జగన్ పార్టీలో సునామీ… ?

ముఖ్యమంత్రి జగన్ రెక్కల కష్టం వైసీపీకి అధికారం అన్నది తెలిసిందే. అయితే ఎంతో కొంత తమ పాత్ర కూడా ఉందని భావించి కాలరెగరేసే నాయకులు కూడా ఈ [more]

Update: 2021-06-25 13:30 GMT

ముఖ్యమంత్రి జగన్ రెక్కల కష్టం వైసీపీకి అధికారం అన్నది తెలిసిందే. అయితే ఎంతో కొంత తమ పాత్ర కూడా ఉందని భావించి కాలరెగరేసే నాయకులు కూడా ఈ ప్రాంతీయ పార్టీలోనూ బోలెడంత మంది ఉన్నారు. జగన్ తో పాటు తమ వ్యక్తిగత చరిష్మా కలిస్తేనే ఏపీలో పవర్ లోకి వచ్చామని వారు కాస్తా గట్టిగానే చెబుతారు. వైసీపీకి 151 ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్ తప్పిస్తే మిగిలిన 150 మందిలోనూ పాతిక మందికి మాత్రమే ఫస్ట్ టెర్మ్ లో అమాత్య కుర్చీ దక్కింది. మరో విడతలో కనీసం పదిహేను మంది దాకా అవకాశాలు దక్కుతాయి. మరి మంత్రి పదవి మీద ఆశపెట్టుకున్న మిగిలిన 110 మంది సంగతేంటి. ఇదే ప్రశ్న ఇపుడు వైసీపీలో వినిపిస్తోంది.

నాడు ఓకే కానీ…?

జగన్ 2019 ఎన్నికల తరువాత అపుడే బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. పైగా కొత్త మోజు. దాంతో నాడు ఆశావహులకు సామాజిక సమీకరణల రూపేణా కాండు జెల్ల తగిలినా బాగా ఓర్చుకున్నారు, సర్దుకున్నారు. పైగా వారిలో ఆశలు ఇంకిపోకుండా జగన్ కూడా వుందిలే మంచికాలం ముందు ముందునా అంటూ ఊరించారు. కానీ కాలం వేగంగా గిర్రున ఇట్టే తిరిగిపోయింది. దాంతో ఆశావహులు అనుకున్న కాలం వస్తోంది. అది మంచిదో కాదో జగన్ చెబితేనే కదా తమకు తెలిసేది అని ఆశావహులు వైసీపీలో అనుకుంటున్నారు. ఈ రకమైన టెన్షన్ తో రోజులు వారు భారంగానే గడుపుతున్నారని చెప్పాలి.

అసలు కుదరదా…?

ఇక జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం అనివార్యం. జగన్ మాట తప్పరు కాబట్టి రెండున్నరేళ్ల తరువాత తొంబై శాతం మందిని మార్చి వారి ప్లేస్ లో కొత్తవారిని తీసుకోవాలి. మరి ఇందులో సామాజిక సమీకరణలు మరోటీ అని కబుర్లు చెప్పి చాలా మందికి ఝలక్ ఇస్తే తట్టుకోవడానికి ఈసారి ఎవరూ సిద్ధంగా లేరుట. ముఖ్యంగా పెద్ద తలకాయలు కొన్ని పార్టీలో ఉన్నాయి. వారు వారు జగన్ విస్తరణకు పెట్టే ముహూర్తమే తమ రాజకీయ భవిష్యత్తుకు కూడా ముహూర్తమని ఆఫ్ ది రికార్డుగా చెప్పేస్తున్నారు. జగన్ తమను పట్టించుకోకపోతే మాత్రం తాము చేయాల్సింది చేస్తామని కూడా అంటున్న వారు ఉన్నారు.

పాస్ అయితేనే…?

ఏ నాయకుడికి అయినా జనంలో గెలవడం ఎంత సవాలో సొంత జనాలను గెలవడం అంతకు మించిన సవాల్. పదవులూ మీదనే వర్తమాన రాజకీయాలో అందరూ ఆశపెట్టుకుంటారు. అర్హతలు అన్నవి పూర్తిగా సెకండరీ. పైగా వేచి ఉండడానికి ఇవి పాతకాలం రోజులు కానే కావు. ఇలా ఎమ్మెల్యే అయ్యామా అలా మంత్రి కుర్చీ పట్టామా అన్నదే నాయకులకు కావాలి. మరి జగన్ అందరి కోరికలూ తీర్చగలరా. సరిగ్గా ఇక్కడే ఈ బంపర్ మెజారిటీ జగన్ కి కడు భారంగా ఉందిట. పైగా భయపెడుతోందిట. దాంతో జగన్ ఆచీ తూచీ పదవులు పంచాలి. అదే సమయంలో అసంతృప్తివాదులను దారికి తెచ్చుకొవాలి. లేకపోతే మాత్రం 2022 న్యూ ఇయరే జగన్ కి వెరీ బ్యాడ్ గా స్టార్ట్ అవుతుంది అన్నది వైసీపీలో వినిపిస్తున్న మాట. ఈ సమయం కోసమే టీడీపీ కూడా ఎదురుచూస్తోందిట. జగన్ మంత్రి వర్గ విస్తరణ చిచ్చు రేపితే ఆ మంటలలో చలి కాచుకోవడానికి టీడీపీ రెడీగా ఉంటుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే వైసీపీలో కనబడని అసమ్మతి ఉందిట. పదవులు దక్కని వారు బాబు తో టచ్ లో ఉంటారు అనడంతో సందేహమే లేదుగా.

Tags:    

Similar News