జగన్ తొలి టీంకు మంచి మార్కులేనట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండేళ్ల పాలన పూర్తయింది. మరో ఆరు నెలల్లో మంత్రి వర్గ విస్తరణ చేయనున్నారు. అయితే తొలిదఫా మంత్రులుగా బాధ్యతలను చేపట్టిన వారంతా [more]

;

Update: 2021-06-23 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండేళ్ల పాలన పూర్తయింది. మరో ఆరు నెలల్లో మంత్రి వర్గ విస్తరణ చేయనున్నారు. అయితే తొలిదఫా మంత్రులుగా బాధ్యతలను చేపట్టిన వారంతా మధ్యలో పదవి ఊడిపోకుండా బయటపడ్డవారే. రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఎవరు ఉంటారు? ఎవరు బయటకు వెళతారు? అన్నది పక్కన పెడితే మంత్రులపై జగన్ దాదాపు నమ్మకం ఉన్నట్లే అనుకోవాలి. జగన్ రెండేళ్ల కాలంలో కేవలం ఇద్దరు మంత్రులను మార్చారు.

ఆ ఇద్దరినీ…?

అదీ శాసనమండలి రద్దు ప్రకటన చేయడంతో మంత్రివర్గంలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను జగన్ మంత్రి పదవులకు రాజీనామా చేయించారు. వారిని రాజ్యసభకు పంపారు. వారి స్థానంలో వేణుగోపాల్, అప్పలరాజులను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంతే తప్ప ఎవరినీ అవినీతి ఆరోపణలతో పదవుల నుంచి మంత్రులను జగన్ తొలగించలేదు. ప్రతి శాఖపై సీఎంవో కార్యాలయం కన్ను వేసి ఉండటంతో మంత్రులు ఎవరూ అవినీతి ఆరోపణల్లో చిక్కుకోలేదు.

ఆయనపై వచ్చినా?

సీఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసినప్పుడు మంత్రి గుమ్మనూరి జయరాం పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయన అనుచరులు, బంధువులు పేకాట శిబిరాలను నడుపుతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే తాను ప్రత్యేకంగా తెప్పించుకున్న నివేదికల ఆధారంగా జగన్ గుమ్మనూరి జయరాంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జగన్ ఖచ్చితంగా జయరాంను మంత్రి వర్గం నుంచి తొలిగిస్తారని అప్పట్లో ప్రచారం జరిగినా జగన్ తనకున్న సమాచారం మేరకు చర్యలు తీసుకోలేదు.

నిఘా పెట్టడంతో…..

అదే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ తొలిదఫాలో రాజయ్యను, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తొలిగించారు. అయితే జగన్ మాత్రం తొలి రెండున్నరేళ్ల కాలంలో తన మంత్రులు ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి కారణం మంత్రులు తమకు అప్పగించిన పనులు సకాలంలో పూర్తి చేయడమే కారణం. ప్రతి శాఖపైన నిఘా పెట్టడంతో అవినీతికి ఆస్కారం లేదని ఒక సీనియర్ మంత్రి తెలిపారు. మొత్తం మీద జగన్ తొలి టీం ఎటువంటి అవినీతి మచ్చ పడలేదన్నది వాస్తవం.

Tags:    

Similar News