వీళ్లిద్దరినీ మరికొంత కాలం కొనసాగిస్తారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరి కొద్ది రోజుల్లోనే తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. ఈ విస్తరణలో దాదాపు 95 శాతం మంది మంత్రులు తమ పదవులను [more]

Update: 2021-07-02 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరి కొద్ది రోజుల్లోనే తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. ఈ విస్తరణలో దాదాపు 95 శాతం మంది మంత్రులు తమ పదవులను కోల్పోతారు. ముఖ్యమైన వారిని తప్ప జగన్ తన కేబినెట్ లో అందరినీ తప్పిస్తారంటున్నారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే వారినే ఎంపిక చేయనున్నారు. సామాజికవర్గాలు, జిల్లాల వారీగా పరిగణనలోకి తీసుకుని కొత్త మంత్రుల ఎంపిక ఉంటుందంటున్నారు.

ఈ ఇద్దరూ తప్ప……

అయితే ప్రస్తుతం జగన్ కేబినెట్ లో ఉన్న ఇద్దరు తప్ప అందరూ రెండున్నరేళ్లు మంత్రిగా పూర్తి చేసుకున్న వారే. మధ్యలో శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవడంతో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను జగన్ మంత్రివర్గం నుంచి తొలగించాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఇద్దరి స్థానంలో మరో ఇద్దరికి అవకాశం జగన్ కల్పించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పలరాజు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చెల్లుబోయిన వేణుగోపాల్ లకు ఏడాది క్రితమే అవకాశం దక్కింది.

ఒకటిన్నర సంవత్సరమే….

వీరిద్దరూ మంత్రి పదవి చేపట్టి ఒకటన్నర సంవత్సరమే అవుతుండటంతో వారిని మంత్రివర్గం నుంచి జగన్ తప్పించరన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో అప్పలరాజుకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కొంత అక్కడ పార్టీ బలపడింది. అదే సమయంలో అప్పలరాజుకు పశుసంవర్థక, మత్స్య శాఖను అప్పగించడం, అందులోనూ ఆయన కొంత పనితీరును మెరుగుపర్చుకోవడంతో మరో ఏడాది పాటు కొనసాగిస్తారని అంటున్నారు.

వివాదరహితుడిగా….

ఇక చెల్లుబోయిన వేణుగోపాల్ పరిస్థితి అంతే. ఆయన బీసీ సంక్షేమ శాక మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత కొంత దూకుడు పెంచారు. నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వివాదరహితుడిగా ఆయనకు పేరుంది. అంతర్వేది లో రథం దగ్దం అనంతరం ఘటనలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వేణుగోపాల్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారన్న పేరుంది. అందుకే ఈ ఇద్దరిని మరో ఏడాది పాటు జగన్ తన మంత్రివర్గంలో కొనసాగిస్తారన్న టాక్ విన్పిస్తుంది.

Tags:    

Similar News