ఎవరి ఆలోచనలు వారేవేనట …?

సాధారణంగా ముఖ్యమంత్రులు ఎవరైనా ఢిల్లీ వెళ్తే కలిసేది ప్రధానిని, వారు ముందుగా కోరే అపాయింట్మెంట్ కూడా అదే. ఆ తరువాత తమ రాష్ట్రాల్లో నిధుల సమస్యలు ఉంటే [more]

;

Update: 2021-06-13 05:00 GMT

సాధారణంగా ముఖ్యమంత్రులు ఎవరైనా ఢిల్లీ వెళ్తే కలిసేది ప్రధానిని, వారు ముందుగా కోరే అపాయింట్మెంట్ కూడా అదే. ఆ తరువాత తమ రాష్ట్రాల్లో నిధుల సమస్యలు ఉంటే ఆర్ధిక మంత్రి కూడా కచ్చితంగా కలిసే జాబితాలో ఉంటారు. ఇక జల వనరులతో పాటు పరిశ్రమల శాఖల మంత్రులు కూడా అతి ముఖ్యమే. కానీ ఎవరూ హోం మంత్రిని పెద్దగా కలవరు. ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని తరువాత సీటు ఆయనదే అయినా రాష్ట్రాలకు పెద్దగా అవసరం పడని శాఖ అది. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం ఎపుడు ఢిల్లీ వెళ్ళినా హోమ్ మంత్రి అమిత్ షాతోనే గంటల తరబడి భేటీలు వేస్తున్నారు.

రాత్రివేళ భేటీలు…

ఇక జగన్ అమిత్ షాల భేటీకి మరో ప్రత్యేకత ఉంది. రాత్రి పొద్దు పోయాక అంటే ఏ తొమ్మిది తరువాతనో ఈ సమావేశాలు జరుగుతాయి. ఆ మీదట అవి రాత్రి పదిన్నర దాకా సాగుతాయి. ఇలా ఒకసారి కాదు, కొన్ని సార్లుగా జరుగుతూ వస్తోంది. దాంతోనే జగన్ ఢిల్లీ టూర్ మీద టీడీపీ సహా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. హోం మంత్రితో అన్నేసి గంటల పాటు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి ముఖ్యమత్రి గారూ అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య దీర్ఘాలు తీస్తున్నారు. ఏపీకి నిధుల కొరత ఉంది. అయినా ఆర్ధిక మంత్రికి జగన్ అసలు కలవలేదని కూడా గుర్తు చేస్తున్నారు.

ఆయనే ఎందుకు…?

జగన్ రెండేళ్లలో పదకొండు సార్లు ఢిల్లీకి వెళ్ళారు. మొదట్లో అందరిలాగానే జగన్ కూడా ప్రధాని మోడీ అపాయింట్మెంటే అడిగేవారు. అలా తొలి రోజుల్లో ఎక్కువగా మోడీతోనే భేటీలు వేసేవారు. ఆ తరువాత మాత్రం ఆయన మోడీని పూర్తిగా పక్కన పెట్టేశారు. అమిత్ షాతో అపాయింట్మెంట్ దొరికితే చాలు ఢిల్లీకి వెళ్ళి వాలిపోతున్నారు. మరి జగన్ కి మోడీ కంటే కూడా అమిత్ షా అంత ఇష్టంగా కనిపిస్తున్నారా అన్నది ఒక ప్రశ్న అయితే మోడీ కంటే కూడా అమిత్ షా బలవంతుడా అన్నది మరో ప్రశ్నగా ఉంది. మోడీని కలసినా అమిత్ షానే కలవమని చెబుతున్నారు కాబట్టి ఆ కలిసేదేదో ఆయన్నే కలిసేస్తే పోలా అన్నది కూడా జగన్ ఆలోచనగా ఉండవచ్చు అంటున్నారు. ఇక్కడ మరో విషయం ఉంది. అటు పార్టీలోనూ, ఇటు కేంద్రంలోనూ చక్రం తిప్పుతున్నది అమిత్ షాయే కావడంతో మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా పెద్దాయన వద్దకే వెళ్తే చాలు కదా అన్న వ్యూహంతోనే జగన్ ఆయన్ని పదే పదే కలుస్తున్నారు అంటున్నారు.

అటు వైపు కూడా ..?

ఇక అమిత్ షా కూడా జగన్ ని కలవడానికి ఇష్టపడుతున్నారు అన్న మాట ఉంది. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో జగన్ బలవంతుడిగా ఉన్నారు. ఇప్పటిదాకా ఉన్న అంచనాలు చూసుకుంటే 2024లో కూడా మరో మారు ఆయనే గెలుస్తారు అన్న లెక్కలు కూడా ఉన్నాయి. ఇక మోడీ తరువాత తాను ప్రధాని కావాలని చూస్తున్న అమిత్ షా జగన్ లాంటి బలమైన ప్రాంతీయ పార్టీ నాయకులను కూడగట్టుకుంటే రేపటి రోజున తనకు మేలు చేస్తుందని భావిస్తున్నారు అన్న మాట కూడా ఉంది. జగన్ అమిత్ షా కలయిక విషయంలో చూసుకుంటే ఇద్దరికీ ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి. కానీ ఏపీలోని టీడీపీ మాత్రం దీన్ని అసలు తట్టుకోలేకపోతోంది. జగన్ మీద సీబీఐ కేసులు ఉన్నాయి. హోమ్ శాఖ పరిధిలోనే సీబీఐ ఉంది. దాంతో జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా తన సొంత ప్రయోజనాల కోసమే అమిత్ షాని కలుస్తున్నారు అని పసుపు పార్టీ ప్రచారం చేస్తోంది. ఏది ఎలా ఉన్నా ఆ ఇద్దరికీ అమితానుబంధమే అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News