గాడిన పెడుతున్నారా

యంత్రాంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ విధానాలకు అనుగుణంగా కార్యాచరణకు కదులుతోంది. కేంద్రం నుంచి ఆశించినంత సహకారం అందడం లేదు. పాత ప్రభుత్వ తప్పిదాలను [more]

;

Update: 2019-08-15 15:30 GMT

యంత్రాంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ విధానాలకు అనుగుణంగా కార్యాచరణకు కదులుతోంది. కేంద్రం నుంచి ఆశించినంత సహకారం అందడం లేదు. పాత ప్రభుత్వ తప్పిదాలను సెట్ రైట్ చేస్తామంటూ చేపట్టిన పనులకు కేంద్రం మోకాలడ్డుతున్నట్లే కనిపిస్తోంది. పోలవరం రివర్స్ టెండరింగ్ కు ఖర్చు పెరిగితే మాకు సంబంధం లేదంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ తేల్చి చెప్పేసింది. అంతేకాకుండా పాత సంస్థ బాగా చేసిందంటూ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. ఇసుక కొరత, నిధుల సమస్య, ఆరోగ్యశ్రీకి నూతన రూపు ఇలా అనేక అంశాలు ప్రభుత్వం ముందు సవాళ్లుగా నిలుస్తున్నాయి. అదును దొరికింది కదా? అని కేంద్ర అధికారపార్టీ బీజేపీ ఆందోళనలకు సిద్దమవుతోంది. అసలేం జరుగుతోంది? ప్రజల్లో సర్కారు ప్రతిష్ఠను ముందుకు తీసుకెళ్లడమెలా? అన్నది ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి పెద్ద ప్రశ్నే. అక్టోబర్ లో రైతు భరోసా, డిసెంబర్ నుంచి కుటుంబానికో ఆరోగ్య కార్డు అంటూ రాష్ట్ర సర్కారు కార్యాచరణను ప్రకటించింది. అన్నిటికీ మించి సీఎం సెప్టెంబర్ నుంచి జిల్లా పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి అసెస్మెంట్ టూర్ గా దీనిని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పనితీరును అంచనా వేసుకునే పర్యటనగా చూడాలి.

ఇసుకపై రియలైజేషన్…

జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో ముడిపడిన అతి ప్రధాన సమస్యగా రూపుదాల్చింది ఇసుక. గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంతో బొక్కబోర్లా పడింది. అధికారపార్టీ నేతలకు అయాచితవరంగా, అవినీతి మార్గంగా ఇసుక పథకం పరిణమించింది. ఫలితంగా సర్కారు తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. టీడీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఇసుక దోపిడీ కూడా ఒకటిగా నిలిచింది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇసుక విధానాన్ని రద్దు చేశారు జగన్ . దీంతో ఒక్కసారిగా భవన నిర్మాణ రంగం సంక్షోభం లో పడింది. సొంత కట్టడం దారులు సంకటస్థితిని ఎదుర్కొంటున్నారు. కూలీలకూ ఉపాధి లోపించింది. దీనికి సరైన పరిష్కారం వెదకడంలో యంత్రాంగం విఫలమైందనే చెప్పాలి. దీని ప్రభావం ముఖ్యమంత్రిపైనే పడుతోంది. రివర్స్ టెండరింగ్ ఇతర విషయాలు నేరుగా ప్రజలకు సంబంధించినవి కాదు. అందువల్ల వాటికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, కేంద్రంతో నెలకొన్న వైరుద్ధ్యాలపై సర్కారుపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. కానీ ఇసుక పై మాత్రం పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇసుక రీచ్ ల సంఖ్య పెంచాలని సీఎం జగన్ స్వయంగా ఆదేశాలివ్వాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

పాదయాత్ర నేర్పిన పాఠం…

చంద్రబాబు నాయుడితో పోలిస్తే జగన్ మోహన్ రెడ్డి గంటల కొద్దీ సమీక్షలకు సమయం వెచ్చించడం లేదు. దీనివల్ల అధికారులకు కొంత సమయం చిక్కుతోంది. అదే సమయంలో అలసత్వం నెలకొనే ప్రమాదం కూడా ఉంది. నిత్యం పర్యటనలతో బిజీగా ఉండటం చంద్రబాబు నాయుడు అలవాటు చేసిన పరిపాలన విధానం. గడచిన రెండున్నర నెలలుగా వివిధ శాఖల పనితీరును రాజధాని కేంద్రంగా అధ్యయనం చేసిన జగన్ ఇకపై జిల్లాల వారీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో తెలుసుకోవడం అధినేతకు చాలా ముఖ్యం. పాదయాత్ర లో అనేక అంశాలను ఫీల్డు లెవెల్ లో తెలుసుకున్న తర్వాతనే వైసీపీ మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. ప్రభుత్వం చెబుతున్న విధానానికి ఫీల్డులో అమలవుతున్నతీరుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అది సకాలంలో కనిపెట్టగలిగినప్పుడే దిద్దుబాటు చర్యలు సాధ్యమవుతాయి. ఈ అంశంలోనే టీడీపీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈవిషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. జిల్లా పర్యటనలకు షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన వాటిలో ఆర్టీజీఎస్ వ్యవస్థను ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై సంతృప్త స్థాయి ఎనభై నుంచి తొంభై శాతం ఉందంటూ నివేదికలు ఇస్తుండేది. వాటిని చూసుకుని ప్రభుత్వాధినేతలు మురిసిపోయారు. ఈ సాంకేతిక లెక్కలు కొంప ముంచేశాయి. ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం. కొన్ని ప్రభుత్వ వ్యవస్థలు రాజకీయ కార్యనిర్వాహకవర్గానికి సరైన సమాచారం అందకుండా పక్కదారి పట్టించడం , పబ్బం గడుపుకోవడం సాగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో వివిధ వర్గాల నుంచి అందుతున్న స్వీయ నివేదికలపైనే ఆధారపడుతున్నారు. అందులో భాగంగానే సెల్ఫ్ అసెస్ మెంట్ కు పూనుకుంటున్నట్టుగా చెప్పాలి.

కేంద్రంతో సయోధ్యకు…

కొన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రాలు కొంత మొత్తం అదనంగా చేర్చి వాటిని సొంత పథకాలుగా నడుపుతుంటాయి. పేర్లను సైతం చేరుస్తుంటాయి. అయితే కేంద్రం వీటిని పెద్దగా పట్టించుకోదు. ఇది సాధారణంగా సాగే తంతు. కేంద్రప్రభుత్వంతో దూరం పెరుగుతోందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రధానిని రైతుభరోసా కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ ఆందోళనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రధాని ద్వారా రాష్ట్రప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం ను ప్రారంభింపచేయడం గమనించదగిన పరిణామంగానే చెప్పుకోవాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి కూడా ఇందులో భాగమే. తద్వారా రెండు విధాలుగా రాష్ట్రప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుంది. ఒకటి బీజేపీ నేతల నుంచి విమర్శలు రావు. ప్రధాని నుంచి నేరుగానే సర్టిఫికెట్ పొందినట్లవుతుంది. దూరం పెరిగిందంటూ పెద్ద ఎత్తున సాగుతున్న ప్రచారానికి తెర వేసినట్లవుతుంది. రాజకీయంగా, పాలన పరంగా, క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు జగన్ రంగంలోకి దిగుతున్నట్లుగా తాజా చర్యలను చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షాలు రోడ్డెక్కకుండా ముఖ్యమంత్రే ప్రజల్లో ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం దానంతటదే దొరుకుతుంది. తక్షణ చర్యలకు వీలవుతుంది. యంత్రాంగం బాధ్యతగా స్పందిస్తుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News