జగన్ బీజేపీకి ఎందుకు దూరమవ్వాలి? ఒక్క రీజన్ చెప్పండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీజేపీని పన్నెత్తు మాట అనడం లేదు. అలాగే బీజేపీతో మిత్రత్వం నెరపడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ విమర్శలు ఇటీవల కాలంలో జగన్ [more]

Update: 2021-03-02 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీజేపీని పన్నెత్తు మాట అనడం లేదు. అలాగే బీజేపీతో మిత్రత్వం నెరపడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ విమర్శలు ఇటీవల కాలంలో జగన్ పై వస్తున్నాయి. దాదాపు ఇరవై నెలలుగా జగన్ కేంద్ర ప్రభుత్వం విషయంలో వేసిన అడుగులు అవి నిజమేనని చెబుతాయి. బీజేపీ ఏపీకి ఏ మాత్రం సాయం చేయకపోయినా, ఉన్న ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరించడానికి సిద్ధమవుతున్నా జగన్ యుద్ధం ప్రకటించడం లేదంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

జగన్ కోణంలో ఆలోచిస్తే…..

కానీ జగన్ కోణంలో ఆలోచిస్తే ఇప్పటికిప్పుడు బీజేపీతో గొడవ ఎందుకు పెట్టుకోవాలి? ఘర్షణకు దిగితే రాష్ట్రానికి అదనంగా ఒరిగే ప్రయోజనం ఏంటి? తాను మరో మూడేళ్ల పాటు పదవిలో ఉంటారు. కేంద్రంలోనూ బీజేపీయే అధికారంలో ఉంటుంది. చంద్రబాబు మాదిరి గొడవకు దిగి అసలుకే ముప్పు తెచ్చుకోవడం ఎందుకు? అన్న ప్రశ్నలు సహజంగా తలెత్తుతాయి. వైసీపీ నేతలు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారు. బీజేపీతో గొడవకు దిగి సాధించేదేమీ ఉండదన్నది అందరికీ తెలిసిందే.

తెగదెంపులు చేసుకుంటే….?

కాకుంటే జగన్ ను బీజేపీకి టార్గెట్ చేయాలన్నది కొందరి వ్యూహం. అందుకే కేసుల కోసం రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెడుతున్నారని పదే పదే విమర్శలు చేస్తున్నారు. అయినా జగన్ మాత్రం తాను అనుకున్న దారిలోనే వెళుతున్నారు. ఇక బీజేపీతో తెగదెంపులు చేసుకుని జగన్ ఎవరితో సయోధ్యతతో ఉండాలి. కాంగ్రెస్ తో జట్టు కట్టే ప్రశ్నే ఉండదు. తనపై అక్రమ కేసులు బనాయించి, 16 నెలల పాటు జైలులో ఉంచిన కాంగ్రెస్ తో జగన్ ఎందుకు జట్టు కట్టాలి?

కాంగ్రెస్ తో అంటకాగాలా?

అంతేకాకుండా రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ తో జత కడితే జగన్ కు మైనస్ అవుతుంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకునంతా తనవైపునకు తిప్పుకుని మళ్లీ దాంతో జత కడితే ప్రజలు తిరస్కరిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ తో జట్టుకట్టి ఏపీలో చంద్రబాబు దారుణమైన దెబ్బతిన్న విషయాన్ని ఎవరైనా మరచిపోగలరా? ఇక బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరంగా ఉండాలనుకున్నా థర్డ్ ఫ్రంట్ అంటూ ఏమీలేదు. సో.. జగన్ ఇప్పుడు.. ఎప్పుడూ బీజేపీతోనే సయోధ్యగా ఉంటారన్నది వాస్తవం. వారికి అవసరమైనప్పుడు మద్దతిస్తూనే ఉంటారు. సామరస్యంగానే రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవాలన్నది జగన్ ఆలోచన అని పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News