అక్కడ మాత్రం రాజీ లేనే లేదట

రాజకీయాల్లో ఒక్కోసారి నియంతృత్వం కూడా మంచి చేస్తుందనే చెప్పాలి. ప్రాంతీయ పార్టీల్లోనే ఎక్కువగా అధినేతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తాము అనుకున్న పనిని చేసే వీలు ఒక్క [more]

;

Update: 2021-08-11 02:00 GMT

రాజకీయాల్లో ఒక్కోసారి నియంతృత్వం కూడా మంచి చేస్తుందనే చెప్పాలి. ప్రాంతీయ పార్టీల్లోనే ఎక్కువగా అధినేతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తాము అనుకున్న పనిని చేసే వీలు ఒక్క ప్రాంతీయ పార్టీల్లోనే దక్కుతుంది. అందుకే అధినేతల దృష్టిలో పడేందుకు ఎక్కువగా నేతలు కష్టపడుతుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు గాని, వైసీపీ అధినేత జగన్ కాని తాము అధికారంలో ఉన్నప్పుడు పదవుల భర్తీ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు.

ఆర్థిక పరిస్థితి చూసి…..

సహజంగా రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేటప్పుడు సామాజికవర్గాలు, ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటారు. రాజ్యసభ అయితే గతంలో డబ్బున్న వారికే దక్కేదన్న పేరుండేది. ఎమ్మెల్సీల స్థానాలను భర్తీ చేసేటప్పుడు కూడా పార్టీకి నిధులను కేటాయించే వారికే ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. కానీ జగన్ మాత్రం తాను అనుకున్న వారికి, మాట ఇచ్చిన వారికి మాత్రమే పదవులు ఇస్తున్నారు.

సామాన్యులకు కూడా…..

ఇందులో ప్రధానంగా సామాజికవర్గాలను, పార్టీకి వారు ఉపయోగపడిన తీరు, భవిష్యత్ లో పార్టీకి వారి అవసరాలను గుర్తించి జగన్ ఎమ్మెల్సీలను ఎంపిక చేశారంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మైనారిటీలకు జగన్ పెద్ద యెత్తున అవకాశం కల్పించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జకియా ఖాను, మహ్మద్ కరీమున్నీసా, మహ్మద్ ఇక్బాల్ లకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. వీరిలో ఇక్బాల్ తప్ప మిగిలిన ఇద్దరూ సామాన్య కార్యకర్తలే. పెద్దగా ఆర్థికంగా బలమైన వారు కాదు.

సామాజికవర్గాలుగా…?

ఇక ఎస్సీల్లోనూ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. పండుల రవీంద్ర బాబు, బల్లి కల్యాణ్ చక్రవర్తి, డొక్కా మాణిక్య వరప్రసాద్, కొయ్య మోషేన్ రాజులను ఎమ్మెల్సీలుగా చేశారు. వీరిలో పండుల, డొక్కా పార్టీ మారి రావడంతో వారికి అవకాశం ఇచ్చారు. తండ్రి మరణంతో బల్లి కల్యాణ చక్రవర్తికి అవకాశమిచ్చారు. కొయ్య మోషేన్ రాజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి ఆయనకు నమ్మకంగా ఉన్న నేత. ఆయన కూడా పెద్దగా ఆర్థికంగా బలవంతుడేమీ కాదు. పార్టీ కోసంం పనిచేయడంతోనే మోషేన్ రాజుకు పదవి దక్కింది. ఇక బీసీ కోటాలో నలుగురు, ఓసీ లకు ముగ్గురికి జగన్ అవకాశమిచ్చారు. మొత్తం మీద జగన్ ఈక్వేషన్లు పార్టీని మరింత బలోపేతం చేస్తాయంటున్నారు. నాయకత్వంపై నమ్మకం మరింత పెరుగుతుంది.

Tags:    

Similar News