మొత్తానికి అయిదేళ్ల సీఎం జగన్… ?

జగన్ అసలు సీఎం కాడు, ఈ జన్మలో అది జరగని పని. ఆయన్ని ఎన్నుకునేందుకు ఏపీ జనం సిద్ధంగా లేరు. చంద్రబాబు లాంటి అనుభవశాలి ఉండగా జగన్ [more]

;

Update: 2021-06-13 12:30 GMT

జగన్ అసలు సీఎం కాడు, ఈ జన్మలో అది జరగని పని. ఆయన్ని ఎన్నుకునేందుకు ఏపీ జనం సిద్ధంగా లేరు. చంద్రబాబు లాంటి అనుభవశాలి ఉండగా జగన్ ఎందుకు దండుగ. ఇలా సాగిపోయాయి గత అయిదేళ్లలో పసుపు పార్టీ నేతల మాటలు. జగన్ నుదుట రాజు అయ్యే రాత లేదని, ఆయన సీఎం ఎలా అవుతారని కూడా అదే పార్టీలో అపర జ్యోతీష్కులు కూడా కొందరు ప్రశ్నించారు. మొత్తానికి జగన్ సీఎం కావడం కల్ల అన్నది తన నరనరాల్లో జీర్ణించేసుకున్నారు. అదే ఇపుడు వారి కొంప ముంచుతోంది. జగన్ సీఎం అని మానసికంగా అంగీకరించడానికి ఇప్పటికీ టీడీపీ పెద్దలు సిద్ధంగా లేరు.

ఎక్కిన నాటి నుంచే …?

జగన్ 2019 మే 31న సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆ మరుసటి రోజు నుంచే ఆయన ప్రభుత్వం కూలిపోతుందని తమ్ముళ్ళు పిల్లి శాపాలు పెట్టారు. ఏ చిన్న సమస్య వచ్చినా రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరారు. ఆఖరుకు కోర్టులు జోక్యం చేసుకుని జగన్ని ఇంటికి పంపాలని కూడా కోరుకున్నారు. ఈ మధ్యలో జమిలి ఎన్నికల ప్రసక్తిని కూడా తీసుకువచ్చారు. జగన్ రెండేళ్ల సీఎం మాత్రమేనని కూడా చెప్పేసుకున్నారు. ఇలా ఎన్ని అనుకున్నా జగన్ మాత్రం నిబ్బరంగానే పాలన సాగిస్తూ వచ్చారు. మొత్తానికి తత్వం బోధపడ్డాక జగన్ అయిదేళ్ల పాటు కచ్చితంగా కుర్చీలో ఉంటాడని అర్ధమయ్యాక మెల్లగా గొంతు సవరించుకుంటున్నారు.

మూడేళ్ళేన‌ట..?

ఎంతసేపు మూడేళ్ళు. ఇలా కళ్ళు మూసుకుంటే అలా అయిపోతాయి అంటున్నారు చంద్రబాబు. జగన్ సర్కార్ అపుడే రెండేళ్ల టైమ్ వాడేసింది. మిగిలిన కాలం కూడా అలాగే కరిగిపోతుంది. ఆ మీదట పవర్ లోకి వచ్చేది టీడీపీనే అంటూ సంతృప్తి పడుతున్నారు. మామూలుగా అయితే ఇది సాధారణమైన వార్తే. కానీ జమిలి ఎన్నికలు వస్తాయి, జగన్ పూర్తి కాలం అధికారంలో ఉండడు అంటూ జోస్యాలు చెప్పే చంద్రబాబు లాంటి వారు మరో మూడేళ్ళ పాటు జగనే సీఎం అంటున్నారు అంటే కఠిన వాస్తవాలను అంగీకరిస్తున్నారు అనుకోవాలి. మొత్తానికి చంద్రబాబుకు జగన్ అయిదేళ్ళూ గద్దె దిగడు అన్న విషయం పూర్తిగా అర్ధమైపోయింది అన్న మాట అయితే వినిపిస్తోంది.

భారమేనా ..?

ఎంత దూరం, మరెంత భారం అనుకుంటూనే చంద్రబాబు రెండేళ్ల కాలం ప్రయాణం చేశారు. నిజంగా విపక్ష నేతగా బాబుకు జగన్ తో కొత్త అనుభవాలే ఎన్నో ఎదురయ్యాయి. ఆయన చెబుతున్నట్లుగా కళ్ళు మూసుకుంటే ఈ రెండేళ్ళూ గడవలేదు. ఎన్నో కఠినమైన పరీక్షలు ఎదుర్కొంటేనే ఈ రోజుకు వచ్చారు. అలాంటిది ఇంతకు రెట్టింపు అన్నట్లుగా మరో మూడేళ్ళ కాలం ఉంది. కానీ చాలా సులువు అని బాబు క్యాడర్ ముందు నమ్మబలుకుతున్నారు. నిజంగా రానున్న కాలమంతా అలా తేలిగ్గా గడిచేనా. ఏది ఏమైనా క్యాడర్ కి ధైర్యం చెబుతూ తాను గుండె గట్టి పరచుకోవడమే బాబు లాంటి నాయకుడి లక్షణమనుకోవాలి. అదే సమయంలో క్యాడర్ కి మంచి చెప్పడమేమో కానీ వైసీపీకి మాత్రం శుభవార్తే బాబు చెప్పారు. అయిదేళ్ళ పాటు జగన్ ని ఎవరూ ఏమీ చేయలేరని ఒప్పుకోవడం ద్వారా బాబు తన మంత్రదండం అసలు పనిచేయడంలేదని తానుగా ఒప్పేసుకున్నారు. పక్కకు తప్పేసుకున్నారు.

Tags:    

Similar News