కమ్మ క్యాస్ట్ అంటేనే అంత కసి అయితే ఎలా?

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేస్తారన్న పేరుంది. ఆయన సంక్షేమ పథకాలను కూడా పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా అందిస్తానని పదే [more]

Update: 2021-07-02 05:00 GMT

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేస్తారన్న పేరుంది. ఆయన సంక్షేమ పథకాలను కూడా పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా అందిస్తానని పదే పదే చెబుతున్నారు. కానీ పదవుల పంపకంలో మాత్రం జగన్ ఒక్క సామాజికవర్గాన్ని పక్కన పెట్టినట్లే కన్పిస్తుంది. ఈ రెండేళ్లలో జగన్ భర్తీ చేసిన పదవుల్లో కమ్మ సామాజికవర్గంలో ఒక్కరికి కూడా జగన్ పదవులు ఇవ్వలేదు. ఎస్.సి, ఎస్టీ,బీసీ, మైనారిటీ, కాపు కులాలకు ప్రాధాన్యత ఇచ్చిన జగన్ కమ్మ కులాన్ని మాత్రం దగ్గరకు రానివ్వడం లేదు.

రెండేళ్లలో….?

చంద్రబాబు సామాజికవర్గం అని వారిని పక్కనపెట్టారా? అన్న చర్చ నడుస్తుంది. నిజానికి కమ్మ సామాజికవర్గమైనా గత ఎన్నికల్లో జగన్ కు అనేకమంది నేతలు అండగా నిలిచారు. అనేక నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గం నేతలే దగ్గరుండి వైసీపీ అభ్యర్థులను గెలిపించారు. అయినా జగన్ వారిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కేబినెట్ లో ఒక్క కొడాలి నాని తప్ప ఎక్కడా కమ్మ సామాజికవర్గం నేతలకు చోటు లేకుండా పోయింది.

మర్రి రాజశేఖర్….

నిజానికి చిలకలూరి పేటలో విడుదల రజనీ ఎమ్మెల్యే అయ్యేందుకు మర్రి రాజశేఖర్ పని చేశారు. తన సీటును కూడా త్యాగం చేశారు. కానీ రెండేళ్లలో అనేక అవకాశాలు వచ్చినా జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. తన పట్ల నమ్మకంగా ఉన్న మర్రి రాజశేఖర్ కు జగన్ ముందే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇటీవల అదే జిల్లా నుంచి లేళ్ల అప్పిరెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మర్రిని దూరం పెట్టడం కూడా చర్చనీయాంశమైంది.

రావి వెంకటరమణ….

అదే సమయంలో పొన్నూరు నియోజకవర్గంలో ఐదు సార్లు వరసగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర ఓటమికి కారణమైన రావి వెంకటరమణకు కూడా జగన్ ఇంతవరకూ పదవి దక్కలేదు. కిలారు గెలుపులో రావి వెంకటరమణ కీలక పాత్ర పోషించారు. ఆయనకు పదవి ఇంతవరకూ జగన్ ఇవ్వకపోవడాన్ని కూడా పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. నామినేటెడ్ పదవి ఆయనకు ఇస్తే బాగుండేదన్న సూచనలు వస్తున్నాయి. మొత్తం మీద సామాజిక సమీకరణాలను బాగా ఫాలో అయ్యే జగన్ కమ్మ క్యాస్ట్ అంటేనే పక్కన పెడుతున్నట్లే కనపడుతుంది. ఇది భవిష్యత్ లో పార్టీకి మంచిది కాదంటున్నారు.

Tags:    

Similar News