ఫస్ట్ టైమ్ జగన్ ఒప్పుకున్నారా… ?
జగన్ ఒక రకంగా దేనినీ ఒప్పుకునే రకం కాదు. ఆయన పట్టుదల అలాంటిది. కిందా పడ్డా పై చేయి అని వాదించడు కానీ తన ఉక్కు సంకల్పంతో [more]
జగన్ ఒక రకంగా దేనినీ ఒప్పుకునే రకం కాదు. ఆయన పట్టుదల అలాంటిది. కిందా పడ్డా పై చేయి అని వాదించడు కానీ తన ఉక్కు సంకల్పంతో [more]
జగన్ ఒక రకంగా దేనినీ ఒప్పుకునే రకం కాదు. ఆయన పట్టుదల అలాంటిది. కిందా పడ్డా పై చేయి అని వాదించడు కానీ తన ఉక్కు సంకల్పంతో ఎలాగైనా సాధించాలని మాత్రం జగన్ చూస్తాడు. అందుకే ఆయన్ని అపూర్వ విజయాలు వరిస్తాయి. 2014 ఎన్నికల్లో ఓడాక జగన్ అన్న మాట ఒక్కటే, గుండె బలం నిండుగా ఉంది. ఆ దేవుడి దయతో మేము వచ్చేసారి గెలుస్తామని. అలా జగన్ 2019లో మంచి విజయమే సొంతం చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా రెండేళ్ళ పాలన పూర్తి చేశారు. అంతా బాగుంది కానీ జగన్ సర్కార్ కి తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కడలేని చికాకులు మాత్రం తప్పడంలేదు. వ్యవస్థలను మ్యానేజ్ చేయడం ద్వారా టీడీపీ చీకటి దెబ్బలు కొడుతోంది. దాంతో గత రెండేళ్ళుగా జగన్ అలా ఓడిపోతున్నారు.
గెలిచారుగా…?
వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వైసీపీ సర్కార్ ని నానా రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఈ విషయంలో వారు విజయం సాధించారు కూడా అంటున్నారు జగన్ కుడి భుజం లాంటి సజ్జల రామక్రిష్ణారెడ్డి. జగన్ కేవలం రాజకీయ పార్టీలతోనే పోరాటం చేయడంలేదని, కొన్ని దుష్ట శక్తులను కూడా ఆయన ఢీ కొంటున్నారు అని సజ్జల చెప్పుకొచ్చారు. ప్రజల నిండు అయిన అభిమానంతోనే జగన్ వారిని ఎదుర్కొంటున్నారు అని ఆయన అంటున్నారు. తమ ధైర్యం ఒక్కటేనని, అది ప్రజలేనని ఆయన చెప్పడం ద్వారా జగన్ ఆంతరంగాన్ని ఆవిష్కరించారు.
జగనే అలా ….
ఇక జగన్ కూడా గత రెండేళ్ళుగా జరుగుతున్న పరిణామాల పట్ల కొంత కలత చెందినట్లుగానే కనిపిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు చంద్రబాబు అంత రాజకీయ అనుభవం లేదు, ఆయన మాదిరిగా బలమైన మీడియా మద్దతు కూడా లేదు అంటూ కొంత నిస్సహాయతనే ప్రదర్శించారు. తాను ప్రజలను మంచి చేయాలనే తాపత్రయపడుతున్నాను అని జగన్ చెప్పడం విశేషం. అయితే ఆయన తన ప్రయత్నాలకు ఎదురవుతున్న అడ్డంకులు, ఆటంకాలను చూసి కొంత ఆవేదన చెందుతున్నారా అన్న చర్చ అయితే వస్తోంది. జగన్ అంతటి పట్టుదల కలిగిన వారే ఇలా డీలా పడేలా ఏపీలో ప్రత్యర్ధులు గిరి గీసి మరీ పరిణామాలను తమకు అనుకూలం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదేమో.
అదొక్కటీ చాలా …?
జగన్ కి ఉన్నది అపరిమితమైన ప్రజాదరణ. అదే విషయం ఆయనతో పాటు సజ్జల కూడా చెబుతున్నారు. కానీ ప్రజలు అయిదేళ్ళకు ఒకమారు మాత్రమే తమ అధికారాన్ని ఉపయోగిస్తారు. మిగిలిన కాలమంతా ఏం జరిగినా వారు మౌన ప్రేక్షకులుగా చూస్తూనే ఉంటారు. ఎన్టీయార్ కి అద్భుతమైన విజయాన్ని 1994లో ప్రజలు అందిస్తే ఎనిమిది నెలలు తిరిగేసరికి ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎగిరిపోయింది. ఎన్టీయారే తమ సీఎం అని జనం గట్టిగా ఓటేసినా కాదని బాబు గద్దెనెక్కారు. ఆ తరువాత బాగా కుదురుకున్నారు. ఆ సమయంలో ఎన్టీయార్ వేదన అరణ్య రోదనే అయింది. ఇదంతా ఎందుకంటే రాజకీయాల్లో పదవులు ప్రజలు ఇచ్చినా వాటిని కాపాడుకునే సమయస్పూర్తి నేతలకు ఉండాలని చెప్పేందుకే. ముక్కు సూటిగా ముందుకు పోవడం, దూకుడుగా రాజకీయం చేయడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో నాడు అన్న ఎన్టీయార్ శకం చెబుతుంది. రెండేళ్ల జగం ఏలుబడిలోనూ అదే కనిపిస్తోంది. అందువల్ల కేవలం ప్రజలనే నమ్ముకోకుండా తన ఎత్తులకు మరింత పదును పెట్టాల్సిన అవసరం అయితే వైసీపీ అధినాయకత్వానికి ఉంది. ముల్లుని ముల్లుతోనే తీయాలి. అంతే తప్ప దుష్ట శక్తులు అంటూ అవతల వారి మీద బండ పడేసి ఊరుకుంటే మరిన్ని దెబ్బలు తగలడం ఖాయం. అపుడు ఓటమిని ఇంకా బాగా ఒప్పుకోవాల్సి ఉంటుందేమో.