చెప్పాడంటే… చేస్తాడంతే…. అంతా ఒట్టిదేనా?

ఏపీ అధికార పార్టీని గ‌మ‌నిస్తే.. పార్టీ అధినేత జ‌గ‌న్‌.. ఒక నినాదాన్ని ప్రజ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లారు. అదే.. మాట త‌ప్పం.. మ‌డ‌మ తిప్పం. అదేవిధంగా `విశ్వస‌నీయ‌త‌-విలువ‌లు ఉన్న [more]

Update: 2021-04-21 08:00 GMT

ఏపీ అధికార పార్టీని గ‌మ‌నిస్తే.. పార్టీ అధినేత జ‌గ‌న్‌.. ఒక నినాదాన్ని ప్రజ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లారు. అదే.. మాట త‌ప్పం.. మ‌డ‌మ తిప్పం. అదేవిధంగా 'విశ్వస‌నీయ‌త‌-విలువ‌లు ఉన్న పార్టీ వైసీపీ'. ఇక‌, ఇటీవ‌ల కాలంలో పార్టీ నాయ‌కులు ఎక్కువ‌గా ప్రచారం చేస్తున్న అంశం.. 'చెప్పాడంటే.. చేస్తాడంతే!'.. బ‌హుశ ఈ విశ్వస‌నీయ‌త‌, మాట త‌ప్పక‌పోవ‌డం వంటి కీల‌క ప‌రిణామాలే.. 2019లో వైసీపీకి అధికారాన్ని ఇచ్చాయని అంటారు ప‌రిశీల‌కులు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నప్పటికీ.. అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఇప్పటి వ‌ర‌కు జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే జగన్ విశ్వస‌నీయ‌త‌పై మ‌ర‌క‌లు ప‌డుతున్నాయ‌ని అంటున్నారు.

అందరికీ ఆదర్శంగా ఉంటామని….

'మేం ఇత‌ర పార్టీల నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యేను చంద్రబాబు మాదిరిగా గుంజుకోం. ఈ విష‌యంలో పార‌ద‌ర్శకంగా.. దేశానికి ఆద‌ర్శంగా ఉంటాం ఒక వేళ ఎవ‌రైనా రావాల‌ని అనుకుంటే.. త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాతే.. వైసీపీలో చేరాలి. ఇలా అయితేనే చేర్చుకుంటాం“ అని తొలి స‌భ‌లో సీఎం జ‌గ‌న్ చేసిన ప్రక‌ట‌న ఇప్పటికీ గుర్తింది. కానీ.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. మాత్రం దీనికి చాలా భిన్నంగా ఉన్నాయి. టీడీపీ త‌ర‌ఫున గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేల‌ను రాజీనామాలు చేయించ‌కుండానే.. వైసీపీకి మ‌ద్దతుదారులుగా మార్చుకున్నారు.. మ‌రి ఇది విశ్వస‌నీయ‌త అనే చాప్టర్‌లో ఏ అధ్యాయ‌మో.. వైసీపీ నేత‌లు చెప్పాలి.

చెప్పేదొకటి.. చేసేదొకటి…..

ఇక‌, గ‌త ఏడాది జ‌రిగిన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కొన్ని ఏక‌గ్రీవ‌మ‌య్యాయి. నిజానికి మిగిలిన వాటికి ఇంకా ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు. ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగ‌డ్డ ర‌మేష్ త‌న హయాంలో జ‌ర‌ప‌లేన‌ని చెప్పారు.. అయితే.. ఇప్పటికే జ‌రిగిన పంచాయ‌తీ, స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించింది. కానీ, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీలో పార్టీ చిహ్నంపై ఏక‌గ్రీవం అయిన‌.. టీడీపీ అభ్యర్థుల‌ను ఇప్పుడు త‌న‌వైపు తిప్పుకొనే ప్రయ‌త్నం చేసింది. ఇప్పటికే నందిగామ‌, హ‌నుమాన్ జంక్షన్‌, మైల‌వ‌రం, సీమ జిల్లాల్లో జ‌రిగిన ప‌రిణామాలు ఇవే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇదే ర‌క‌పు విశ్వస‌నీయ‌త ‌? పైకి చెప్పడం త‌మ‌కు విశ్వస‌నీయ‌త ఉంద‌ని.. కానీ, లోపాయికారీగా చేస్తోంది మాత్రం ఇలాంటివే ? ఇలాంటి ప‌రిణామాలు ఒక్కసారి క‌నుక ప్రజ‌ల్లోకి వెళ్తే.. పార్టీపైనే మ‌చ్చప‌డ‌డంతోపాటు.. న‌మ్మక‌మే స‌న్నగిల్లే ప‌రిస్థితి ఉంటుంద‌న‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

పొరుగు రాష్ట్రంలోనూ…..

దీనికి తెలంగాణ‌లోని కేసీఆర్ స‌ర్కారే ఉదాహ‌ర‌ణ‌గా మారింద‌ని చెబుతున్నారు. తెలంగాణ తీసుకువ‌చ్చిన కేసీఆర్‌పై విశ్వస‌నీయ‌త కార‌ణంగానే రెండో సారి కూడా అధికారం ఇచ్చారు. కానీ, ఆ విశ్వస‌నీయ‌త‌ను ఆయ‌న నిరూపించుకోలేక పోతున్న కార‌ణంగా.. బీజేపీ వైపు ప్రజ‌లు దృష్టి పెట్టారు. ఈ ఫ‌లితంగానే దుబ్బాక ఉప ఎన్నిక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కేసీఆర్‌కు తీవ్ర ఎదురుదెబ్బత‌గిలింది. ఇక‌, ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ తీవ్రమైన పోరు సాగించాల్సి వ‌చ్చింది. మ‌రి ఇదే ప‌రిస్థితి ఏపీలోనూ రాద‌నే గ్యారెంటీ ఏమీలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనిని అటు జ‌గ‌న్‌.. ఇటు పార్టీ నేత‌లు కూడా గ‌మ‌నంలో పెట్టుకుంటే… మంచిద‌నే భావ‌న వ్యక్తమ‌వుతోంది.

Tags:    

Similar News