ఆయన ఊసెత్తడం వేస్టేనా… ?

జగన్ రాజకీయ వైఖరిలో బాగా మార్పు కనిపిస్తోంది. గతంలో ఆయన ఏదైనా విమర్శ చేయాలి అనుకుంటే చంద్రబాబు పేరుని గట్టిగా ప్రస్తావించేవారు. ఆయన గురించి ఏవో చెబుతూ [more]

;

Update: 2021-06-29 03:30 GMT

జగన్ రాజకీయ వైఖరిలో బాగా మార్పు కనిపిస్తోంది. గతంలో ఆయన ఏదైనా విమర్శ చేయాలి అనుకుంటే చంద్రబాబు పేరుని గట్టిగా ప్రస్తావించేవారు. ఆయన గురించి ఏవో చెబుతూ విమర్శలు చేస్తూ మీడియా ఫోకస్ అటు అయ్యేలా చేసేవారు. ఇదంతా తొలి ఏడాదిలో జరిగిన పొరపాట్లు, తడబాట్లుగా జగన్ గుర్తించినట్లున్నారు. అందుకే ఆయన ఇపుడు చంద్రబాబు అన్న నాలుగు అక్షరాలను అసలు ఎక్కడా పలకడంలేదు. గత ప్రభుత్వంలో అలా అన్నారు, కానీ ఏమీ చేయలేకపోయారు అంటూ పొడి పొడి మాటలతొనే సరిపుచ్చుతున్నారు. మొత్తానికి జగన్ ఈ విషయంలో గట్టిగానే ఒక డెసిషన్ తీసుకున్నట్లుగానే ఉందని అంటున్నారు.

అనవసరమా…?

జగన్ రెండవ ఏడాది పాలన పూర్తి చేసాక బాగా నిలదొక్కుకున్నారు. మొత్తానికి అధికార యంత్రాంగాన్ని పకడ్బందీగా నడిపించడంలోనూ ఆయన విజయం సాధించారు. ఆయన ప్రయారిటీలు చాలా ఉన్నాయి. జనాలకు ఏం చేస్తే ఓటు పడుతుందో కూడా తెలుసు. తాను ఏం చేయాలో కూడా పూర్తి అవగాహన ఉంది. అందువల్ల పదే పదే చంద్రబాబుని తలచుకుని అనవసరంగా జనాలకు గుర్తు చేయడం ఎందుకు అన్న ధోరణిలో జగన్ ఉన్నారని చెబుతున్నారు. ఆలా ఒక ముఖ్యమంత్రి నోట ప్రతిపక్ష నేత‌ పేరు వస్తే ఫోకస్ కూడా అటు వైపే పోతుందని కూడా గ్రహించే జగన్ బాగా జాగ్రత్త పడుతున్నారు అంటున్నారు.

వారితోనే…

చంద్రబాబును కానీ లోకేష్ ని కానీ కట్టడి చేయడానికి మంత్రులు సరిపోతారు అన్నదే జగన్ ఆలోచనగా ఉంది. తాను పూర్తిగా అధికారిక కార్యక్రమలకు పరిమితం కావాలనే ఆయన నిర్ణయించుకున్నారు. తాను నోరు విప్పకపోయినా టీడీపీని బదనాం చేసేందుకు వైసీపీ బ్యాచ్ ఎటూ రెడీగా ఉంచారు. కాగల కార్యం వారు నెరవేర్చడమే మంచిది అన్నదే జగన్ పాలసీగా ఉందిట. దీని మీద మరో రకమైన విశ్లేషణ కూడా వైసీపీలో వినిపిస్తోంది. అది ఆశ్చర్యకరంగానూ, ఆసక్తికరంగానూ ఉంది.

పోటీ కాదట ….

రేపటి ఎన్నికల్లో తనకు తానే పోటీ అని జగన్ భావిస్తున్నారుట. 2024 ఎన్నికలకు టీడీపీ బీజేపీ, జనసేన కలసి వచ్చినా కూడా తమకు ఏ మాత్రం పోటీ కాదని జగన్ అంచనా వేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మూడు పార్టీల మధ్య పైకి కనిపించకపోయినా ఇప్పటికే ఒక అనుబంధం ఉందని, జనాలకూ అది బాగాతెలుసు అని జగన్ తలపోస్తున్నారుట. ఇక ఈ మూడింటిలో పెద్ద పార్టీ టీడీపీయే తమకు పోటీ కానపుడు చంద్రబాబు జపం చేసి ఆయన్ని మీడియాలో లైవ్ లో ఉంచడం వేస్ట్ అన్నది కూడా జగన్ ఆలోచనట. అందుకే ఆయన చంద్రబాబు అన్న నాలుగు అక్షరాలను పూర్తిగా మరచిపోతున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. జనాలకు మేలు చేస్తే తననే మళ్లీ మళ్లీ ఎన్నుకుంటారు, కాబట్టి ఆ క్రెడిబిలిటీని పెంచుకోవడం మీదనే జగన్ దృష్టి పూర్తిగా ఉందని అంటున్నారు. మొత్తానికి జగన్ నోట చంద్రబాబూ అన్న మాటను ఇప్పట్లో వినలేకపోవచ్చేమో.

Tags:    

Similar News