లెక్కలు పక్కాగానే ఉన్నాయ్… సాధ్యమయ్యే పరిస్థితి లేదుగా?

ఏపీ ప్రభుత్వం వాస్తవంలో చేస్తున్న దానికి.. ప్రచారం చేస్తున్న దానికి మ‌ధ్య పొంతన ఉండ‌డం లేదు. దీనిపై ఎన్ని విమ‌ర్శలు వ‌చ్చినా.. జ‌గ‌న్ స‌ర్కారు మాత్రం ప్రచారానికి [more]

Update: 2021-08-12 12:30 GMT

ఏపీ ప్రభుత్వం వాస్తవంలో చేస్తున్న దానికి.. ప్రచారం చేస్తున్న దానికి మ‌ధ్య పొంతన ఉండ‌డం లేదు. దీనిపై ఎన్ని విమ‌ర్శలు వ‌చ్చినా.. జ‌గ‌న్ స‌ర్కారు మాత్రం ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తాజాగా పేద‌ల‌కు ఇళ్లు ప‌థ‌కం కింద కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లను నిర్మిస్తున్నట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. దీనికి సంబంధించి సీఎం జ‌గ‌న్ భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ, ఇది మోయ‌లేని భారంగా మారుతోంద‌ని అధికార పార్టీ నేత‌లే చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విష‌యం నేత‌ల మ‌ధ్య గుస‌గుస‌గా జోరుగానే సాగుతోంది.

ప్రతి నిరుపేదకు….

రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చుతానని ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఇళ్లు లేని నిరుపేద ఎక్కడా ఉండకూడదన్నదే లక్ష్యమని.. దీన్ని నెరవేర్చేందుకు అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటాన‌ని చెప్పారు. అనుకున్నట్టుగానే స్థ‌లాలు కేటాయించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చారు. కానీ, ఇల్లు క‌ట్టి ఇచ్చే విష‌యంలోనే జ‌గ‌న్‌కు ఇప్పుడు పిడుగు ప‌డిన‌ట్టు అనిపిస్తోంది. ఇళ్ల నిర్మాణానికి 50 వేల 944 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయ‌ని అధికారులు అంచ‌నాలు సిద్ధం చేశారు.

ఆచరణలో మాత్రం…..

కానీ, అంత మొత్తం ఖ‌ర్చు చేసే ప‌రిస్థితి ఏపీకి లేకుండా పోయింది. ఏకంగా 17 వేల కాలనీలు కొత్త ఇళ్ల నిర్మాణం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు తిరుగులేకుండా చేసుకోవాల‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నారు. పైకి బాగానే ఉన్నప్పటికీ.. ప్రతిప‌క్షాల ఊహ‌ల‌కు కూడా అంద‌ని విధంగా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తే బాగానే ఉంటుంద‌ని.. కానీ, నిధులు లేక‌పోవ‌డంతో.. ఈ ప‌థ‌కం పిడుగులాగా మారింద‌ని పార్టీ నేత‌లే చెబుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.95 కోట్లు ఉందని, ప్రభుత్వం 30 లక్షల ఇళ్లస్థలాలు రిజిస్ట్రేషన్‌ చేసిందని వైసీపీ నేత‌లు అంటున్నారు. ఇంటికి నలుగురు చొప్పున ఉన్నారనుకుంటే దాదాపు కోటి 20 లక్షల మందికి మనం ఇళ్లు క‌ట్టిన‌ట్టు అవుతుంద‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ ఆలోచ‌న‌లు లెక్కల వ‌ర‌కు బాగానే ఉన్నాయి.. అయితే ఆచ‌ర‌ణ‌లో సాధ్యమ‌య్యే ప‌రిస్థితి లేదు.

భారంగా మారడంతో….

సీఎం జ‌గ‌న్ ప్రక‌టించిన‌ట్టు.. 50,944 కోట్ల రూపాయ‌లు ఎప్పుడు ఖ‌ర్చు చేస్తార‌నే విష‌యంలో మాత్రం లాజిక్ లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ ఏడాది కేటాయించిన బ‌డ్జెట్ లో పేద‌ల‌కు క‌ట్టించి ఇచ్చే ఇళ్లకు సంబందించిన బ‌డ్జెట్‌ను కేవ‌లం 5 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే.. దీనిని బ‌ట్టి.. 50 వేల కోట్లు కేటాయించేందుకు, ఇళ్లు పూర్తయ్యేందుకు ఎన్ని సంవ‌త్సరాలు ప‌డుతుందో.. సీఎంకే తెలియాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌లో కొన్ని భారం కాగా.. మ‌రికొన్ని మ‌రింత భారంగా మారాయి. ఇప్పుడు ఇది ఏకంగా పిడుగుగామారింద‌నే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News