నాటి ఆవేశం నేడు నిలువెత్తు ప్రశ్నగా… ?

ఆవేశం ఉండాలి. కానీ అది ఆచరణలో చూపించాలి. అయిన దానికీ కానిదానికీ ఆవేశపడితే రాజకీయాల‌లో అసలు కుదరదు, అందునా నాయకుడికి ఏ మాత్రం తగని వ్యవహారం. సరిగ్గా [more]

Update: 2021-06-30 06:30 GMT

ఆవేశం ఉండాలి. కానీ అది ఆచరణలో చూపించాలి. అయిన దానికీ కానిదానికీ ఆవేశపడితే రాజకీయాల‌లో అసలు కుదరదు, అందునా నాయకుడికి ఏ మాత్రం తగని వ్యవహారం. సరిగ్గా ఏణ్ణర్ధం క్రితం ముఖ్యమంత్రి జగన్ తనకు మెజారిటీ లేని శాసనమండలి వద్దు అనేసుకున్నారు. అంతే కాదు దానివల్ల జనాలకు ఏం ఒరుగుతుంది అని కూడా ఆయన లాజిక్ పాయింట్ తీశారు. ఇక శాసన మండలి నిర్వహణ వల్ల ఏడాదికి అరవై కోట్ల దాకా ఖర్చు అవుతుంది అని కూడా లెక్కలు చెప్పారు. మొత్తానికి 2020 జనవరి లో ప్రత్యేక సమవేశం పెట్టి మరీ మండలికి మంగళం పాడుతూ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించారు.

ఇపుడు ముద్దా..?

నాడు మెజారిటీ లేదు కాబట్టి మండలి వద్దు అనుకున్నారు, ఇపుడు మెజారిటీ వచ్చింది కాబట్టి ముద్దు అయిందా జగన్ అంటూ రెచ్చగొట్టే విమర్శలు చేస్తోంది టీడీపీ, ఇది పచ్చి అవకాశవాదం, మడమ తిప్పడం అంటే కూడా ఇదే అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య అంటున్నారు. మెజారిటీ ఉన్న సమయంలో కూడా మండలి మాకు వద్దు అనుకునంపుడే విలువ, మాటకు నిలబడినట్లు అవుతుంది అంటున్నారు రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు. మొత్తానికి శాసన మండలిలో వైసీపీకి మెజారిటీ వచ్చిందన్న ఆనందం కాస్తా ఈ ఈటెల లాంటి మాటలతో ఆవిరి అయిపోతోంది.

జవాబు ఉందా…?

మండలికి నాడు నో చెప్పిన వైసీపీ ఇపుడు ఎందుకు స్వాగతిస్తోంది అన్న దానికి జవాబు ఆ పార్టీ పెద్దల వద్ద లేదు. దీని మీద వైసీపీ అగ్ర నేత సజ్జల రామక్రిష్ణా రెడ్డి కూడా నీళ్ళు నమలాల్సి వస్తోంది. నాటి పరిస్థితుల కారణంగా మండలి వద్దు అనుకున్నామని ఆయన అంటున్నారు. టీడీపీ పెద్దల సభను చిల్లర రాజకీయాలకు వాడుకోవాలని చూస్తే అలా చేయాల్సివచ్చిందని చెబుతున్నారు. అయినా సరే మా డిమాండ్ అలాగే ఉంది. మేము మండలి రద్దు మీద ఇచ్చిన తీర్మానం వెనక్కి తీసుకోలేదు అని ఆయన గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో మండలి రద్దు చేయాలని తాము పదే పదే కేంద్రాన్ని కోరమని కూడా చెబుతున్నారు. మొత్తానికి పొంతన లేని మాటలతో సజ్జల మీడియా నుంచి తప్పించుకోవాలని చూసినా ఇది మచ్చగానే ఉంది అంటున్నారు.

తగ్గిన జగన్…

జగన్ రాజకీయ దూకుడు తో నాడు మండలి వద్దు అనుకున్నారు. ఇపుడు తన పార్టీలో ఉన్న చాలా మంది నాయకులకు అవకాశాలు ఇస్తూ దానిని వాడుకుంటున్నారు. ఈ ద్వంద నీతి వల్ల జగన్ ఇమేజ్ తగ్గిపోయిందన్న మాట అయితే వినిపిస్తోంది. జగన్ కూడా అందరి లాంటి నాయకుడేనా అన్న చర్చ కూడా వస్తోంది. మా నాయకుడు దూకుడు వల్లనే ఇలా జరిగింది. ఒక్క ఏడాదిన్నర కళ్ళు మూసుకుంటే మెజారిటీ వచ్చే దానికి కోరి మరీ రచ్చ చేసుకున్నామని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి జగన్ మండలి విషయంలో నాడు అన్న మాటలు కరెక్టా. లేక నేడు ఆయన వైఖరి రైటా అన్నదాని మీదనే చర్చ. ఒకటి రైట్ అయితే రెండో విషయంలో జగన్ కూడా తప్పు చేశాడుగా అన్న మాట సొంత పార్టీ వారే ఒప్పుకోవాల్సిందే. మరో వైపు మడమ తిప్పేసిన జగన్ అంటూ టీడీపీ జీవితకలం ముద్ర వేయడానికి చాన్సూ ఇచ్చేశాడు అంటున్నారు.

Tags:    

Similar News