ఆ విషయంలో టీడీపీని తప్పు పట్టి ఏం ప్రయోజనం.. ?

అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు అన్నది ముతక సామెత. కేంద్రంలోని ప్రభుత్వం అమ్మ అనుకుంటే రాష్ట్రాలు పిల్లలే. ఇక అమ్మకు అందరు బిడ్డలూ సమానమే, అయితే [more]

;

Update: 2021-06-28 02:00 GMT

అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు అన్నది ముతక సామెత. కేంద్రంలోని ప్రభుత్వం అమ్మ అనుకుంటే రాష్ట్రాలు పిల్లలే. ఇక అమ్మకు అందరు బిడ్డలూ సమానమే, అయితే కొందరు మాత్రం ముద్దు బిడ్డలు. బీజేపీకి ఉత్తరాది పార్టీ అన్న పేరు ఉంది. దానికి తగినట్లుగానే దక్షిణాది మీద వివక్ష కూడా కొనసాగుతోందని చాలా మంది నాయకులు ఇప్పటికే ఆడిపోసుకున్నారు. అయినా కేంద్రం బేఖాత‌ర్ అన్నట్లుగానే ఉంది. నాలుగు ఓట్లు ఎక్కడ ఉంటే అక్కడే అన్నం వడ్డిస్తోంది. మరి ఏపీ లాంటి చోట ఎప్పటికీ ఖాళీ కంచమేనా. జగన్ ప్రత్యేక హోదా విషయంలో నిరాశలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. పైగా ఆయన టీడీపీని తప్పుపడుతున్నారు. కానీ ఆయన చేయాల్సింది ఇక్కడ చాలానే ఉంది అన్నది మేధావుల మాట.

మెడలు వంచాల్సిందే…?

కేంద్రం మెడలు వంచుతామని విపక్షంలో ఉన్నపుడు జగన్ చెప్పారు. అప్పటికే ఆయన మీద సీబీఐ కేసులు ఉన్నాయి. మెడలు వంచడానికి నాడు లేని భయం నేడు ఎందుకు వస్తుంది. అంటే జగన్ మరో మాట చెబుతున్నారు. కేంద్రానికి మన అవసరం లేనంతంగా ఎంపీల మద్దతు ఉంది అని. అది కరెక్టే. కానీ లోక్ సభలో మాత్రమే బీజేపీ బలంగా ఉంది. రాజ్యసభలో ఆ పార్టీ ఇప్పటికీ మైనారిటీలోనే ఉంది. ఈ రోజుకు 93 మంది రాజ్యసభ సభ్యులు బీజేపీకి ఉన్నారు. వచ్చే ఏడాదికి ఆ నంబర్ 75కి తగ్గిపోతుంది. అదే సమయంలో జగన్ బలం పెరుగుతుంది. అంటే జగన్ అవసరం బీజేపీకి ఇంకా పెరిగినట్లే కదా. జగన్ గత రెండేళ్ళుగా బేషరతుగానే మద్దతు ఇస్తూ వచ్చారు. మరి మద్దతు కోరే పార్టీకి ప్రత్యేక హోదా డిమాండ్ ఎందుకు పెట్టడం లేదు అన్నదే ఇక్కడ ప్రశ్న.

పోరాడాల్సిందే ….

హోదా విషయంలో కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని జగన్ అంటున్నారు. ఆ విషయం ఆయన చేస్తున్నది కేవలం విన్నపం మాత్రమే. విన్నపాలకు మోడీ సర్కార్ కరుగుతుంది అని ఎవరూ అనుకోరు. మరి జగన్ కేంద్రంతో సఖ్యతగా ఉండి కూడా మిగిలిన రాష్ట్రాల కంటే కూడా తక్కువ వాక్సినే పొందగలిగారు. నిధుల విషయంలోనూ ఉత్త చేయే చూపిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ సవరణ బడ్జెట్ ని కేంద్రం ఆమోదించలేదు. అంటే వియ్యంతో జగన్ రెండేళ్ళలో ఏమీ సాధించలేకపోయారు అన్నది తెలిసిపోతోంది. అందుకే కయ్యంతోనే సాధించాలేమో అన్న సూచన కూడా వస్తోంది. కయ్యం అంటే మరీ చంద్రబాబు లాగా అన్నీ తెంచేసుకోవడం కాదు, రాజ్యసభలో బీజేపీ అవసరాలను అడ్డం పెట్టుకుని బ్రేకులు వేయాలి. తమకు హోదా సహా విభజన హామీలు ఇస్తే రాజ్యసభలో మ‌ద్దతు ఉంటుందని గట్టిగా చెప్పగలగాలి.

రాజకీయ వ్యూహాలే ..?

కేంద్రానికి ఎపుడు పూర్తి మెజారిటీ వస్తుందో. మరెపుడు సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందో ఎవరైనా ఊహించగలరా. ఆలా అనుకుని డిమాండ్లు వాయిదా వేసుకోగలరా. జగన్ అనుకున్నట్లుగానే రేపటి రోజున బీజేపీకి కానీ యూపీయే కి కానీ పూర్తి మెజారిటీ రాక సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడ్డాయి అనుకుందాం. అపుడు కేంద్రంలోని పెద్దలు ప్రత్యేక హోదా ఇస్తామంటే అడ్డు పెట్టేందుకు అదే సంకీర్ణం లోని ఇతర పార్టీలు రెడీ అయితే హోదా ఎక్కడికి పోతుంది అన్నది కూడా ప్రశ్నేగా. ఇక ఢిల్లీల్లోని కేజ్రీవాల్, బెంగాల్ లోని మమతా బెనర్జీ, తమిళనాడు స్టాలిన్ వంటి వారు కేంద్రంతో సఖ్యత లేకుండా తమ డిమాండ్లు ఎలా సాధించుకుంటున్నారు. అంటే రాజకీయ వ్యూహాలతో కూడిన పోరాటం అవసరమని తేలుతున్న సత్యం. అందువల్ల జగన్ బీజేపీ ని అర్ధించే కంటే అదిలించి బెదిరించే స్థితికి చేరుకుంటే చిటికలో హోదా వచ్చి తీరుతుంది. అయితే ఈ మార్గంలో ఎన్నో రిస్కులు ఉన్నాయి. జగన్ మీద కేసులు ఉన్నందువల్ల బీజేపీ పెద్దలు ఏమైనా చేస్తారు అన్నది కూడా అంతా ఊహిస్తారు. కానీ జనం కోసం బీజేపీ మెడలు వంచిన నాడు జగన్ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు, అపుడు కక్ష సాధింపు చర్యలు ఎవరు చేపట్టినా జగన్ చేతిలో చిత్తు కాక తప్పదు.

 

Tags:    

Similar News