నమ్ముకునే కంటే జంప్ చేయడమే మేలా?

ఏదైనా పార్టీని నమ్ముకుని ఉంటే రాజకీయంగా ఎదగలేరు. సరైన సమయంలో పార్టీ మారితేనే వారికి ఫ్యూచర్ ఉంటుంది. ఇది ఏపీ రాజకీయాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. జగన్ [more]

Update: 2021-06-19 14:30 GMT

ఏదైనా పార్టీని నమ్ముకుని ఉంటే రాజకీయంగా ఎదగలేరు. సరైన సమయంలో పార్టీ మారితేనే వారికి ఫ్యూచర్ ఉంటుంది. ఇది ఏపీ రాజకీయాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పదవులు భర్తీ అయ్యాయి. అయితే వీటిలో చాలా పదవులు ఇతర పార్టీల నుంచి తన పార్టీలోకి వచ్చి చేరిన నేతలకే ఎక్కువ దక్కాయన్నది వాస్తవం. దీంతో తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న కొన్ని సామాజికవర్గాలు అసంతృప్తితో ఉన్నాయి.

అనేక మంది నేతలు….?

జగన్ అధికారంలోకి రావడానికి అనేక కష్టాలు పడ్డారు. 2014లో అధికారంలోకి రాకపోవడంతో జగన్ ను అనేక మంది నేతలు వీడిపోయారు. దీంతో జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అనేక మంది నేతలు 2019 ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు. వీరి చేరికతో పార్టీకి మరింత హైప్ వచ్చిందన్నది వాస్తవం. ఎన్నికలకు ముందు అవంతిశ్రీనివాస్, పండుల రవీంద్ర బాబు, చల్లా రామకృష్ణారెడ్డి, సి.రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు వంటి నేతలు పార్టీలోకి వచ్చారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత…?

ఇక 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా అనేక మంది పార్టీలోకి వచ్చారు. జూపూడి ప్రభాకర్ రావు నుంచి తోట త్రిమూర్తులు వరకూ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పదవులు దక్కుతుండటం వైసీపీలో చర్చనీయాంశమైంది. ఇటు సామాజికవర్గం కోణంలోనూ, అటు విధేయతపరంగా చూసినా తమకు దక్కాల్సిన పదవులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి దక్కుతుండటం జీర్ణించుకోలేకపోతున్నారు.

వారికే పదవులా?

ఇతర పార్టీల నుంచి వచ్చిన పండుల రవీంద్ర బాబు, చల్లా రామకృష్ణారెడ్డి (ఆయన మరణంతో కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చారు), సి.రామచంద్రయ్య వంటి వారికి పదవులు దక్కాయి. ఇక టీడీపీ నుంచి వచ్చిన డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీతకు జగన్ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చయడంతో వారికే తిరిగి ఇచ్చారు. తాజాగా తోట త్రిమూర్తులుకు కూడా దక్కడంతో పార్టీని నమ్ముకున్న వారికి పదవులు దక్కవని బలమైన సామాజికవర్గం నేతల్లో నెలకొంది. దీంతో అనేక మంది నేతలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News