణ.

Tags:    

Similar News