జగన్ తలచుకున్నా కుర్చీ దక్కదంతే… ?
రాజకీయాల్లో పరమ పద సోపానం దక్కాలి అంటే ఎన్నో చేయాలి. ఒకపుడు మనవాడు అనుకుంటే చాలు పదవులు సులువుగా వచ్చేసేవి. అప్పట్లో అంతగా జనాలలో చైతన్యం లేదు [more]
;
రాజకీయాల్లో పరమ పద సోపానం దక్కాలి అంటే ఎన్నో చేయాలి. ఒకపుడు మనవాడు అనుకుంటే చాలు పదవులు సులువుగా వచ్చేసేవి. అప్పట్లో అంతగా జనాలలో చైతన్యం లేదు [more]
రాజకీయాల్లో పరమ పద సోపానం దక్కాలి అంటే ఎన్నో చేయాలి. ఒకపుడు మనవాడు అనుకుంటే చాలు పదవులు సులువుగా వచ్చేసేవి. అప్పట్లో అంతగా జనాలలో చైతన్యం లేదు కాబట్టి ఎవరికి ఎన్ని పదవులు ఇచ్చినా లెక్కలు చూసుకునే వారు కాదు. కానీ ఇపుడు సామాజిక సమీకరణల చట్రంలోనే అన్నీ జరగాలి. ఫలనా కులానికి ఇన్ని ఓట్లు ఉన్నాయి. వారిని కాదని పదవులు మిగిలిన వారికి ఇస్తారు అని వెంటనే అగ్గి పుట్టించేస్తారు. వారిలో చిచ్చు రేపడానికి విపక్షాలు ఎలాగూ రెడీగా ఉంటాయి. దాంతో జగన్ తానే తలచుకున్నా తనవారు అనుకున్న వారికి మంత్రి పదవులు ఎప్పటికీ ఇవ్వలేరా అన్న ప్రశ్న అయితే వస్తోంది.
కులమే దెబ్బ…?
జగన్ సీఎం కావాలని రెడ్డి సామాజికవర్గం తపించింది. నిజానికి టీడీపీ ఆవిర్భావం తరువాత నుంచే రెడ్డిలలో కులాభిమానం బాగా హెచ్చిందని చెబుతారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే వారికి పదవుల పంటే పండేది. అయితే విభజన తరువాత పరిస్థితులు మారిపోయాయి. ఏపీలో తెలుగుదేశానికి ధీటుగా మరో ప్రాంతీయ పార్టీగా వైసీపీ వచ్చింది. దానికి దన్నుగా రెడ్లు ఉన్నారు. కానీ పదవులు మాత్రం వారికి అందని పండు అవుతున్నాయి. దానికి వైసీపీ ప్రాంతీయ పార్టీ కావడం, అనేక పరిమితులు ఉండడమే ప్రధాన కారణాలు అంటున్నారు.
కాంగ్రెస్ కాదు…
వైసీపీలో పదవుల పంపకం అన్నది సామాజిక సమీకరణలతోనే జరుగుతోంది. బలమైన కులాలని కాదని రెడ్లకు పెద్ద పీట వేసే చాన్సే ఏ కోశానా లేదు. కాంగ్రెస్ అయితే జాతీయ పార్టీ కాబట్టి రెడ్లను అక్కున చేర్చుకుని అగ్రాసనం మీద కూర్చోబెట్టినా ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు ఉండేవి కావు. కాంగ్రెస్ లో ఏ అసంతృప్తి ఉన్నా ఢిల్లీ పెద్దల మీదకే దాని ప్రభావం ఉంటుంది. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రెడ్లకు విశేష ప్రాధాన్యతను ఇచ్చారు. మరి జగన్ ఆ పని చేయాలంటే చాలా కష్టం. జగనే పార్టీ అధినేతగా ఉన్నారు. దాంతో విభజన ఏపీలో నాలుగైదు శాతానికి పడిపోయిన రెడ్లకు ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వడం జగన్ తలచుకున్నా కుదిరే పని కాదని అంటున్నారు.
చకోర పక్షులే …?
మరో వైపు చూసుకుంటే జగన్ కి అత్యంత సన్నిహితులుగా కడప జిల్లా నుంచి శ్రీకాంత్ రెడ్డి, గుంటూరు నుంచి ఆళ్ళ రామక్రిష్ణా రెడ్డి వంటి వారు ఉన్నారు. అలాగే నెల్లూరులో కూడా కొందరు సీనియర్ రెడ్లు పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. ఇంకో వైపు కర్నూలు , చిత్తూరు వంటి చోట్ల రెడ్లు మంత్రి పదవుల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. జగన్ కి కూడా వారికి ఇవ్వాలని ఉంది. కానీ జగన్ సీఎం అవుతూనే సామాజిక వర్గ సమీకరణలను పరిగణనలోకి తీసుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద పీట వేశారు. ఇపుడు అదే ముందర కాళ్ళకు బంధంగా అడ్డుపడుతోంది. జగన్ దాన్ని కాదని రెడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే కచ్చితంగా రాజకీయంగా అది వైసీపీకి పెద్ద దెబ్బ అవుతుంది అంటున్నారు. మొత్తానికి మా జగన్ సీఎం అయ్యాడని రెడ్లు మురిసిపోవడమే ఇప్పటికైతే మిగిలింది అంటున్నారు.