బాబు జేబులో చేయి పెట్టేశారా… ?

రాజకీయం అంటే అదే మరి. ప్రత్యర్ధి ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. అదను చూసి కాగల కార్యం నెరవేర్చాలి. ఏపీలో చూసుకుంటే నువ్వా నేనా అన్నట్లుగానే వైసీపీ [more]

Update: 2021-06-11 00:30 GMT

రాజకీయం అంటే అదే మరి. ప్రత్యర్ధి ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. అదను చూసి కాగల కార్యం నెరవేర్చాలి. ఏపీలో చూసుకుంటే నువ్వా నేనా అన్నట్లుగానే వైసీపీ టీడీపీల మధ్య పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగుతుంది. ఇక ఏపీ రాజకీయం అంటే కులాలా సమీకరణలే అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ ఈ రకమైన లెక్కలలో బాగా పండిపోయారు. అలాగే సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో తనకు సాటి పోటీ లేదని కూడా ఆయన నిరూపించుకుంటున్నారు.

టార్గెట్ అదే …?

ఇదిలా ఉంటే తెలుగుదేశం ప్రాణ వాయువు లాంటి కొన్ని కులాల మీద జగన్ కన్ను పడింది. ఆయన ముఖ్యమంత్రి అవక ముందు నుంచే బీసీల మీద కన్నేసి వారిలో సగం మందిని తమ వైపునకు తిప్పుకున్నారు. దాని ఫలితంగా 2019లో బంపర్ విక్టరీ సాధ్యపడింది. ఇక సీఎం అయ్యాక వారి కోసం ప్రత్యేకంగా 60 పై దాకా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి శభాష్ అనిపించుకున్నారు. దాని ఫలితాలు కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో వచ్చాయి. ఇపుడు వాటిని కూడా దాటేసి ఏకంగా బాబు సొంత సామాజిక వర్గాన్ని జగన్ టార్గెట్ చేశారు. చాలా కాలంగా ఉన్న ఒక అతి ముఖ్యమైన డిమాండ్ ని తీర్చి జగన్ ఆయా వర్గాలకు కూడా చేరువ అయిపోయారు.

అనూహ్యమే….?

ఏపీలో పేరుకు అగ్ర వర్ణాలుగా ఉన్న చాలా కులాలు నిజానికి పేదరికంలో అవస్థ పడుతున్నాయి. అలాంటి వాటిలో బ్రాహ్మణులకు ఒక కార్పొరేషన్ ని నాడు చంద్రబాబు ఏర్పాటు చేశారు. అదే వరసలో తమకు కూడా కార్పొరేషన్లు కావాలని రెడ్డి, కమ్మ, క్షత్రియ వర్గాలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ వచ్చాయి. కానీ గత పాలకులు పట్టించుకోలేదు. కానీ జగన్ మాత్రం సడెన్ గా వారి కోసం మూడు ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తూ కీలక‌మైన నిర్ణయం తీసుకున్నారు. దాంతో చంద్రబాబు చేయలేని పని జగన్ చేశాడు అంటున్నారు కమ్మ సామాజిక వర్గం నేతలు . ఇక రాజులు కూడా రాజ్యాలు పోయి ఇపుడు సామాన్యులుగా బతుకులీడుస్తున్నారు. వారు సైతం ఈ పరిణామంతో హ్యాపీగా ఉన్నారు. రెడ్లు అయితే వైసీపీకి పెద్ద దన్నుగా ఉంటూ వస్తున్నారు. వారికి ఇది ఒక విధంగా వరంగా అనుకోవాలి.

కొంత చీలినా…?

కమ్మలు ఏపీ జనాభాలో మూడు నుంచి నాలుగు శాతం ఉంటారు. క్రిష్ణ గుంటూరు వంటి చోట్ల వారి ఆధిపత్యం ఎక్కువ. ఇక తెలుగుదేశం పెట్టకముందు ఎక్కువగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు. కొందరు కాంగ్రెస్ లో కూడా ఉంటూ పదవులు అనుభవించారు. టీడీపీ ఏర్పాటు అయ్యాక మాత్రం వారంతా అత్యధిక శాతం ఆ పార్టీ నీడన ఉన్నారు. టీడీపీని తమ సొంత పార్టీగా కూడా భావిస్తూ వస్తున్నారు. అయితే గత రెండేళ్ళుగా టీడీపీ ఓడి వాడడంతో కమ్మ సమాజంలో కూడా చర్చ సాగుతోంది. దానికి తోడు టీడీపీ గెలిచినా కూడా పేదలైన కమ్మలకు ఏం ఒరిగింది అన్న ఆలోచనలు కూడా చాలా మందిలో ఉన్నాయి. ఇపుడు జగన్ కమ్మ కార్పోరేషన్ ఏర్పాటు చేయడంతో వారిలో హర్షం వ్యక్తం అవుతోంది. ఈ పరిణామంతో వారిలో కూడా మార్పు మొదలవుతుందని అంటున్నారు. ఆ వర్గం ఓట్లు ఎంతో కొంత చీలినా కూడా అది టీడీపీకి పెద్ద దెబ్బగానే ఉంటుంది అంటున్నారు. మొత్తానికి కమ్మలు అంతా తన జేబులో ఉన్నారని టీడీపీ భావిస్తే మాత్రం అది తప్పు అవుతుంది అనే విశ్లేషణలు ఉన్నాయిపుడు.

Tags:    

Similar News