బీజేపీని చూసి బెదిరిపోతున్నారుగా?

బీజేపీ అంటే ఏంటో ఆలస్యంగా కేసీఆర్ కి, జగన్ కి తెలిసివస్తోంది అంటున్నారు. అందుకే అర్జంటుగా బీజేపీ ప్రధమ శత్రువు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని [more]

Update: 2021-01-20 02:00 GMT

బీజేపీ అంటే ఏంటో ఆలస్యంగా కేసీఆర్ కి, జగన్ కి తెలిసివస్తోంది అంటున్నారు. అందుకే అర్జంటుగా బీజేపీ ప్రధమ శత్రువు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని తమ వద్దకు రప్పించుకుని మరీ తాజాగా మంతనాలు సాగించిన వైనం వెలుగు చూస్తోంది. జగన్ కి ఎటూ ప్రశాంత్ కిషోర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలవడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కూడా అతి ముఖ్య కారణమని అంతా ఒప్పుకుంటారు. ఇరవై నెలల పాలన తరువాత జగన్ ఇపుడు ఒక్కసారిగా ఇరుకున పడ్డారు. దాంతో మళ్ళీ పీకే తో భేటీ వేశారని అంటున్నారు.

పాలనలో వ్యూహాలు…

నిజానికి ఎన్నికల విషయంలో జనాలను ఎటు తిప్పాలి. ఎలా అకట్టుకోవాలి అన్న దాని మీద వ్యూహాలు ఉంటాయి కానీ దైనందిన పాలన విషయంలో వ్యూహాలు ఉంటాయా అన్నది ఆలోచించాల్సిందే. పీకేకు తెలిసింది జనాభిప్రాయాన్ని ఒడిసిపట్టడం, వారికేమికావాలో తెలుసుకుని అలా తానున్న పార్టీని తీర్చిదిద్దడం. జగన్ చూస్తే పాలనాపరమైన అంశాల్లో పీకే సలహాలు కోరారని అంటున్నారు. విగ్రహాల విద్వంసం విషయంలో వైసీపీ సర్కార్ అడ్డంగా బుక్ అయింది. ఇది దావానలంగా హిందూ మతంలో వ్యాపించినట్లైతే జగన్ సర్కార్ బదనాం కావడం ఖయం. దాంతో దీని నుంచి బయటపడే సలహాలు జగన్ పీకే నుంచి కోరారని అంటున్నారు.

వరస ఎన్నికలతో…..?

ఇక ఏపీలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికతో మొదలుపెడితే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జమిలి ఎన్నికలు జరిగితే మరో మారు పీకే అవసరం తప్పనిసరిగా ఉంటుంది. దాంతో మళ్ళీ పీకేను రప్పించుకుని మరీ జగన్ మంతనాలు జరిపారని అంటున్నారు. తిరుపతిలో గెలుపునకు ఢోకా లేకపోయినా మెజారిటీ విషయంలోనే వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. దాన్ని ఎలా రాబట్టాలి అన్నది కూడా పీకే టీమ్ సలహాలు ఇవ్వాలని జగన్ కోరారట. ఇక బీజేపీ హిందూత్వకు విరుగుడు మీద కూడా పీకే స్టడీ చేసి వ్యూహం రూపొందిస్తారని అంటున్నారు. అంతే కాదు దేశంలో బీజేపీ వేగంగా దూసుకువస్తోంది. ప్రాంతీయ పార్టీల మీద కరకు పాదాలను మోపుతోంది. దాని బారి నుంచి రక్షించుకునే వ్యూహాలను కూడా పీకే రెండు తెలుగు రాష్ట్రాల సారధులకు అందించారని అంటున్నారు.

అది ఆసక్తికరమే….?

ప్రశాంత్ కిషోర్ తాజాగా జగన్ తో భేటీ వేశారు. ఆ వెంటనే తెలంగాణా సర్కార్ భావి వారసుడు కేటీయార్ తోనూ మంతనాలు జరిపారు. ఈ రెండు చోట్లా ఇద్దరు నాయకులూ వెలిబుచ్చిన సందేహాలు ఒక్కటే అంటున్నారు. బీజేపీ నుంచి ఎలా ఎదుర్కొని ముందుకుసాగడం అన్నదే. ఇక పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ తో అక్కడ మమత గెలుపు అవకాశాలను కూడా రెండు రాష్ట్రాల నాయకులు వాకబు చేశారని అంటున్నారు. ప్రాంతీయ పార్టీలలో అతి పెద్ద బలమైన నేత మమతనే బీజేపీ ఓడిస్తే ఇక తెలుగు రాష్ట్రాలకు కమలం ముప్పు తప్పదు అన్నది ఒక అంచనా. మొత్తానికి కాషాయం పార్టీకి ఆగర్భ శత్రువుగా ఉన్న పీకేతో తెలుగు రాష్ట్రాల అధినేతలు జగన్, కేటీఆర్ ఒకే సమయంలో సమావేశం కావడం రాజకీయంగా కాక పుట్టిస్తోంది అంటున్నారు. చూడాలి మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయో.

Tags:    

Similar News