కసరత్తు పూర్తయిందట… త్వరలోనే ప్రకటన

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకంపై జగన్ ఆలోచనలో పడినట్లు తెలిసింది. వైవీ సుబ్బారెడ్డినే ఛైర్మన్ గా నియమించాలను కుంటే స్పెసిఫైడ్ అథారిటీని నియమించరు. పాలకమండలి నియామకంలో [more]

Update: 2021-06-27 00:30 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకంపై జగన్ ఆలోచనలో పడినట్లు తెలిసింది. వైవీ సుబ్బారెడ్డినే ఛైర్మన్ గా నియమించాలను కుంటే స్పెసిఫైడ్ అథారిటీని నియమించరు. పాలకమండలి నియామకంలో కొంత కసరత్తు చేయడానికి సమయం తీసుకోవడానికే జగన్ స్పెసిఫైడ్ అథారిటీని నియమించారని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి గడువు ఈ నెల 21వతేదీతో ముగిసింది.

క్షత్రియ సామాజికవర్గానికి….

అయితే జగన్ వెంటనే పాలకమండలి నియామకం చేపట్టలేదు. ఈసారి పాలకమండలిలో మార్పులు చేర్పులు చేయాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి స్థానంలో క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చే యోచనలో జగన్ ఉన్నారని చెబుతున్నారు. గతంలో వైఎస్ హయంలో కూడా కనుమూరి బాపిరాజు టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరించారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా క్షత్రియ సామాజికవర్గానికి టీటీడీ ఛైర్మన్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వైవీని పక్కన పెట్టి….

ఇందుకోసం జగన్ కసరత్తులు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి సంతృప్తి పడేలా మరో ముఖ్యమైన పదవిని ఇవ్వాలన్నది జగన్ ఆలోచన. ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డితో ఈ విషయాన్ని చర్చించినట్లు తెలిసింది. రాజ్యసభ అయితే కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుందని కూడా వైవీ సుబ్బారెడ్డికి జగన్ చెప్పినట్లు సమాచారం. ఇక టీటీడీ పాలకమండలిలో సభ్యుల నియామకంపై జాతీయ స్థాయిలో కూడా వత్తిడి వస్తున్నట్లు తెలిసింది.

టీటీడీతో పాటు….

కేంద్రంలో అధికార పార్టీలో ఉన్న పెద్దల నుంచి కొందరి పేర్లు సిఫార్సు చేసినట్లు సమాచారం. దీంతో టీటీడీ పాలకమండలి నియామకంపై జగన్ కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు శ్రీశైలం దేవస్థానం, మరికొన్ని నామినేటెడ్ పోస్టులను కూడా జగన్ భర్తీ చేయాలని భావిస్తున్నారు. దీనిపై సీనియర్ నేతలతోనూ జగన్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News