జగన్ గురి వాటిపైనే…? అక్కడ వారికి ఎమ్మెల్సీ పదవి?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాత్మకంగానే వెళుతున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి బలమైన స్థానాల్లో ఇప్పటి నుంచే బలమైన [more]

Update: 2021-03-18 14:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాత్మకంగానే వెళుతున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి బలమైన స్థానాల్లో ఇప్పటి నుంచే బలమైన అభ్యర్థులను తయారు చేసే పనిలో జగన్ పడ్డారు. అందుకు స్పష్టమైన సంకేతాలు టీడీపీకి ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కీలక స్థానాలను కూడా కైవసం చేసుకునేందుకు జగన్ ముందునుంచే ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు.

మూడేళ్ల ముందు నుంచే…?

తెలుగుదేశం అగ్రనేతలు ఉండే స్థానాల్లో నేతలను అన్ని రకాలుగా బలంగా తీర్చిదిద్దేందుకు మూడేళ్ల ముందునుంచే జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గలో బాలకృష్ణ బలంగా ఉన్నారు. వరసగెలుపులతో ఊపు మీదున్నారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణను కట్టడి చేయడానికి ఇక్బాల్ ను ఇన్ ఛార్జిగా నియమించారు. ఆయనకు మరోసారి శాసనమండలి సభ్యత్వాన్ని జగన్ రెన్యువల్ చేశారు కూడా.

అదే తరహా వ్యూహం….

ఇక తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీల ఎంపికలో కూడా జగన్ ఇదేరకమైన సూత్రాన్ని పాటించినట్లు తెలుస్తోంది. టెక్కలిలో అప్రహతంగా కొనసాగుతున్న అచ్చెన్నాయుడు జైత్రయాత్రకు బ్రేకులు వేయాలని జగన్ డిసైడ్ అయినట్లుంది. అందుకే టెక్కలి వైసీీపీ ఇన్ ఛార్జి దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో ఆయన నియోజకవర్గంలో తన దైన వర్గాన్ని రూపొందించుకోవడంలో మరింత బలపడే అవకాశముంది.

రానున్న రోజుల్లో….

ఇక మరికొన్ని స్థానాల్లో ఉన్న వైసీపీ ఇన్ ఛార్జులకు కూడా జగన్ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే అవకాశముందంటున్నారు. గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహించే అద్దంకి, చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం, పెద్దాపురం, రాజమండ్రి రూరల్ ఇలా కొన్ని ముఖ్యమైన స్థానాల్లో పార్టీ ఇన్ ఛార్జులకు ఎమ్మెల్సీ పదవులు జగన్ ఇచ్చే అవకాశముంది. రానున్న రోజుల్లో 18 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కానుండటంతో ఈ స్థానాల్లో వైసీపీ ఇన్ ఛార్జులకు ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశముందని పార్టీ లో గట్టిగా టాక్ వినిపిస్తుంది.

Tags:    

Similar News