జ‌గ‌న్ ఇలా చేస్తే.. భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవా?

ఏ నాయ‌కుడికైనా దూకుడు ఉండాలి. అయితే.. అది ఒక్కొక్కసారి విక‌టిస్తుంది. అలాగ‌ని ప్రతిసారీ.. దూకుడు లేకుండా వుంటే కూడా క‌ష్టమే. విష‌యాల‌ను బ‌ట్టి.. ప‌రిస్థితిని బ‌ట్టి..దూకుడుగా ముందుకు [more]

Update: 2021-07-11 14:30 GMT

ఏ నాయ‌కుడికైనా దూకుడు ఉండాలి. అయితే.. అది ఒక్కొక్కసారి విక‌టిస్తుంది. అలాగ‌ని ప్రతిసారీ.. దూకుడు లేకుండా వుంటే కూడా క‌ష్టమే. విష‌యాల‌ను బ‌ట్టి.. ప‌రిస్థితిని బ‌ట్టి..దూకుడుగా ముందుకు వెళ్లాలి. అయితే.. ఈ విష‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ వెనుక‌బ‌డుతున్నార‌నే వాద‌న వ‌స్తోంది. ఆయ‌న ఆదిలో తీసుకున్న దూకుడు నిర్ణయాలు చాలా వ‌ర‌కు విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో కొంత నెమ్మదించారు. అలాగ‌ని పూర్తిగా వెనుక‌బ‌డి పోలేదు. కానీ, ఎక్కడా దూకుడుగా ఉండాలో అక్కడ ఉండ‌కుండా.. అవ‌స‌ప‌రం లేని విష‌యాలలో దూకుడుగా వ్యవ‌హ‌రిస్తార‌న్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఆదిలో అలా…..

ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మ‌ద్య మ‌రోసారి నీటి వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి. వాస్తవానికి గ‌తంలో మాజీ సీఎం కిర‌ణ్ కుమార్‌రెడ్డి చెప్పిన‌ట్టు.. రాష్ట్రాల విభ‌జ‌న‌తో ఎల్లకాలం ఈ వివాదాలు కొన‌సాగుతూనే ఉంటాయి. మ‌రో వందేళ్లు గ‌డిచినా.. నీటి వివాదాలు కొన‌సాగుతూనే ఉంటాయి. ఇలాంటి విష‌యాల్లో ఆచి తూచి వ్యవ‌హ‌రించాలి. అయితే.. ఆదిలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జ‌గ‌న్ వ్యవ‌హ‌రించిన తీరుతో ఇక‌, నీటి వివాదాల‌కు ఫుల్ స్టాప్ ప‌డుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఈ వివాదాలు ఇంకా కొన‌సాగుతున్నాయి.

పరిష్కారం రావాలంటే?

మ‌రోమాట‌లో చెప్పాలంటే.. ఇంకా ఇవి పెద్దవ‌య్యాయ‌నే చెప్పాలి. అయితే.. ఎప్పటికైనా.. ఈ వివాదాలు ఉంటాయ‌ని, త‌ప్పద‌ని అంటున్న నిపుణుల హెచ్చరిక‌ల నేప‌థ్యంలో సామ‌ర‌స్యంగానే చ‌ర్చల ద్వారా వీటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది త‌ప్ప.. మ‌రో వ్యూహం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే.. కొన్ని ద‌శాబ్దాలుగా.. నెల‌కొన్న క‌ర్ణాట‌క – మ‌హారాష్ట్రల మ‌ధ్య నీటి వివాదాలు.. తాజాగా ఒక కొలిక్కి వ‌చ్చాయి. నిజానికి ఇరు రాష్ట్రాలూ కూడా.. నీటి వివాదాల‌పై కోర్టుకు వెళ్లాయి. అయితే.. అక్కడ‌కూడా ఏళ్ల త‌ర‌బ‌డి కేసులు తేల‌క పోవ‌డంతో తాజాగా సీఎం య‌డియూర‌ప్ప.. మ‌హారాష్ట్ర మంత్రి కూర్చుని చ‌ర్చించుకున్నారు. ఫ‌లితంగా ఒక ప‌రిష్కారం వ‌చ్చింది.

కోర్టుకు వెళితే…?

అలానే ఏపీ-తెలంగాణ‌ల మ‌ధ్య నెల‌కొన్న వివాదాల‌ను కూడా చ‌ర్చల ద్వారానే ప‌రష్కరించుకోవాల్సి ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ విష‌యంలో ఏ మాత్రం తేడావ‌చ్చినా.. కోర్టుకు వెళ్లినా.. ఎలాంటి ప్రయోజ‌నం లేక‌పోగా.. త‌ప్పులు చేసిన‌ట్టు అవుతుంద‌ని.. ఇది చారిత్రక త‌ప్పిదంగా నిలిచిపోతుంద‌ని అంటున్నారు. కానీ, జ‌గ‌న్ మాత్రం ఇప్పుడు మ‌ళ్లీ చ‌ర్చల‌కు వెళ్లడం మానేసి.. కోర్టుకు వెళ్లాల‌ని నిర్ణయించుకుంటున్నారు. దీనిపై న్యాయ ప‌రిశీల‌న కూడా సాగుతోంది. ఇదే క‌నుక జ‌రిగితే.. ఏపీ-తెలంగాణ‌ల మ‌ధ్య నెల‌కొన్న వివాదాలు.. హైకోర్టు, సుప్రీం కోర్టు అంటూ.. రెండుమూడు ద‌శాబ్దాల పాటు ఆల‌స్యమైనా ఆశ్చర్యపోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. మ‌రి ఈ విష‌యంలో జ‌గ‌న్ ఎలా వ్యవ‌హ‌రిస్తారో చూడాలి.

Tags:    

Similar News