ఒక్క ఛాన్స్ బ్యాచ్ ఎక్కువైపోయిందే….?

ఏ రంగంలో అయినా ఒక్క ఛాన్స్ ఇస్తే కదా సత్తా చాటేది, తానేంటో చూపించేది. ఆ చాన్స్ రావాలంటే ఆకాశం భూమీ కలిపేయాలి. కిందా మీద అయిపోవాలి. [more]

;

Update: 2021-06-18 03:30 GMT

ఏ రంగంలో అయినా ఒక్క ఛాన్స్ ఇస్తే కదా సత్తా చాటేది, తానేంటో చూపించేది. ఆ చాన్స్ రావాలంటే ఆకాశం భూమీ కలిపేయాలి. కిందా మీద అయిపోవాలి. ఎవరికైనా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఉంటుంది. దానికి కాలం కర్మం కలసిరావాలి. అయితే మానవ ప్రయత్నం కూడా చేయాలిగా. వైసీపీలో ఇపుడు అదే గట్టిగా చేస్తున్నారు. మరి కొద్ది నెలల్లో జగన్ మంత్రి వర్గాన్ని విస్తరిస్తారు అన్న వార్త ఆశావహులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అదే సమయంలో కలవరాన్ని కూడా రేకెత్తిస్తోంది.

ఛాన్స్ ఉంటుందా …?

కలవరం ఎందుకంటే తమకు కూడా ఛాన్స్ ఉంటుందా ఉండదా అన్నదే హై బీపీని పెంచేస్తోందిట. ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లో ఆరుగురు తప్ప మొత్తానికి మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో కూడా పాత కొత్త వారు ఉన్నారు. జగన్ ప్రయారిటీ ఏంటో తెలియదు కానీ సీనియర్లు మాత్రం మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు జన్మ ధన్యం అయినట్లే అని భావిస్తున్నారుట. ఒక వైపు వయసు అయిపోవడంతో పాటు మరో వైపు వర్తమాన రాజకీయల్లో పోటీ పడలేమని అంచనాకు వస్తున్న వారు అంతా తమకు ఒక్కసారి కుర్చీ దక్కాలని కోటి దేవతలను ప్రార్ధిస్తున్నారుట.

జాబితా పెద్దదే…?

విశాఖ జిల్లాలో చూసుకుంటే సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో పాయకరావుపేట నుంచి గొల్ల బాబూరావు ఉన్నారు. ఆయన ఈ ఒక్కసారికీ మంత్రిని చేస్తే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో అంటూ వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు. ఇక చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఒక్క చాన్స్ తనకు ఇస్తే వచ్చే సారి ఓడిపోయినా ఫరవాలేదు అన్నట్లుగా ఉన్నారుట. ఇక రాజుల కోటాలో తనకు చాన్స్ ఇస్తే రాజకీయాలకు రామ్ రామ్ అనేస్తాను అంటున్నారు యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు. మెగా పవర్ స్టార్ ని ఓడించిన తనకు ఇదే లాస్ట్ చాన్స్ అని మంత్రి కుర్చీ కోసం అర్జీలు పెడుతున్నారు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి.

వీరూ రెడీనా …?

ఇక విజయనగరం జిల్లాలో చూసుకుంటే 2024 ఎన్నికల్లో పోటీ చేయను కాబట్టి ఆ మంత్రి పదవి ఏదో ఈసారి ఇచ్చేద్దురూ అంటున్నారు కోలగట్ల వీరభద్రస్వామి. అలాగే సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర కూడా ఈసారికి మంత్రి పదవి రాకపోతే రాజకీయాలకు గుడ్ బై అనేస్తాను అంటున్నారుట. బొబ్బిలి రాజులను ఓడించి అక్కడ నుంచి గెలిచిన శంబంగి చిన అప్పలనాయుడు అయితే తనకు ఇదే ఆఖరి అవకాశం అని భావిస్తున్నారుట. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ధర్మాన ప్రసాదరావు ఒక్క చాన్స్ అంటున్నారు. ఆయన కూడా ఇకపైన ఎన్నికల్లో పోటీ చేయరాదు అని నిర్ణయించుకున్నారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఒక్కసారిని మంత్రిని చేస్తే చాలు ఈసారి ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్తాను అంటున్నారు. ఇదే వరసలో పాలకొండ, రాజాం వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవి కోసం గట్టిగానే పట్టుపడుతున్నారు. మరి ఒక్క చాన్స్ అంటూ డజన్ల కొద్దీ ఆశావహులు రెడీ అయితే జగనే కాదు ఆ జగన్నాధుడు కూడా ఏమీ చేయలేడు. కానీ వైసీపీ అధినాయక‌త్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News