అమరావతికి అండగా ఉండేందుకేనా?

జగన్ వ్యూహం మారుస్తున్నారు. ఆంధ్రా మొత్తం మీద పూర్తి ఆధిక్యతతో గెలిచి ముఖ్యమంత్రి అయిన జగన్ కి ఆరు మాసాలు తిరక్కముందే తాను పాలిస్తున్న గడ్డ అమరావతి [more]

Update: 2020-06-26 12:30 GMT

జగన్ వ్యూహం మారుస్తున్నారు. ఆంధ్రా మొత్తం మీద పూర్తి ఆధిక్యతతో గెలిచి ముఖ్యమంత్రి అయిన జగన్ కి ఆరు మాసాలు తిరక్కముందే తాను పాలిస్తున్న గడ్డ అమరావతి దూరం అయింది. దానికి కారణం జగన్ దూకుడుగా తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయమే. ఈ నిర్ణయంవల్ల అమరావతిలో అసలైన ప్రజలకు, రైతులకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా రాజధాని చుట్టూ ముసురుకున్న ల్యాండ్ మాఫియా కారణంగా కృత్రిమ ఉద్యమం పుట్టింది. దాంతో కొన్నాళ్ల పాటు జగన్ సర్కార్ కి ఆ తలనొప్పి ఎక్కువైంది. సచివాలయానికి వెళ్లాలన్నా కూడా పోలీస్ ప్రొటెక్షన్ అవసరం అయింది. ఈ దశలో కరోనా మహమ్మారి వచ్చి ఆదుకున్నట్లైంది. అమరావతి ఉద్యమం కోసం మేమున్నామని బీరాలు పలికిన వారు, రైతులను రోడ్డున పడేసి వెనక నుండి కధ నడిపించిన వారు అంతా కూడా ఒక్కసారిగా మాయమయ్యారు. దాంతో రైతులు ఒంటరి వారు అయ్యారు.

ఆదరణ ఉందిగా…

ఇక మరో వైపు చూసుకుంటే జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ వస్తున్నారు. ఆ సంక్షేమ ఫలాలను అమరావతి రాజధాని ప్రాంతవాసులు అనుభవిస్తున్నారు. దాంతో తాజాగా జరిగిన ఓ సర్వేలో జగన్ అమరావతి రాజధాని ప్రాంతంలోనూ మద్దతు లభించింది. జగన్ పాలన బాగుంది అని అమరావతి జనం ఓటేయడంతో వైసీపీ సర్కార్ లో ఎక్కడలేని ధైర్యం, నైతిక విశ్వాసం లభించినట్లైంది.

వారిని కలుపుకుని…..

ఇక జగన్ సర్కార్ మూడు రాజధానుల విషయంలో ఇకమీదట ఘర్షణలకు పోకుండా అమరావతి ప్రాంతవాసులను కూడా కలుపుని ముందుకువెళ్ళాలనుకుంటోందని తెలుస్తోంది. దాంతోనే వ్యూహాత్మకంగా మంత్రి బొత్స సత్యనారాయణను రాజధాని ప్రాంతానికి జగన్ పంపించారని అంటున్నారు. అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. వాటి పరిపూర్తికి కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే విధంగా అమరావతి రైతులతో, బాధిత ప్రజానీకంతో కూడా మంత్రి మాట్లాడారు. ఇదివరకు మాదిరిగా అమరావతికి మంత్రి పర్యటనకు వస్తే ఎటువంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకపోవడం విశేషం. అంటే రాజధాని ఉద్యమాన్ని నడిపిస్తున్న వారంతా తప్పుకోవడంతో అక్కడ మళ్లీ సాధారణమైన పరిస్థితులు వచ్చాయని అంటున్నారు.

ప్రగతిపధమే …

ఇక అమరావతివాసులు ఏ రకమైన కలవరం చెందకుండా వారికి అభివృధ్ధిని చూపించిన మీదటనే కీలక నిర్ణయాలు తీసుకోవాలని జగన్ సర్కార్ ఆలోచిస్తున్నట్లుగా ఉంది. పద్దెనిమిది వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో నిర్మాణం పనులు అమరావతిలో ఉన్నాయి. వాటిని దశలవారీగా పూర్తి చేయడానికి జగన్ సర్కార్ నడుం బిగించింది. అదే విధంగా అమరావతిని కూడా పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ వేసి అభివృధ్ధి చేస్తామని, ఈ విషయంలో వేరే ఆలోచనలు పెట్టుకోవద్దని కూడా జగన్ సర్కార్ భరోసా ఇస్తోంది. ఇక రైతులకు రెండవ విడత కౌలు కింద నష్టపరిహారం నిధులను జగన్ సర్కార్ విడుదల చేసింది. మొత్తానికి కరోనా పుణ్యమాని ఘర్షణ వాతావరణం మబ్బుల్లా మాయమవగా ప్రభుత్వం, రాజధాని అమరావతి ప్రాంత ప్రజలు ఒకరిని ఒకరు అర్ధం చేసుకునేందుకు వీలు చిక్కిందని అంటున్నారు. చూడాలి అమరావతితో జగన్ అనుబంధం మరెంతగా పెరుగుతుందో,.

Tags:    

Similar News