ఇప్పటికి తెలిసి వచ్చిందట.. కానీ ఈలోగానే?
ఏపీలో ఇపుడు రాజకీయం ఎలా ఉన్నా ఆర్ధికం మాత్రం దెబ్బ తింది. ఖజానా ఖాళీగా వెక్కిరిస్తోంది. సగం పాలన పూర్తి అయ్యాక ముఖ్యమంత్రి జగన్ కి ఈ [more]
;
ఏపీలో ఇపుడు రాజకీయం ఎలా ఉన్నా ఆర్ధికం మాత్రం దెబ్బ తింది. ఖజానా ఖాళీగా వెక్కిరిస్తోంది. సగం పాలన పూర్తి అయ్యాక ముఖ్యమంత్రి జగన్ కి ఈ [more]
ఏపీలో ఇపుడు రాజకీయం ఎలా ఉన్నా ఆర్ధికం మాత్రం దెబ్బ తింది. ఖజానా ఖాళీగా వెక్కిరిస్తోంది. సగం పాలన పూర్తి అయ్యాక ముఖ్యమంత్రి జగన్ కి ఈ కొరత గుర్తుకు వచ్చింది. అది కూడా కేంద్రం ఎక్కడికక్కడ బిగించేశాక అప్పు పైసా కూడా ఇక పుట్టదు అని తేలిపోయాక జగన్ లో ఒక్కసారిగా వేడి పెరిగింది. అందుకే ఆయన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఒక కీలక ఆదేశం వారికిచ్చారు. ఏపీలో డబ్బులు ఎక్కడ ఏ ఏ శాఖలలో పుడతాయో అర్జంటుగా వెతకండి అంటూ హుకుం జారీ చేశారు. ఇందుకోసం కొత్త ఆలోచనలు చేయాలని కూడా జగన్ కోరారు. వినూత్న ఆర్ధిక సంస్కరణలు కూడా కనిపెట్టాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఇలా చేయాలట…
ఏపీలో ప్రతీ వారం కలెక్టర్లు ఇతర ముఖ్య శాఖల కీలక అధికారులు సమావేశమై ఆర్ధిక వనరులను ఎలా పెంచాలో ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. అంతే కాదు, అదాయం వచ్చే శాఖల విషయంలో ఇంకాస్త గట్టి పట్టు పట్టాలని, వాటిలో హెచ్చుగా డబ్బులు వచ్చేలా చూడాలని కూడా జగన్ కోరారు. స్టాంప్స్ డ్యూటీస్, రిజిస్ట్రేషన్ వంటి శాఖలు ఆదాయాన్ని విపరీతంగా పెంచాలని కూడా జగన్ గట్టిగానే సూచించారు. ఎక్కడా తగ్గవద్దు, ఎలాగైనా ఖజానాకు ఆదాయం తీసుకురావడమే టార్గెట్ కావాలని కూడా జగన్ స్పష్టం చేశారు.
నిద్రాణంలోనే ….
ఇంతకాలం అప్పుచేసి పప్పు కూడుగా పాలన సాగింది. జగన్ సైతం ఏపీలో ఆదాయ మార్గాలు ఏంటి, కొత్తగా పైసా ఎలా పుట్టించవచ్చు అన్నది ఏనాడూ ఇలా సమీక్ష పెట్టి అధికారులకు సూచించలేదు. ఆ దిశగా ఆలోచించలేదు కూడా. దాంతో అధికారులు కూడా అన్నీ గాలికి వదిలేశారు. నిజానికి వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్, స్టాంప్ డ్యూటీస్, రిజిస్ట్రేషన్ వంటి శాఖల ద్వారా ఆదాయం ఏ రాష్ట్రానికి అయినా వస్తుంది. కానీ అనుభవ లేమి కారణంగానే వైసీపీ పాలకులు వీటి వైపు చూడలేదు. అప్పు ఎలా పుట్టించాలి అన్న దాని మీదనే దృష్టి పెట్టారు తప్ప రెవిన్యూ పెంచుకునే మార్గాల మీద శోధన చేయలేకపోయారు. దీంతో అధికారులు బే ఫికర్ అన్నట్లుగా తయారయ్యారు.
లూటీ అవుతోందిగా…?
ఏపీలో ఖజానాకు ఆదాయం లేదు కానీ మరో వైపు చూస్తే అక్రమ మైనింగ్ ద్వారా వేల కోట్లు పక్క దారి పడుతున్నాయి. అధికారులు సైతం కొందరు కుమ్మక్కు అయి ఇలా విలువైన సహజ సంపదను అక్రమార్కుల చేతులలో పెట్టేస్తున్నారు. ఇక రిజిస్ట్రేషన్ విభాగంలో నకిలీ చలానా కుంభకోణం తాజాగా వెలుగు చూసిన సంగతి విదితమే. ఇలా ఎన్నాళ్ళుగా సాగుతుందో ఎవరికీ తెలియదు. ఎక్సైజ్ లో కూడా సొమ్ము ఖజానాకు చేరకుండా నకిలీ బాగోతాలు చాలానే జరుగుతున్నాయి. మరి వచ్చే ఆదాయాన్ని దక్కించుకోవాలంటే పాలకులు అధికారుల వెనక నిలబడి అదిలించాలి, బెదిరించాలి. కానీ ఇన్నాళ్ళ దాకా అలాంటి సీన్ లేదు. ఇపుడు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఆదాయం పెంచండి అంటూ హుకుం జారీ చేయడంతో సొంత లాభం కొంత మానుకుని అయినా కొందరు అధికారులు అయినా చురుకుగా ఉంటే ఏపీ ఖజానా నిండడం ఖాయం. అంతే కాదు సీఎం చెప్పినట్లుగా కొత్త మార్గాలను చూస్తే పైసా మళ్ళీ కళకళలాడుతుంది.